ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్‌ఎల్‌సీ ఎన్నికలు.. మూడు స్థానాలకు ఎన్నికలు జరిగితే మూడింటిలోనూ కూటమి అభ్యర్ధులే ఘన విజయం సాధించారు.. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూటమి నేతలు బలపరిచిన కేండిడేట్లు తిరుగులేని మెజారిటీలు సొంతం చేసుకున్నారు.. వైసీపీ బలపరిచిన అభ్యర్ధులకి కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా జెండా ఎగురవేశారు.. దీంతో, వైసీపీ నివ్వెరపోతోంది.. ఆ పార్టీ హైకమాండ్ మైండ్ బ్లాంక్ అయింది..
గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్‌ఎల్‌సీ ఎన్నికల ఫలితాలలో కూటమి అభ్యర్ధి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కి భారీ మెజారిటీ దక్కింది.. ఆయనకు ఏకంగా 60 శాతానికిపైగా ఓట్ బ్యాంక్ పోల్ అవడం వైసీపీ అధినేత జగన్‌కే కాదు, కూటమి నేతలకీ షాకింగ్‌గా మారింది.. ఆలపాటి తన సమీప ప్రత్యర్ధి, వైసీపీ బలపరిచిన కె. లక్ష్మణరావుపై 82,320 ఓట్లతో విజయం సాధించారు.. గతంలో 60 వేల ఓట్లతో లక్ష్మణరావు విజయం సాధించగా, ఈసారి అంతకు మించి భారీ తేడాతో ఓడిపోవడం అంటే, వైసీపీపై ఎంతటి వ్యతిరేకత ఉందో అర్ధం చేసుకోవచ్చని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు..
ఇక, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్‌ఎల్‌సీ ఎన్నికలలో కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరంది సేమ్ సీన్.. వైసీపీ బలపరిచిన పీడీఎఫ్ కేండిడేట్ దిడ్ల వీరరాఘవులపై సుమారు 75 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు… ఇది అసాధారణ విజయంగా భావిస్తున్నారు.. ఇంతటి భారీ వ్యత్యాసం ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేయలేకపోయారు..
ఇటు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికలదీ ఇదే కథ.. అక్కడ కూటమి మద్దతు ఇచ్చిన వ్యక్తి శాసన మండలిలో అడుగుపెట్టబోతున్నారు.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు.. ఆయనకి 10,068 ఓట్లు పోల్ అయ్యాయి.. ఇక రెండో స్థానంలో నిలిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకి సుమారు 9వేలు దక్కాయి.. ఈ ఇద్దరిలో గాదె శ్రీనివాసులు నాయుడికి బీజేపీ, రఘు వర్మకి టీడీపీ – జనసేన మద్దతు ఇచ్చాయి.. ఇక, వైసీపీ సపోర్ట్ చేసిన యూటీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరికి 5,804 ఓట్లు లభించాయి..
అయితే, గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూటమి బలపరిచిన అభ్యర్ధులకి భారీ మెజారిటీలు రావడం, చరిత్రను తిరగరాయడం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.. ఈ మెజారిటీలు, ఓట్లు జగన్‌తోపాటు వైసీపీ హైకమాండ్‌ని నివ్వెర పరుస్తున్నాయి.. ఈ స్థాయిలో వ్యత్యాసాలు ఊహించలేదని, తమ పార్టీపై విద్యావంతులతోపాటు ప్రజల్లోనూ భారీ వ్యతిరేకత ఉందని నిరూపితమయిందని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు.
మరోవైపు, ఇది తమ సర్కార్ పనితీరుకి పాజిటివ్ ఓట్ బ్యాంక్ అని విశ్లేషిస్తున్నారు కూటమి నేతలు.. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, తాజా బడ్జెట్ తర్వాత అది మరింత పెరిగిందని భావిస్తున్నామని, వైసీపీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అభిప్రాయ పడుతున్నారు కూటమి నేతలు.. మరి, ఇంతటి వ్యతిరేకతని జగన్ ఎలా కంట్రోల్ చేసుకుంటాడో చూడాలి..