గురువారం జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది.పూర్తి స్థాయి చర్చకు అవకాశం ఇవ్వకుండా ఒక్కరోజు సమావేశాలు ఎలా నిర్వహిస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత కింజరపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.కాగా ఏపీ అసెంబ్లీ గురువారం సమావేశం కానుంది.సాధారణంగా బీఏసీ అనంతరం గవర్నర్ ప్రసంగం ఉంటుంది.గవర్నర్ ప్రసంగం ముగిశాక దన్యవాదాలు తెలిపే తీర్మానం అనంతరం బడ్జెట్ ప్రారంభం అవుతుంది.ఈ సారి 2.10లక్షల కోట్ల నుంచి రూ.2.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుందన్న అంచనాలున్నాయి.
ఒక్కరోజు మాత్రమే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంపై..
కాగా ఒక్కరోజు మాత్రమే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంపై టీడీపీ పలు వ్యాఖ్యలు చేసింది.ఆరునెలల్లోగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించని పక్షంలో సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉందనే భయంతోనే ఒక్కరోజు అసెంబ్లీ ఏర్పాటు చేసే ఉద్దేశం కనిపిస్తోందని టీడీపీ విమర్శిస్తోంది.అదే సమయంలో తత్కాలికంగా బడ్జెట్‌కు మూడునెలల పాటు గవర్నర్ ద్వారా ఆమోదింపజేసుకునే అవకాశం ఉన్నా..ప్రభుత్వం వేరే భయంతో ఈ నిర్ణయం తీసుకుందని అచ్చెన్నాయుడు విమర్శించారు.గత రెండేళ్లలో ఎన్నిసార్లు బడ్జెట్ సమావేశాలు జరిగాయని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు.. బడ్జెట్‌ను ఆమోదించుకోకుండా ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితికి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిందన్నారు.తాము గత మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సిందిగా కోరినా కరోనా పేరు చెప్పి ప్రభుత్వం వాయిదా వేసిందన్నారు.ప్రస్తుతం కొవిడ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కేవలం నామమాత్రపు సమావేశాలు నిర్వహించేందుకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాను అరికట్టే విషయమై సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఒక్కసారైనా వైద్య నిపుణులతో సమావేశమయ్యారా అని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు వ్యాక్సిన్ పంపిణీలోనూ ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైందన్నారు. ఆక్సిజన్,మందులు,బెడ్లు,ఆహారం లేక ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదన్నారు.
పూర్తి స్థాయి చర్చకు అవకాశం లేకుండా..
ఓవైపు రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్ననేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారని టీడీపీ ఎమ్మెల్సీ, ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.గత మార్చి నెలలో కరోనా కేసులు తక్కువగా ఉన్న సమయంలో బడ్జెట్ సమావేశాలు పెట్టేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదని, కేవలం ప్రతిపక్షం ప్రశ్నిస్తుందనే భయంతోనే అప్పట్లో సమావేశాలు పెట్టలేదని,ఇప్పుడు పూర్తి స్థాయి చర్చకు అవకాశం లేకుండా ఒక్కరోజు అసెంబ్లీ నిర్వహిస్తున్నారన్నారు.
అంచనా కంటే తక్కువగా ఆదాయం?
ఇక గత ఏడాది 2020-21గాను రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ రూపొందించారు.అందులో రెవెన్యూ వ్యయం రూ.1,80,392.65 కోట్లు కాగా మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లుగా అంచనా వేశారు. కొవిడ్ కారణంగా ఆర్థిక కార్యకలాపాల మందగమనం కారణంగా ఆదాయంపై ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ.18,414 కోట్లు,ఆర్ధిక లోటు రూ.48,295 కోట్లుగా తేల్చారు.అయితే ఆదాయం తక్కువగా అంచనా వేసినా అంతకంటే తక్కువగా ఆదాయం వచ్చిందని తెలుస్తోంది.ఆదాయం రూ.77వేల కోట్లు మాత్రమేనన్న అంచనాలున్నాయి. ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి ఎంత లోటు చూపిస్తుందనేది తేలాల్సి ఉంది.
Must Read ;- వ్యాక్సినేషన్ లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది : జగన్ కు నారా లోకేశ్ లేఖ