కరోనాపై మనం చేయాల్సింది రణమా?.. పోవాలంటే గ్రహాల అనుగ్రహమే శరణ్యమా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారి కోసం ప్రపంచం యావత్తూ ఎదురుచూస్తోంది.
జ్యోతిషం శాస్త్రమే.. వైద్యం కూడా శాస్త్రమే.. కానీ జనాన్ని కన్ఫ్యూజ్ చేసేలా ఈ శాస్త్రాలు తయారవకూడదు. అలాగని మనం చేస్తున్న అధ్యయనాలూ ఆగకూడదు. చీకట్లో రాయి వేయడం లాగా ఎవరికి తోచినట్టు కొత్త మందులు కనుక్కొంటున్నారు, కొత్త కొత్త సిద్ధాంతాలు తయారుచేస్తున్నారు. ఈ జాబితాలో జ్యోతిష్కులూ చేరిపోయారు. మన జాతకం మనకు తెలియదుగానీ కరోనా జాతకం చెప్పేస్తారట అంటూ విమర్శించేవారూ ఉన్నారు. మహామహులైన జ్యోతిష్కులే కరోనాకి బలైన విషయాన్ని మనం మరచిపోకూడదు.
శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందన్న సామెత మనకు ఉండనే ఉంది. ఫ్లూటు జింక ముందు ఊదు అన్నట్లుగా ప్లూటో గ్రహాన్ని తెచ్చి కరోనా ముందు ఊదుతున్నారు జ్యోతిష్కులు. అసలు రాహుకేతువులనే గ్రహాలుగా అంగీకరించడం లేదు కొంతమంది. మధ్యలో ఈ ఫ్లూటో అనే దశమ గ్రహాన్ని తీసుకొచ్చి వైరస్ ముందు కూర్చోబెట్టారు. జనాన్ని మందులతో మాయ చేస్తున్నది కొందరైతే గ్రహాలతో ఆడిస్తున్నది ఇంకొందరు. ఏది నిజమో ఏది అబద్దమో తెలియకపోయినా బతుకు తీపి అన్నిటినీ నమ్మేలా చేస్తోంది.
ఏమిటీ దశమ గ్రహం?
అసలు కరోనాకి ఇవేవీ కారణం కాదు షష్టగ్రహ కూటమే కారణం అంటారు కొందరు జ్యోతిష్కులు. లేదు లేదు కాలసర్పదోషంలో ఇన్ని గ్రహాలు కారణం అంటారు ఇంకొందరు. అదేమీ కాదు గురు, శనిల గ్రేట్ కంజక్షన్ మకర రాశిలో జరిగింది. అసలు రహస్యం ఇదే అంటారు మరికొందరు. ఇలా జ్యోతిష్కుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఆ శాస్త్రం మీద అపనమ్మకానికి కారణమవుతోంది. ఉన్న గ్రహాల గందరగోళానికి తోడు మధ్యలో ఈ దశమ గ్రహం ప్లూటో వచ్చి చేరింది. శని, యముడు సోదరులుగా పురాణ కథలు మనకు ఉన్నాయి.
ఇప్పుడు ఈ ప్లూటోని యముడు అంటున్నారు. పైగా శని, ప్లూటో మకర రాశిలో కలవడం 240 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. వీటి కలయిక జరిగినప్పుడు ఇలాంటి కొత్త కొత్త వైరస్ లు పుడుతుంటాయని ఒక వాదన. సాధారణంగా శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. మరి యముడి చెప్పే ఈ ఫ్లూటో ఒక రాశిలో 20 సంవత్సరాలు ఉంటుంది. రాశి చక్రాన్ని చుట్టి రావడానికి శనికి 30 ఏళ్లు పడితే ఫూటోకు 240 సంవత్సరాలు పడుతుంది. దాదాపు ప్రతి 30 ఏళ్లకూ ఒకసారి ఈ రెండు గ్రహాలూ కలుస్తుంటాయి.
ఇటీవల కాలంలో ఈ రెండు గ్రహాలు ఎప్పుడు కలిశాయో చూద్దాం. 26 డిసెంబరు 2017లోనే శని ధనుస్సులో ఉన్న ఫ్లూటోను కలిసింది. మరి అప్పుడు వైరస్ రాలేదు ఎందుకు? అనే ప్రశ్న ఒకటి. 31డిసెంబరు 2020న ఫ్లూటో మకర రాశి ప్రవేశం చేసింది. ఇది 16 జనవరి 2040 వరకూ మకరరాశిలో ఉంటుంది. ఈ మధ్యలోనే శని మకరాన్ని వదిలి కుంభానికి వెళ్లిపోతుందనుకోండి. మళ్లీ ఈ రెండు గ్రహాలూ 2052లో కుంభ రాశిలో కలుస్తాయి. అంటే ప్రతి 30 సంవత్సరాలకూ ఈ గ్రహాలు కలుస్తూనే ఉన్నాయని అర్థమవుతోందిగా.
