(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి హిందూ దేవుళ్ళు అంటే ఇష్టం లేదని బుధవారం సాయంత్రం విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ ఉత్తరాంధ్ర జోనల్ కో ఆర్డినేటర్ బుద్ధా వెంకన్న ఆరోపించారు.
మాన్సాస్‌లో ప్రస్తుతం జరుగుతున్న చర్యలకు విజయసాయిరెడ్డే కారణమని బుద్దా వెంకన్న ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుల, మత, కుటుంబం అని తేడా లేకుండా చిచ్చు పెడుతున్నారన్నారు. అశోక్ కుటుంబానికి మంచి పేరు, ప్రతిష్టలు ఉన్నాయని, పూసపాటి వంశీయులు విజయనగర ప్రజలకు అనేక సేవలు చేశారని తెలిపారు. టీడీపీలో సీనియర్ నాయకుడుగా , కేంద్ర, రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సమయంలో అశోక్ ఎవరి మీద కక్ష సాధింపులకు పాల్పడిన సందర్భం లేదన్నారు. బైలాస్ ఆధారంగా ట్రస్ట్‌లు ఏర్పాటు చేస్తారని, ట్రస్ట్‌లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం దారుణమని అన్నారు. అశోక్ గజపతిరాజుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
ట్రస్ట్ భూములపై వైసీపీ కన్ను
మాన్సాస్ సేవలను గుర్తించకుండా ఆస్తులపై వైసీపీ నాయకులు దృష్టి పెట్టారని వెంకన్న ఆరోపించారు. ఆనంద గజపతిరాజు కుమార్తె సంచైత గజపతిగా ఎక్కడా పేరు నమోదు కాలేదని, సంచైత శర్మగానే నమోదు అయిందని తెలిపారు. తప్పుడు జీవోలు ఇచ్చి కోర్టులను భ్రష్టు పట్టిస్తున్నారని, ఎన్నో కేసులు చూసిన అనుభవం ఉన్నందువలనే కేసులు అంటే వైసీపీ వాళ్ళకి ఈజీ ఐపోయిందని అన్నారు. ప్రజల కోసమే మాన్సాస్ ట్రస్ట్ పెట్టారని స్వార్ధం కోసమో, లాభం కోసమో కాదని స్పష్టం చేశారు. అశోక్ ఉంటే ఆటలు సాగవని సంచైతని తీసుకొచ్చి ట్రస్ట్ ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు.
కోట గోడలను బద్దలు చేయడానికి మామిడి మొక్కలు నాటుతున్నారని ఎద్దేవా చేశారు. చరిత్రను నేలమట్టం చేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు. అశోక్‌పై దాడికి దిగడం మంచి పద్ధతి కాదన్నారు. భక్తులు దానం చేసిన వివరాలు కూడా బయటకు తెలియకుండా ప్లాన్ చేస్తోందన్నారు. ట్రస్ట్ ఆస్తులు దోచుకోవడానికి పలు రకాల జీవోలను విడుదల చేస్తుందని విమర్శించారు. విజయనగరం ప్రజలు వీటన్నటిని గమనించి తిరుగుబాటు చేయాలని కోరారు. మాన్సాస్ కార్యాలయాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన ఆస్తులు ప్రజలే కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. కోర్టులను చులకన చేయడానికి సిఏం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
Also Read: రామకొలనులో శ్రీరాముని శిరస్సు..