Teenmar Mallanna Arrest Goes Viral :
చింతపండు నవీన్.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అదే తీన్మార్ మల్లన్న అంటే మాత్రం ఇటు తెలంగాణతో పాటు ఏపీ ప్రజలు, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా ఆయనను ఇట్టే గుర్తు పట్టేస్తారు. అసలు తీన్మార్ మల్లన్న అంటే తెలియని తెలుగు వారు ఇప్పుడు లేరంటే అతిశయోక్తి కూడా కాదేమో. అంతగా జనంలో గుర్తింపు పొందేందుకు ఆయనేమైనా ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఎమ్మెల్సీనా.. లేదంటే మంత్రి పదవిలో ఉన్నారా? అంటే.. ఆ పదవుల్లో ఏ ఒక్కదానిలో కూడా ఆయన లేరు. మరి సినిమా సెలబ్రిటీనా అంటే కూడా కాదనే చెప్పాలి. మరి పేరు మోసిన టీవీ యాంకరా అంటే కూడా కాదనే చెప్పాలి. ఏదో ఓ తెలుగు న్యూస్ ఛానెల్ లో అదేదో ఓ స్పెషల్ ప్రోగ్రాంలో మాత్రమే ఆయన కనిపిస్తారు. మరి ఆ మాత్రానికే యావత్తు తెలుగు ప్రజలకు చిరపరచితుడు ఎలా అయ్యారు? ఎలాగంటే.. మొన్నామధ్య తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న.. అధికార పార్టీ టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించారు. ఒకానొక దశలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డిని మల్లన్న ఓడిస్తారా? అన్న విశ్లేషణలు కూడా వినిపించాయి. ఈ ఎన్నికల్లో పల్లాకు 1,11,180 ఓట్లు వస్తే.. తీన్మార్ మల్లన్నకు ఏకంగా 83,629 ఓట్లు వచ్చాయి. ఒకానొక సందర్భంలో మల్లన్నే గెలుస్తారన్న వాదనలూ వినిపించాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నకు ఓ క్రేజీ వచ్చింది. అదే సమయంలో ఆయన టీఆర్ఎస్ సర్కారుకు టార్గెట్ కూడా అయ్యారనే చెప్పాలి.
తీన్మార్ మల్లన్న అరెస్ట్
విలేకరిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన నవీన్.. పలు పత్రికల్లో పనిచేసిన తర్వాత పలు న్యూస్ ఛానెళ్లలోనూ పని చేశారు. ఈ క్రమంలో వీ6లో పేనిచేసిన సందర్భంగా తీన్మార్ పేరిట ప్రసారమైన ప్రోగ్రాంలో మల్లన్నగా కనిపించిన ఆయన పేరు.. తీన్మార్ మల్లన్నగా మారిపోయింది. అధికార పార్టీ వైపల్యాలను, కేసీఆర్ సర్కారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తూర్పారబట్టడమే కాకుండా.. ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి ముచ్చెమటలు పట్టించిన తర్వాత తీన్మార్ పై కేసీఆర్ సర్కారు ఓ కన్నేసి ఉంచిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తన ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ యూట్యూబ్ ఛానెల్ ఉద్యోగిగా పనిచేసిన ప్రవీణ్ అనే వ్యక్తితో మల్లన్నకు విభేదాలు తలెత్తాయి. వారిద్దరి మధ్య మాటల తూటాలూ పేలాయి. తనపై ప్రవీణ్ చేసిన ఆరోపణలను ఖండించే క్రమంలో యువతులతో కలిసి ప్రవీణ్ దిగిన ఫొటోలను బయటపెట్టిన మల్లన్న.. కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారట. ఈ వ్యాఖ్యలపై ఆ ఫొటోల్లోని ప్రియాంక అనే యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం రాత్రి మల్లన్నను అరెస్ట్ చేశారు.
మల్లన్న అరెస్ట్ పై విశ్లేషణల పర్వం
తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయ్యారన్న వార్త బయటకు పొక్కగానే.. దానిపై లెక్కలేనన్ని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టడమే కాకుండా.. నేరుగా కేసీఆర్ నే టార్గెట్ చేస్తూ మల్లన్న వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ జరిగిందన్న కోణంలో ఈ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తీన్మార్ మల్లన్న అరెస్ట్ సమయంలో ఆయన కార్యాలయంపై దాడి చేసిన పోలీసులు పలు హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో యువతి ఇచ్చిన ఫిర్యాదు వరకే తీన్మార్ మల్లన్నపై కేసులు నమోదు చేస్తారా? లేదంటే.. ఇప్పటిదాకా ఆయన కేసీఆర్ సర్కారుపై చేసిన ఆరోపణలపైనా కొత్తగా కేసులు నమోదు చేస్తారా? అన్న దిశగా సరికొత్త వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా మల్లన్న అరెస్ట్ ను జనం తెలంగాణ సర్కారు కక్షసాధింపు చర్యగానే భావిస్తున్న వైనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
Must Read ;- జగన్, కేసీఆర్ ఆశలపై మోదీ నీళ్లు చల్లేశారే