త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు టీడీపీకూడా ఇక్కడ బరిలోకి దిగనుంది. 150 డివిజన్ లు ఉన్న జీహెచ్ఎంసీలో ఎన్ని స్థానాల్లో టీడీపీ బరిలోకి దిగనుంది అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు గరిష్టం 45సీట్లలో పోటీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఆ 45 డివిజన్లలో ఒంటరిగా పోటీ దిగుతుందా.. పొత్తులేమైనా ఉంటాయనే అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్ని డివిజన్ లలో పోటీ చేస్తుందనే విషయం పక్కనపెడితే అసలు జీహెచ్ఎంసీ పరిధిలో టీడీపీ ఓటు బ్యాంకు బలం ఎంత ఉంది, ఆ ఓటు బ్యాంకు ఎటువైపు మొగ్గుచూపుతుందనే చర్చ పార్టీల్లో నడుస్తోంది. ఇందుకు గత పదేళ్లలో జరిగిన అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికలను పరిశీలిస్తే..
2016లో 51చోట్ల రెండో స్థానంలో..
2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ 2016 లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే టైంలో మంచి స్పీడుమీద ఉంది. సెంటిమెంట్ బలంగా ఉంది. ఆ టైంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని 94స్థానాల్లో పోటీచేసిన టీడీపీ ఒక్క స్థానంలో అదీ కేపీహెచ్ బీ కాలనీలో గెలుపొందింది. టీడీపీ ఒక్కసీటే గెలిచినా..ఓట్లు భారీగానే రాబట్టింది. ఆ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 33,49,379 కాగా టీడీపీకి (బీజేపీకి కాకుండా) 4,39,047 ఓట్లు వచ్చాయి. అంటే 13.11శాతం ఓట్లు వచ్చాయి. పోటీచేసిన చోట్ల 51 డివిజన్లలో రెండో స్థానంలో, 24 డివిజన్లలో మూడోస్థానంలో, 14 డివిజన్లలో 4వ స్థానంలో నిలించింది. రెండో స్థానంలో నిలిచిన 51 డివిజన్లలో గెలుపోటములకు తేడా 15శాతంలోపే ఉండడం గమనార్హం. తరువాతి కాలంలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పార్టీని వీడడం, ఓటుకు నోటు కేసు, కేసీఆర్ లేవనెత్తిన సెంటిమెంట్ తదితర కారణాలతో టీడీపీ తన వైభవాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు.
2009లో హవా..
అదే 2009 GHMC ఎన్నికలలను చూసుకుంటే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీచేసేందుకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఆ సమయంలో కనిపించింది. బీజేపీ, టీడీపీ లు వేర్వేరుగా పోటీచేసిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 52, టీడీపీ 45, ఎంఐఎం 43, బీజేపీ 5, ప్రజారాజ్యం పార్టీ 1, ఇతరులు నాలుగుచోట్ల గెలుపొందారు. టీడీపీ, బీజేపీ కలిపి 50 స్థానాలు కైవసం చేసుకున్నాయి. అప్పుడు దాదాపు 14లక్షల ఓట్లకు పైగా టీడీపీ సాధించింది.
అసెంబ్లీ సెగ్మెంట్లలో..
2014లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న, అప్పటి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ, బీజేపీ కలసి పోటీచేశాయి. టీడీపీ 9, బీజేపీ 5 స్థానాలు సాధించాయి. దాదాపు 28లక్షల ఓట్లు ఈ రెండు పార్టీలూ సాధించాయి. అప్పటి ఎంపీ ఎన్నికల్లోనూ నాలుగుసీట్లలో బీజేపీ 1, టీడీపీ 1 గెలుపోందాయి. 2018, 2019 అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కూటమిగా ఏర్పడినా ఒక్కసీటూ సాధించలేకపోయింది. కంచుకోటగా భావించే కూకట్ పల్లి సీటునూ గెలుచుకోలేకపోయింది. అయితే మొత్తంమీద లక్షల సంఖ్యలో ఓట్లను మాత్ర రాబట్టింది. ఇప్పుడు చర్చ అంతా ఆ ఓట్లపైనే నడుస్తోంది.
ఇదే ఓటు బ్యాంకు..
తమకు కొన్ని వర్గాల్లో మంచి ఓటు బ్యాంకు ఉందని టీడీపీ చెబుతోంది. టీడీపీ హయాంలో ఉద్యోగాలు పొందిన యువత, సెటిలర్లు, కొన్ని సామాజిక వర్గాలు, తెలంగాణేతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తమకు ఓటు బ్యాంకుగా ఉన్నారని టీడీపీ చెబుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎల్బీనగర్, మల్కాజిగిరి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఉప్పల్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలోనే ఉన్నారని పార్టీ చెబుతోంది. అంతే కాకుండా జీహెచ్‌ఎంసీ ఈస్ట్ జోన్ పరిధిలోని కాప్రా, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, మల్లాపూర్, నాచారం, హెచ్‌బీకాలనీ, బీఎన్‌రెడ్డినగర్, గడ్డిఅన్నారం, చైతన్యపురి, వనస్థలిపురం, కొత్తపేట్, నాగోల్, వెస్ట్ జోన్ పరిధిలో కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, హైదర్‌నగర్, ఆల్వీన్ కాలనీ, వివేకానందనగర్, మూసాపేట్, చందానగర్, మా దాపూర్, గచ్చిబౌలి, నార్త్ జోన్ పరిధిలో సూరారం, చింతల్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, ఈస్ట్‌ఆనంద్‌బాగ్, గౌతంనగర్, స ఫిల్‌గుడ, మౌలాలి, బౌద్దనగర్, సీతాఫల్ మండి, బేగంపేట్, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, తార్నాక, మెట్టుగుడ, సెం ట్రల్ జోన్ పరిధిలో అమీర్‌పేట్, సనత్‌నగర్, వెంకటే శ్వరకాలనీ, సోమాజీగుడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసప్‌గుడ వార్డుల్లో కేపీహెచ్‌బీకాలనీ, నాచారం, RK పురం తదితర ఏరియాల్లో ఓటు బ్యాంకు ఉందని టీడీపీ చెబుతోంది.
