ఒకనాడు రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన నేత. రాజకీయంగా ఖమ్మం జిల్లాలో బలమైన శక్తి కలిగిన పెద్దమనిషి అతను. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో అతను ఓడిపోవడం కాస్త రాజకీయంగా తన ఇమేజ్‌కు డ్యామేజ్ అయింది. దీనికి తోడూ అక్కడ నుంచి మంత్రివర్గంలోకి మరో యువ నాయకుడికి చోటు దక్కడం తద్వారా ఇద్దరి మధ్య మరింత దూరం పెంచేసింది. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి పోవడంతో ఆ నేతను బుజ్జగించేందుకు ఏకంగా ఇద్దరు మంత్రులు హెలికాఫ్టర్‌లో వచ్చి ఇంటికి వెళ్లారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు రాజకీయంగా ఏవో కొన్ని కారణాలతో పొసగడంలేదనే ప్రచారం ఉంది. దీంతో తుమ్మల కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న ఈ గ్యాప్‌ను పూడ్చేందుకు ఏకంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగి రాజీకుదిర్చే ప్రయత్నం చేశారట. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తుమ్మల నాగేశ్వర్‌రావు ఇంటికి పువ్వాడ అజయ్‌తో పాటు మరో మంత్రి కూడా పోవడం చర్చకు దారితీసింది.
పువ్వాడ అజయ్‌పై పార్టీలో విమర్శలు..
ఒకప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వర్‌రావుకు ప్రత్యేక స్థానం ఉంది. కంటిచూపుతో తను రాజకీయాలను శాసించేవాడు. తనకు చెప్పకుండా పార్టీ అధినేతలు ఏ నిర్ణయమూ జిల్లా కేంద్రంగా గతంలో తీసుకుకునేవారు కాదు. అలాంటిది పార్టీ మారిన తరువాత 2018 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో రాజకీయ ప్రయాణానికి స్పీడ్ బ్రేక్ పడినట్లయింది. అందులోనూ జిల్లా నుంచి పువ్వాడ అజయ్‌కు మంత్రి వర్గంలో చోటుదక్కడం పార్టీలో పలు వివాదాలకు దారితీసింది. ఒంటెద్దు పోకడలు, నేతలతో వైరం పెట్టుకుంటాడనే ఆరోపణ పువ్వాడపై బలంగా వినిపిస్తోంది. ఎవరినీ దగ్గరకు రానీయడనే విమర్శ కూడా ఉంది. దీంతో చాలా మంది నేతలతో ఆయన మధ్య దూరం పెరిగిపోయింది.
అక్షింతలు వేయడంతో కదిలిన మంత్రి..
తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోవడంతోనే పువ్వాడకు మంత్రి పదవి అవకాశం దక్కిందనే చర్చ ఉంది. అయితే పువ్వాడ మంత్రి పదవి చేపట్టిన తరువాత జిల్లాలో సీనియర్ నాయకులుగా పేరున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ నామా నాగేశ్వర్‌రావులను దూరం పెట్టాడనే విమర్శ పార్టీలో ఉంది. పువ్వాడ తీరుతో పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు దాదాపు వీరిద్దరు హాజరుకావడం మానేశారు. ఎంపీ నాగేశ్వరరావు మాటలను అక్కడి అధికారులు కూడా వినడంలేదట. అంటే ఖమ్మం గులాబీ పార్టీలో రాజకీయ వైరీలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అయితే నెల క్రితం ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అక్కడి నేతలపై ఒక రహస్య సర్వే చేయించారట. ఇక్కడి నేతల మధ్య వైరం పార్టీకి నష్టాన్ని చేకూర్చుతున్నట్లు సీఎంకు రిపోర్టు అందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి పువ్వాడ అజయ్‌కు కేసీఆర్ అక్షింతలు వేసినట్లు చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా పేరున్న తుమ్మల మౌనంగా ఉంటే పార్టీకి నష్టమని భావించిన గులాబీ బాస్ వెంటనే దిద్దుబాటు చర్యలను చేపట్టారని గుసగుసలు వినబడుతున్నాయి. పువ్వాడపై అక్షింతలు వేయడంతోనే ఖమ్మం రాజకీయాల్లో వెనువెంటనే మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
హెలికాఫ్టర్‌లో ఇంటికెళ్లిన మంత్రులు..
మొన్న రాత్రి సీఎంతో సమావేశమైన తరువాత పువ్వాడ అజయ్ స్వయంగా తుమ్మలకు ఫోన్ చేసి మాట్లాడాడు. అలాగే రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించాడు. అంతేకాకుండా ఆరోజు మర్నాడు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి మంత్రి అజయ్ హెలికాఫ్టర్‌లో తుమ్మల ఇంటికి వెళ్లి మరీ స్వయంగా కార్యక్రమానికి వెంటబెట్టి తీసుకెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇద్దరు మంత్రులు ఇంటికి వచ్చి తుమ్మలను బుజ్జగించి కార్యక్రమానికి వెంటబెట్టుకుని తీసుకెళ్లడం తుమ్మల అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా రైతు వేదిక కార్యక్రమానికి మంత్రి ఫోన్ చేసి పిలిచారట. కానీ శ్రీనివాస్ రెడ్డి హాజరు కాలేదట. ఇది మరొక చర్చకు దారితీసింది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల క్రేజ్ తగ్గలేదనడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.