వైరస్ ల పుట్టుకకు ఈ కలయిక కారణం అనడం లాజిక్ కు నిలబడదు. శని, ఫ్లూటోలు 2019లో మూడు డిగ్రీల సమీపంలోకి వచ్చాయి, దీంతోపాటు అక్కడ కేతువు కూడా ఉన్నాడు కాబట్టి అందుకే వైరస్ పుట్టింది అంటున్నారు. కేతువు అనేది చంద్రుడికి దక్షిణ బిందువు, పైగా ఇది యమస్థానం అంటారు అందుకే వైరస్ లు పుట్టాయి అనేది కొందర జ్యోతిష్కుల వాదన. అంతే కాదు ఈ రెండు గ్రహాలు కలిసిన ప్రతి సందర్భాల్లోనూ ప్రకృతి వైపరీత్యాలు, విధ్వంసాలు జరిగిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
ఎప్పుడెప్పుడు కలిశాయి?
శని, ఫ్లూటో గ్రహాలు 1982లో చిత్త నక్షత్రంలో తుల రాశిలో కలిశాయి. ఆ ఏడాది నవంబరులో తలెత్తిన ఆర్థిక మాంద్యానికి ఈ కలయికే కారణమట. పైగా అప్పుడు ఎయిడ్స్ మహమ్మారి పుట్టడానికి ఈ గ్రహాల కలయికే కారణమని ఢంకా బజాయించి మరీ జ్యోతిష్కులు చెబుతున్నారు. అలాగే 1915లో ఆరుద్ర నక్షత్రంలో మిధున రాశిలో కలిశాయి. అప్పుడు తుపానులు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయట. 1947లో కర్కాటక రాశిలో కలిసినప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు సంభవించాయంటున్నారు.
ఆ సమయంలో ప్రపంచ యుద్దం రావడానికీ, భారత్ – పాక్ విడిపోవడానికీ ఈ రెండు గ్రహాల కలయికే కారణమని అంటున్నారు. మరి మనకు స్వాతంత్ర్యం రావడం శుభపరిణామం కాదా? దీనికి జ్యోతిష పండితులు ఎలాంటి సమాధానం చెబుతారో?1914 నుంచి 1918 వరకూ మొదటి ప్రపంచ యుద్దానికి కారణం కూడా శని, ఫ్లూటోల కలయికే కారణమట. మొత్తానికి రెండు ప్రపంచ యుద్దాలకు కారణమైన ఈ గ్రహాలను మనం క్షమించకూడదేమో!
ధనుస్సు, మకర రాశులలోకి వస్తే..
మనకు కరోనా వైరస్ పుట్టడానికి కారణం ధనుస్సు, మకర రాశుల్లో ఈ రెండు గ్రహాలు కలవడమే అని ఈ పండితులు వాదిస్తున్నారు కాబట్టి ఆ సంగతి చూద్దాం. ఇంతకుముందు 1517-18లో ధనుస్సు రాశిలో ఈ గ్రహాల కలయిక జరిగింది. ఆఫ్రికాలో బానిసత్వానికి ఈ గ్రహాలే కారణమట. అంతేకాదండోయ్ క్రిస్టియానిటీలో చీలికకు కూడా ఈ గ్రహాలే కారణమంటున్నారు. ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్కులుగా చీలిపోయేలా చేశాయట. 1284లో మకర రాశిలో ఈ గ్రహాల కలయిక జరిగింది.
మకరం అనేది వ్యాపార రాశి కాబట్టి వెనిస్ బంగారు నాణెం ప్రవేశపెట్టడానికి కారణం కూడా ఈ గ్రహాలేనట. అదే యూరోపియన్ కరెన్సీకి నాంది పలికిందట. మకర రాశి కేవలం వ్యాపార రాశి మాత్రమే కాదట ఆధ్యాత్మిక రాశి కూడా అంటున్నారు. అప్పుడే ఇంగ్లండు రాజు ఎడ్వర్డు పాలనతో సంబంధం లేకుండా ప్రత్యేక చర్చ్ ను ఏర్పాటు చేశారట. అదే సంవత్సరం సుల్తాన్ కలావున్ ఆధునిక సిరియా అయిన మార్గాట్ ముట్టడిని కూడా చేపట్టాడట.
మొత్తానికి ఈ రెండు గ్రహాలూ ఎంత పెద్ద కథను నడపుతున్నాయో కదూ. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడల్లా గ్రహాలను దోషులుగా బోనులో నిలబెట్టడం అంటే ఇదే మరి. ఈ జ్యోతిష విశ్లేషణ చూస్తుంటే పైత్యం పరాకాష్టకు చేరుకున్నట్టు లేదూ. మనిషిలో నిగ్రహం లేనప్పుడే ఈ గ్రహాలు అవసరమవుతాయని రుజువు చేయడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలి? మరి మందు ఎవరికి వేయాలో ఇప్పుడు ఆలోచించాలి. ఈ గ్రహాలకు కూడా లాక్ డౌన్ విధించేస్తే ఏ గొడవా లేకుండా పోతుంది.











