ప్రశ్నిస్తే అరెస్టులా? ఇంక మారారా?
అధికారపార్టీ అకృత్యాలను, ప్రభుత్వం పొకడలను, పోలీసు విధులను ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం జగన్ రెడ్డి పాలనలో నిత్యం జరిగే ప్రక్రియే! విపక్షం, స్వపక్షం అన్న తేడా లేకుండా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం .. అరెస్ట్ లు చేసి చిత్రహింసలకు గురిచేయడం ఏపీలో సర్వసాధారణంగా మారింది. సీమ ప్రజల బ్రతుకు చిత్రాన్ని, గతిని మార్చేసినా వరదల బాధలను పక్కన పెట్టి వివక్షాలను టార్గెట్ చేసి అరెస్టులకు పాల్పడటం దురదృష్టకరం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రభుత్వం మాజీ విప్ కూన రవికుమార్ ను శనివారం అర్థరాత్రి తలుపులు పగలకొట్టి అరెస్ట్ చేశారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ ఆయనపై అభియోగం. అరెస్ట్ అనంతరం రవికుమార్ ను ఎచ్చెర్ల స్టేషన్ కు తరలించారు. అర్థరాత్రి మహిళలు, పిల్లలు నిద్రిస్తున్నారన్న ఇంగితం కూడా చూడకుండా రవికుమార్, ఆయన సోదరుడు సత్యారావు ఇంటిపై పడి సోదాలు నిర్వహించడం గర్హనీయమని టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు ఖండించారు.
భువనేశ్వరి పై అనుచిత వ్యాఖాలపై స్పందించినందుకే …
ఏపీ అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యాలు చేసిన నేపథ్యంలో శ్రేణులను నిరసనకు పిలుపునిచ్చారు రవికుమార్. అది తెలుసుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఈక్రమంలో రవికుమార్ ఇంటికి వచ్చిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అభియోగంమోపుతూ.. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి తలుపులు పగలకొట్టిమరి కూన ను అరెస్ట్ చేయడం ఏమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మహిళలపై నీచంగా మాట్లాడిన వారిని వదిలేసి, అది తప్పు, ధర్మం కాదని చెబుతున్న ప్రతిపక్షం గొంతునొక్కేలా పోలీసు చర్యలు ప్రయోగించడం అమానుషమన్నారు. కడప వరద బాధితులను పరామర్శించలేనంత బిజీగా ఉన్న సీఎంకు.. విపక్షల గొంతు నొక్కేందుకు సమయాన్ని బాగా కేటాయిస్తాడని మండిపడ్డారు. కూన రవి ని తక్షణమే విడుదల డిమాండ్ చేశారు.











