తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్ నిర్మాణంపై అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణలోనూ బలం పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ పోటీ చేయకపోయినా.. ఇప్పటికీ అనేక నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. ఈ మధ్యే ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు విజయం సాధించడంతో.. రాష్ట్రంలో ఇంకా టీడీపీ బలంగానే ఉందని స్పష్టమయింది. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అధ్యక్షుడు చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారు.
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలను 4 జోన్లుగా విభజించి.. ఒక్కో జోన్‌కు ఒక పరిశీలకుడిని నియమించాలని నిర్ణయించారు. నియోజకవర్గం, మండలం, యూనిట్ స్థాయిలో సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత పార్టీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో 22 సంవత్సరాల నుంచి టీడీపీ అధికారంలో లేకపోయినా.. లక్షా 80 వేల మంది స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలు ప్రారంభించి.. ఎన్నికల్లో పోటీ చేస్తే.. సభ్యత్వాలు పదిరెట్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సరిగ్గా అదే సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ అధిష్టానం ఏపీ రాజకీయాల మీదనే ఫోకస్ చేసింది. జనసేన, బీజేపీలతో కలిసి కూటమిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం స్ధిరంగా ఉండటంతో పాటు పార్టీ బలంగా ఉంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయమని.. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారు. త్వరలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికతో పాటు.. కమిటీల అంశంపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.











