కొమరం భీమ్ మే 20 ఉదయం 10 గంటలకు అభిమానుల ముందుకు రాబోతున్నాడు. తారక్ కు రాజమౌళి అందజేస్తున్న పుట్టిన రోజు కానుక ఇది. మహానటుడు ఎన్టీఆర్ పోలికలను పుణికిపుచ్చుకుని ‘కథానాయకుడు’గా చరిత్రను పునరావృతం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ తాతను మించని మనవడే.
ఆ సీనియర్, ఈ జూనియర్.. వీరిద్దరికీ మే నెలతో ఉన్న అనుబంధం విడదీయరానిది. మనవడు మే 20న పుడితే, తాత మే 28న జన్మించారు. ఆ లెక్క ఏమిటోగాని ఇద్దరి బాటా ఒక్కటేనని అర్థమవుతోంది. అయినా నేటి తరంలో తనకంటూ పేజీని అతి చిన్న వయసులోనే సృష్టించుకున్న నందమూరి తారక రామారవు జూనియర్ సినిమాలోకంలో ‘తారక్’లానే వెలిగిపోతున్నాడు. నందమూరి తారక రామారావు అనే బాలుడు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇస్తున్నాడని విన్నప్పుడు జనం పెద్దగా పట్టించుకోలేదు.
‘రామాయణం’లో బాల రాముడిగా చూసినప్పుడు హీరోగా ‘నిన్నుచూడాలని’ జనం అనుకున్నారు. స్టూడెంట్ నంబర్ వన్ గా సినిమా పాఠాలు నేర్చుకుని యువ హీరో నంబర్ వన్ గా మారారు. ‘ఆది’లోనే హిట్ పాదం మోపారు. చిన్న వయసులోనే షూటింగుల్లో అల్లరి రాముడి తిరిగినా ఊసరవెల్లిలా రంగులు మార్చలేదు. సినిమా అనే బృందావనంలో అతని నటన అదుర్స్.. అతని టెంపర్ కు అందరికీ బెదుర్సే. హీరోగా తన దమ్ము ఏమిటో నాన్నకు ప్రేమతో చూపించాడు. అతని శక్తికి అభిమానులు ఫిదా.. కొమరం భీమ్ గా ఆయన ఎలాంటి రౌద్రాన్ని చూపబోతున్నాడో వేచి చూడాలి. క్లుప్తంగా ఇదీ మన తారక రామ చరితం.
తారక్ తాతకు మాత్రమే జూనియర్
ఈ నందమూరి తారక రాముడు తన తాతకు మాత్రమే జూనియర్. తెలుగు సినిమా అనే ఓ మహా పుస్తకంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పేరు నందమూరి తారక రామారావు. మూడో తరంలో ఈ చరిత్ర పునరావృతమైంది. ఈ నట వారసత్వం రాజకీయ వారసత్వంగా మారుతుందో లేదో కాలమే నిర్ణయించాలి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రచార బాధ్యతలను కూడా ఈ జూనియర్ తీసుకున్నారు. పైగా తాత ప్రచార రథానికి సారథ్యం వహించింది ఈ జూనియర్ తండ్రి హరికృష్ణే కదా.
Also Read ;- తారక్ జీవితంలో ఇలాంటి బర్త్ డే రాకూడదు?
ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీకి అంతటి వెలుగులను నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ప్రస్తుతం మూడో తరం భుజస్కంధాలపై కూడా ఈ భారం పడక తప్పేలా లేదు. ఒక తరం వైభవం మూడో తరంలో కనిపిస్తుందంటారు. అది జూనియర్ ఎన్టీఆర్ రూపంలో నెరవేరుతుందోలేదో కాలమే నిర్ణయించాలి. 18 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమ రికార్డులను జూనియర్ ఎన్టీఆర్ తిరగ రాశారు. తాతకు ఉన్న స్టామినా ఈ జూనియర్ కు కూడా ఉందనడంలో అతిశయోక్తిలేదు.
కాకపోతే రాజకీయాల ప్రస్తక్తి వస్తున్నప్పుడల్లా ఈ జూనియర్ మౌనందాలుస్తున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రదర్శించిన దూకుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా నేటికీ ఎన్టీఆర్ ప్రచార శైలిని ఎవరూ మరచిపోలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ వివాహం విషయంలోనూ నారా చంద్రబాబు నాయుడు చాలా తోడ్పాటునందించారు. తన మేనల్లుడి కుమార్తెకే ఇచ్చి వివాహం జరిపించారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల జోలికి పోకుండా తన మానాన తాను సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.
సినిమా అనేది తనకు బతుకు తెరువని, రాజకీయం అనేది ఓ బాధ్యత అని నాటకీయ డైలాగులు చెబుతున్నారు. ఈ మే నెల అనుబంధం ఈ జూనియర్ ని రాజకీయాల వైపు నడిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. తెలుగు సినిమాకు తొలి పాన్ ఇండియా హీరో మహానటుడు నందమూరి తారక రామారావు అయితే నేటి తరంలో ఆ ఘనత ఈ జూనియర్ కు కూడా దక్కుతుంది. మన దేశంలో వేళ్ల మీద లెక్కించగలిగిన పాన్ ఇండియా హీరోల్లో ఈ తారక్ కూడా చేరిపోయారు.
ఎన్టీఆర్ జీవితంలో మెరుపులు
* మహానటుడు నందమూరి తారక రామారావు వంశంలో మూడో తరం సూపర్ స్టార్
* నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు 1983 మే 20న ఎన్టీఆర్ జూనియర్ జననం
* తాత సీఎంగా మొదటిసారి తెలుగుదేశం పార్టీతో అధికారంలోకి వచ్చిన ఏడాదే జూనియర్ ఎన్టీఆర్ జన్మించారు
* నటుడిగా తొలి వేషం 1991లో తాతతో కలిసి హిందీ బ్రహ్మర్షి విశ్వామిత్ర లో భరతుడి వేషం. అప్పటి వయసు 9 ఏళ్లు
* తొలి తెలుగు సినిమా బాల రాముడిగా రామాయణం 1996లో. నంది స్పెషల్ జ్యూరీ అవార్డు
* హీరోగా తొలి సినిమా 2001లో నిన్ను చూడాలని
* రాజమౌళితో తొలి ప్రయాణం స్టూడెంట్ నంబర్ 1
* నటుడిగా స్టామినాను నిరూపించిన సినిమా వినాయక్ దర్శకత్వంలోని ఆది
* ట్రిపుల్ ఆర్ తో హీరోగా 30 సినిమాల ప్రయాణం
* తొలి మల్టీస్టారర్ సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ తో మెగా ప్రయాణం
-హేమసుందర్
Must Read ;- జూనియర్ ఎన్టీఆర్ కోసం అభిమానుల ప్రత్యేక పూజలు