నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 37 రోజులుగా ఢిల్లీలో 3 లక్షల మంది రైతులు నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా 6వ విడత కేంద్రంతో 41 రైతు సంఘాలు జరిపిన చర్చలు ఒక అడుగు ముందుకు, రెండు అడుగుల వెనక్కు అన్న చందంగా ముగిశాయి. ఐదు గంటల పాటు ముగ్గురు కేంద్ర మంత్రులు, 41 రైతు సంఘాలు జరిపిన చర్చల్లో దాదాపు ఎలాంటి పురోగతి లేకపోయినా, చర్చలను కొనసాగించాలని ఇరువర్గాలు నిర్ణయించడమే పెద్ద పురోగతిగా చెప్పుకుంటున్నారు. చర్చల్లో ప్రధానంగా నూతన చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు పట్టుపట్టాయి. గతంలో కూడా ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఒక చట్టాన్ని రద్దు చేసినట్టు రైతు సంఘాలు గుర్తు చేశాయి. అయితే చట్టాల రద్దుకు కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్, ఆహార, రైల్వే మంత్రి పియూష్ గోయల్, వాణిజ్యశాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాష్ అంగీకరించలేదు. చట్టాల రద్దు కాకుండా సవరణలు మాత్రమే సూచించాలని రైతు సంఘాలను కోరారు. దీంతో కీలకమైన సాగు చట్టాల రద్దు అంశంపై చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు.
మద్దతు ధరకు లభించని హామీ
నూతన చట్టాలు అమల్లోకి వచ్చినా పంటలకు మద్దతు ధరలు కల్పించే విషయంలో కేంద్రం చట్టబద్దత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. దీనికి కూడా కేంద్ర మంత్రులు అంగీకరించలేదు. మద్దతు ధర కల్పించేందుకు చట్టబద్దత కల్పించడం కుదరదని, లిఖిత పూర్వక హామీ మాత్రమే ఇవ్వగలమని కేంద్ర మంత్రులు తేల్చి చెప్పారు. దీంతో కీలకమైన రైతుల డిమాండ్లకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. సమస్య పరిష్కారానికి కమిటీ వేస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినా రైతు నేతలు అంగీకరించలేదు.
ఢిల్లీ కాలుష్యంపై రైతులపై క్రిమినల్ కేసులా?
పంజాబ్, హర్యానాల్లో పంట కోత అనంతరం వచ్చే వ్యర్థాలకు నిప్పు పెట్టడం వల్ల పెద్ద ఎత్తున గాలి కాలుష్యం ఢిల్లీని చుట్టుముడుతోందని, అలాంటి రైతులపై క్రిమినల్ కేసులు పెట్టే ప్రమాదం ఉందని, ఈ నిబంధన తొలగించాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండును మాత్రం మంత్రులు అంగీకరించారు. ఇక నూతన విద్యుత్ సవరణ బిల్లు అమల్లోకి వస్తే వ్యవసాయ విద్యుత్‌పై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు కూడా రద్దవుతాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ బిల్లు ఇంకా అమల్లోకి రాలేదు, కాబట్టి రైతులకు విద్యుత్ రాయితీలు యథాతథంగా అందేలా చూస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లు ఉపసంహరించుకునేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని రైతు సంఘాలు ప్రకటించాయి. నూతన విద్యుత్ సవరణ బిల్లు సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని రైతు సంఘాలు అభిప్రాయపడ్డాయి. విద్యుత్ రంగంపై కేంద్రం పూర్తి పెత్తనం చెలాయించడం అంటే రాష్ట్రాల హక్కులను కాలరాసినట్టేనని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
జనవరి నాలుగున ఏడోసారి..
వచ్చే ఏడాది జనవరి 4వ తేదీని మరోసారి చర్చలు జరపనున్నారు. నూతన సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం అనే అంశాలు ప్రధానంగా ఈసారి చర్చకు రానున్నాయి. అయితే రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుకోవాలని కేంద్ర మంత్రులు విజ్ఙప్తి చేశారు. ఢిల్లీలో చలితీవ్రత ఎక్కువగా ఉన్నందున నిరసన తెలుపుతున్న రైతుల్లో వృద్దులు, పిల్లలను వెనక్కు పంపించుకోవాలని రైతు సంఘాలను కోరారు. దీంతో చర్చలు సానుకూల వాతావరణంలో ముగిశాయి.