చలో విజయవాడలో వేషాలు మార్చి.. పోలీసులను ఏమార్చి!
కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ‘చలో విజయవాడ’ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల పెద్దలు! అయితే ‘చలో విజయవాడ’ గ్రాండ్ సక్సెస్ కావడంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషించారు. కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులు గత నెలలో సమ్మె నోటీసు ఇచ్చేందుకు సన్నద్ధమౌతున్న రెండు రోజులకు ముందే ఉపాధ్యాయులు ఫ్యాప్టో నేతృత్వం చేసిన ‘‘కలెక్టరేట్ ముట్టడి’’ కార్యక్రమం విజయవంత అయింది. విజయవంతంతో పాటు ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించడంలో అనేక ప్రశంసలు అందుకుంది! అలానే నిన్న తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చేసిన సాహసోపేత అడుగులు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి! వివిధ వేషదారణలతో పోలీసులను ఏమార్చి లక్ష్యం వైపు దూసుకొచ్చారు. ‘‘శ్రీ శ్రీ’’ కవిత్వం మాదిగా వివిధ వాహనాలను మారుతూ.. గల్లీల్లో నడుస్తూ.. అవసరమనుకుంటే పరిగెత్తుకుంటూ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో పాల్గొని స్ఫూర్తివంతమైన ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.
ఎస్సై కాళ్లు పట్టుకుని కొందరు, పూజారి వేషం, భిక్షాటన చేస్తూ మరికొందరు..
‘చలో విజయవాడ’ కార్యక్రమం అసాంతం తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది! ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులను, ఉద్యోగులను పోలీసులు అడ్డుకుని కృష్ణాజిల్లా గన్నవరం బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్బంధించారు. పాఠశాల గేట్లకు తాళాలు వేసి, కట్టుదిట్టం చేశారు. తమను బలవంతంగా నిర్బంధించడం భావ్యంకాదని, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా చేస్తున్న ‘చలో విజయవాడ’ ఉద్యమాన్ని అడ్డుకోవద్దని ఓ ఉద్యోగి ఎస్సై రమేశ్ బాబు కాళ్లు పట్టుకున్నారు. తామేమీ నేరం చేయలేదని, ఉగ్రవాదులం కాదుకదా అని అవేదన వ్యక్తం చేసినా.. పోలీసులు కనుకరించలేదు! మరో వైపు నెల్లూరు జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ఉమాశంకర్ పూజారి అవతారమెత్తి రైలులో నెల్లూరు నుంచి విజయవాడకు వచ్చారు. అదే వేషధారణలో నిరసన కార్యక్రమంలో పాల్గొని తనవంతు పాత్ర పోషించారు. అలానే కొంతమంది వివాహ వేడుకలు వెళ్తున్నామని, మరి కొందరూ భిక్షాటన చేస్తూ ‘చలో విజయవాడ’ వైపు కదిలారు! మొత్తానికి పాఠాలు చెప్పె గురువులకు పంగనామాలు పెట్టాలని చూసినా.., లెక్కలు మాస్టార్లుకు అంకెల గారడీతో నోటిపద్దులు నేర్పాలని తలిస్తే.. రియాక్షన్ ఇలానే ఉంటుందని నెటిజన్ సోషల్ మీడియాలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు.