దాడి అమానుషం.. ఇక సహించేది లేదు..
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై, కార్యకర్తలపై అధికార వైసీపీ, పోలీసులు జరుపున్న దాడులను సహించేది లేదని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు ఎంత వరకైన వెళ్తానని తెగేసి చెప్పారు. నరసరావుపేటలో టీడీపీ ఇంఛార్జీ అరవింద్ బాబు పై జరిగిన పొలీసు దాడిని అక్షేపనీయమన్నారు. రాష్ట్రంలో సాగిస్తున్న అరాచక పాలనను తుదముట్టించేందుకు టీడీపీ సిద్ధమంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీంతో ఆదివారం గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అరవింద్ బాబుపై జరిగిన దాడిని ఖండిస్తూ.. మద్దతుగా శాంతియుత ర్యాలీలు చేపట్టారు. నల్ల జెండాలతో సాగిన నిరసన ర్యాలీకి వివిధ జిల్లా నుంచి మాజీ మంత్రులు, సీనియర్ నేతలు హాజరై జగన్ రెడ్డి ప్రభుత్వ చర్యలను ఏకరవు పెట్టారు.
నరసరావుపేటకు కదులుతున్న శ్రేణులు..!
పోలీసుల దాడిలో అస్వస్థకు గురై, హాస్పటల్లో చికిత్స పొందుతున్న నరసరావుపేట టీడీపీ ఇంఛార్జీను పరామర్శించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నరసరావుపేటకు కదిలివస్తున్నారు. దాడిని నిరసిస్తూ.. నరసరావుపేట టీడీపీ ఆఫీసు నుంచి ప్రధాన కూడళ్లను కలుపుకుపోతూ.. అరవింద్ బాబు చికిత్స పొందే ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. అక్రమ అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. అరవింద్ బాబు పై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు జవహర్, కొల్లు రవీంద్ర, నేతలు జివి ఆంజనేయులు, యరపతినేని, శ్రావణ కుమార్, దాసరి రాజా మాస్టార్, నల్లపాటి రాము తదతరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అరవింద్ బాబును పరామర్శించారు.