(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ఒక రోజు,గురువారం జరిగే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు జూమ్ యాప్ ద్వారా గురు, శుక్రవారం రెండు రోజులు మాక్ అసెంబ్లీ నిర్వహించనుంది.ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
ఉద్దేశపూర్వకంగానే..
మార్చిలో ఉద్దేశపూర్వకంగానే బడ్జెట్ సమావేశాలు పెట్టలేదని,కరోనా వైరస్ తీవ్రత ఉన్న సమయంలో పెడుతున్న సమావేశం బాయ్‌కాట్ చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు.“ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయ్యింది.2 ఏళ్లలో ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు” అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు పెట్టాలని అప్పుడు టీడీపీ డిమాండ్ చేస్తే కరోనా ఉందని చెప్పారని, మరి ఇప్పుడు లేదా అని ప్రశ్నించారు.బడ్జెట్ సమావేశాలు ఒక్క రోజు పెట్టి తూతూ మంత్రంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు.కరోనా కట్టడికి వైద్యులతో ఒక్క రోజైనా సమావేశం పెట్టారా అని ప్రశ్నించారు.ఆసుపత్రుల్లో రోగులకు మందులు,బెడ్స్,ఆహారం లాంటి మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతుంటే, దహన సంస్కరాలకు రూ.15 వేలు ఇస్తారా? ఇదేం విధానం అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Must Read ;- ఏపీ బడ్జెట్ సమావేశాలు ఒక్కరోజే.. టీడీపీ బహిష్కరణ











