వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోతోంది. ఎన్నికల ముందు పలికిన బడాయి పలుకులను నెరవేర్చుకునేందుకు లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించిన జగన్.. వాటి అమలుకు చిక్కిన చోటంతా ఇప్పటికే అప్పులు చేసేశారు. కొత్తగా అప్పులు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో నెలానెలా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరి అప్పులు పుట్టకుండా.. ఉద్యోగులకు వేతనాలెలా? ఈ దిశగా ఆలోచించిన జగన్ సర్కారు.. అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ పేరిట ప్రత్యేకంగా ఓ సంస్థను ఏర్పాటు చేశారు. దానికి మద్యం ఆదాయాన్ని తరలించే ఏర్పాటు చేశారు. అలా మద్యం అమ్మకాల నుంచి వచ్చే ఆదాయాన్ని కార్పొరేషన్ కు మళ్లిస్తామని.. దానిని హామీగా పెట్టుకుని అప్పులు ఇవ్వాలంటూ బ్యాంకులకు ప్రతిపాదించి ఫలితం రాబట్టింది. ఈ విషయం తెలిసిన కేంద్ర ప్రభుత్వం.. జగన్ సర్కారు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవలే లేఖ రాసింది. అంతేకాకుండా ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి కూడా ఏపీ అప్పులు చేసిన వైనంపైనా కేంద్రం గుర్రుగా ఉన్నట్లుగా తెలిసింది.
ఎట్టకేలకు నిర్మలమ్మ అపాయింట్ మెంట్
కేంద్రం ఆగ్రహంగా ఉంటే.. బండి నడవదని గ్రహించారో, లేక కేంద్రమే పిలిస్తే వెళ్లారో తెలియదు గానీ.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. రోజుల తరబడి వెయిట్ చేసిన బుగ్గన ఎట్టకేలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అపాయింట్ మెంట్ సంపాదించారు. తన వెంట ఢిల్లీకి వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, అడ్వొకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం.. ఆర్థిక శాఖకు చెందిన ఇతర అధికారులను వెంటేసుకుని మరీ బుగ్గన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో భేటీకి వెళ్లారు. ఈ భేటీలో రాష్ట్రఅభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు, దాని ద్వారా అప్పులు తెచ్చుకుంటున్న వైనం, ఎఫ్ఆర్బీఎం పరిధి దాటాల్సిన ఆవశ్యకత, వేతనాల చెల్లింపునకు కూడా ఎదురవుతున్న ఇబ్బందులు, సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు అందుతున్న లబ్ధి, ఆయా పథకాల ద్వారా పేద కుటుంబాలకు దక్కుతున్న భరోసా.. తదితరాలను ఏకరువు పెట్టారట. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తులో కేంద్రం నుంచి అందాల్సిన సాయం, ఇప్పటికే కేంద్రం నుంచి విడుదల కావాల్సిన పెండింగ్ నిధులు తదితరాలను కూడా బుగ్గన ప్రస్తావించారట.
ఎంత చెప్పినా ఫలితం రాలేదట
బుగ్గన చెప్పినదంతా సావదానంగా విన్న నిర్మలమ్మ.. క్రమశిక్షణ లేని ఆర్థిక నిర్వహణతో రాష్ట్రం అధోఃగతి పాలు అయితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారట. లెక్కలెన్ని చెప్పినా.. క్రమశిక్షణ లేని ఆర్థిక నిర్వహణతో ఏ వ్యవస్థ అయినా కుప్పకూలిపోవడం ఖాయమని, ఈ తరహా పరిస్థితి వల్ల రాష్ట్రాలే కాకుండా ఏకంగా దేశాలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వైనాన్ని కూడా ఆమె వివరించారట. అసలు ఎఫ్ఆర్‌బీఎం అనే అంశాన్ని ఎందుకు పెట్టామో తెలుసా? అంటూ కూడా ఆమె బుగ్గనను నిలదీశారట. ఇక అప్పుల కోసం ఎప్పుడో వస్తుందన్న మద్యం ఆదాయాన్ని బ్యాంకులకు చూపి అప్పులు తీసుకున్న వైనంపై నిర్మలమ్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. కేవలం అప్పుల కోసమే అన్నట్లుగా రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తోందని కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారట. వెరసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తున్న నేపథ్యంలో నిర్మలమ్మ.. బుగ్గన ఎంత చెప్పినా కూడా కూడా సంతృప్తి వ్యక్తం చేయలేదట. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న ఆందోళనను తగ్గిద్దామన్న బుగ్గన యత్నాలు ఫలించలేదట. మరి కేంద్రం అసంతృప్తిని చల్లబరిచేందుకు జగన్ ఇంకే మార్గం అవలంబిస్తారో చూడాలి.
Must Read ;- జగన్, కేసీఆర్ ఆశలపై మోదీ నీళ్లు చల్లేశారే