ఎటువైపు మళ్లితే..లాభం
టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గరిష్టం 7శాతం ఓట్లు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఆ ఓటు బ్యాంకు వల్ల టీడీపీ గెలవకున్నా.. వైరి పార్టీకి వెళ్లే ఓట్లను చీల్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో సెంటిమెంట్ ను టీఆర్ఎస్ తెరపైకి తెచ్చింది. హైదరాబాద్ డెవలప్ మెంట్ పై టీఆర్ఎస్ పార్టీ అప్పట్లో టీడీపీని, కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. కాని గత ఐదేళ్లుగా టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ విమర్శలు ఇప్పుడు చేసినా.. అప్పటి స్థాయిలో పనిచేయకపోవచ్చు. సెంటిమెంట్ పరిస్థితి కూడా అంతేనన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఓటు బ్యాంకు ఏ పార్టీవైపు మళ్లితే వారికి గెలుపు సులువు కానుందన్న అంచనాలు మొదలయ్యాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలూ నాయకులు చెబుతున్నారు.
రేవంత్ గెలుపు..
2019లో మల్కాజ్ గిరి లో ఎంపీగా రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీచేసినా.. అంతకు ముందు టీడీపీలో ఉన్నారు. టీడీపీని వీడినా.. ఆ పార్టీని, నాయకులను ఎక్కడా పెద్దగా విమర్శించలేదు. దీంతో టీడీపీ ఓటు రేవంత్ కు ప్లస్ అయిందని అప్పట్లో చర్చ నడిచింది. మొన్న దుబ్బాకలోనూ అదే పరిస్థితి. ప్రధానమైన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే నడిచింది. అయితే దుబ్బాకలో టీడీపీ గతంలో గణనీయమైన ఓటు బ్యాంకు కలిగి ఉంది. ఈసారి టీడీపీ పోటీ చేయలేదు. ఈ ఎన్నిక్లో టీడీపీ ఓట్లు టీఆర్ఎస్ కు పడలేదని, కాంగ్రెస్ వైపూ వెళ్లలేదని బీజేపీకి లాభించాయని విశ్లేషనలు వచ్చాయి. ఎందుకంటే.. కేవలం 2018,2019లోనే టీడీపీ –కాంగ్రెస్ లు కూటమి కట్టాయి. చరిత్రలో అలాంటి పొత్తు టీడీపీ శ్రేణులకు పరిచయం లేదు. కాని బీజేపీతో పలు మార్లు టీడీపీ పొత్తు పెట్టుకుంది. దీంతో టీడీపీ, బీజేపీ ఓట్ల బదలాయింపు కొంత ఈజీగా జరిగిందని చెబుతున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్కకు కూడా టీడీపీ ఓటు బ్యాంకు సపోర్టుగా ఉంది. సీతక్క కూడా పార్టీని వీడినా..టీడీపీని టార్గెట్ చేసి విమర్శించిన దాఖలాలు లేవు. దీంతో టీడీపీ కేడర్ వారికే అండగా నిలిచింది. ఇక జీహెచ్ఎంసీ విషయానికి వస్తే..టీడీపీ ఓటు బ్యాంకును ఆకట్టుకునే నాయకులు, పార్టీలకు గెలిచేందుకు ఈజీ అవుతుందనే అంచనాలు మొదలయ్యాయి.
తుమ్మల అడుగులు ఎటువైపు..
ఇక టీడీపీలో కీలకనేతగా ఉండి తరువాతి కాలంలో టీఆర్ఎస్ కు వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు అడుగులుకూడా GHMC ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న అంచనాలు ఉన్నాయి. టీడీపీనుంచి టీఆర్ఎస్ కు వెళ్లిన తుమ్మలకు టీఆర్ఎస్ అప్పట్లో మంత్రి పదవి ఇచ్చింది. MLCని చేసింది. తరువాత జరిగిన ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారు. అదే టైంలో కేటీఆర్ కు దగ్గరగా ఉండే పువ్వాడ అజయ్ కుమార్ గెలిచారు. దీంతో జిల్లాలోనూ, పార్టీలోనూ తుమ్మలకు ప్రాధాన్యం తగ్గిందని ఆయన వర్గం అభిప్రాయ పడుతోంది. ఆయన టీఆర్ఎస్ ను వీడనున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. దీంట్లో వాస్తవికత ఎంత అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే తుమ్మల అటు బీజేపీకి, ఇటు టీడీపీకి వెళ్లినా GHMCలో టీఆర్ఎస్ కు నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తుమ్మలకు హైదరాబాద్ లో ఆయన సామాజిక వర్గంతోపాటు ఆయన ప్రాంతానికి చెందిన హైదరాబాద్ లో ఉండే ఓటర్లలో చాలా పట్టు ఉంది. సో..తుమ్మల అడుగులు కూడా GHMC ఎన్నికల్లో టీడీపీ లేదా బీజేపీ ఓట్లను ప్రభావితం చేయనున్నాయి.