తెలంగాణలో ఇప్పుడు ఎవరిని కదిపినా.. హుజూరాబాద్ కు త్వరలో జరిగే ఉప ఎన్నిక గురించి, ఆ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయన్న దానిపైనే మాట్లాడుతున్నారు. అసలు అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పటిదాకా తన అభ్యర్థిని ఖరారు చేయని వైనంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాకుండా కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా? ఏం చేసినా?.. హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని, ఆ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే దిశగానే చర్యలు చేపడుతున్నారన్న మాట కూడా వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ సర్కారు మంగళవారం నాడు అరెస్ట్ చేసిన తీన్మార్ మల్లన్న సంచలనాలకే సంచనాలుగా నిలుస్తున్న వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని ఆయన ఏకంగా ఎన్నికల ఫలితాలపైనే భవిష్యవాణి వినిపించారు.
టీఆర్ఎస్పై మల్లన్న యుద్ధం
జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అధికార టీఆర్ఎస్ పై తనదైన శైలిలో యుద్ధం ప్రకటించారనే చెప్పాలి. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్లన్న.. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావుకు ముచ్చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పలు మీడియా సంస్థల్లో పనిచేసిన మల్లన్న.. ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ ను పెట్టుకుని టీఆర్ఎస్ సర్కారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైనే కాకుండా నేరుగా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సాగుతున్నారు. ఈ క్రమంలోనే మల్లన్నను టార్గెట్ చేసిన కేసీఆర్ సర్కారు.. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మల్లన్నను మంగళవారం రాత్రి అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా మల్లన్న కార్యాలయంపై దాడి చేసిన పోలీసులు.. మల్లన్నను ఏకంగా రెండు గంటల పాటు నిర్బంధించారట. ఆ తర్వాత పలు హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు మల్లన్నను అరెస్ట్ చేశారు.
గెలుపు ఎవరిదైనా.. ఓటమి మాత్రం టీఆర్ఎస్దే
ఈ క్రమంలో కేసీఆర్ సర్కారు తీరుపై మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లన్న.. హుజూరాబాద్ ఉప ఎన్నికను వేదికగా చేసుకుని టీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడం ఖాయమని మల్లన్న పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిదైనా.. ఓటమి మాత్రం టీఆర్ఎస్దేనని కూడా మల్లన్న వ్యాఖ్యానించారు. అదే సమయంలో తనను పోలీసులు ఎలా వేధించింది? తన కార్యాలయంలో ఎలా సోదాలు చేసింది? పూసగుచ్చినట్లుగా వివరించిన మల్లన్న.. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తనను ఎంతగా వేధించినా.. తాను మాత్రం ప్రజల పక్షాన పోరాడతానని కూడా మల్లన్న ప్రకటించారు.
Must Read ;- అక్కడ టీఆర్ఎస్ ఓడితే!.. దళిత బంధు ఆగినట్టే!











