అటు తెలంగాణతో పాటు ఇటు ఏపీలోనూ హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ నుంచి దాదాపుగా గెంటివేతకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసలు బరిలో నిలుస్తారా? ఆయనే గనుక బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే.. అధికార టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? అసలు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? ఇక ఓ రేంజిలో పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ఇక్కడ పోటీ ఇవ్వనుంది?.. ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు వినిపిస్తున్న తరుణంలో బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నుంచి శనివారం విడుదలైన ఓ ప్రకటన.. ఈ ఎన్నికపై మరింత హైప్ ను క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఉద్యోగాల నుంచి 7,600 ఫీల్డ్ అసిస్టెంట్ లను కేసీఆర్ సర్కారు తొలగించిందని, అంతేకాకుండా ఇటీవల పలువురు స్టాఫ్ నర్సులను కూడా తొలగించారని ఆరోపించిన ఆయన.. వారంతా ఇప్పుడు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని తక్షణమే తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, లేదంటే వారిలో ఓ వెయ్యి మందితో హుజూరాబాద్ లో నామినేషన్లు వేయించి నియోజకవర్గ ఉప ఎన్నికలో థౌజండ్ వాలా పేలుస్తానని ఆయన సంచలన ప్రకటన చేశారు.
పదో వంతుకే వణికిపోయిన టీఆర్ఎస్..
ఇలా పెద్ద సంఖ్యలో నాన్ సీరియస్ అభ్యర్థులను బరిలోకి దింపడం ద్వారా ఎన్నికల ప్రక్రియపై అటు అధికారుల్లో, ఇటు ప్రధాన రాజకీయ పార్టీల్లో పెను కలవరం రేపడమే ఈ థౌజండ్ వాలా టైప్ లక్ష్యం. పసుపు బోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని చెప్పి.. ఆ దిశగా అంతగా పోరు చేయలేదన్న భావనతో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ లోక్ సభ బరిలో వంద మందికి పైగా రైతులు బరిలోకి దిగేందుకు యత్నించారు. ఈ తరహా పరిణామం కేసీఆర్ నే కాకుండా.. యావత్తు టీఆర్ఎస్ శ్రేణులను ఎంతగా వణికించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతేకాకుండా నాడు ఈ తరహా నిరసనలతోనే 2019 ఎన్నికల్లో కవిత బలమైన అభ్యర్థిగా కనిపించినా.. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ధర్మపురి అరవింద్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. మొత్తంగా కేసీఆర్ బ్యాచ్ దేనికైతే భయపడుతుందో.. అదే అంశాన్ని అస్త్రంగా తీసుకుని ఆర్.కృష్ణయ్య సంధించిన ఈ థౌజండ్ వాలా ఉద్యమం హుజూరాబాద్ బరిని ఏ తీరానికి చేరుస్తుందోనన్న దిశగా ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.
అసలు కృష్ణయ్య డిమాండ్లేమిటి?
కొన్నాళ్ల క్రితం ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌లను కేసీఆర్ సర్కారు తొలగించింది. తద్వారా 7,600 మంది ఉపాధి కోల్పోయారని.. ఇందుకు తగిన సమాధానం చెప్పాలని కృష్ణయ్య ప్రశ్నిస్తున్నారు. వీరితో పాటు ఇటీవలచాలా మంది స్టాఫ్ నర్సులను కూడా ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. మొత్తంగా వేల మంది ఉపాధిని ప్రభుత్వం లాగేసిందనేది కృష్ణయ్య వాదన. ఉద్యోగాల్లో నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ లతో పాటు స్టాఫ్ నర్సులను కూడా తక్షణమే విధుల్లోకి తీసుకోవాలనేది కృష్ణయ్య డిమాండ్. ఈ డిమాండ్ నెరవేరని పక్షంలో బాదితుల్లోని వెయ్యి మందిని హుజూరాబాద్ బరిలోకి నిలుపుతామని కూడా కృష్ణయ్య సంచలన ప్రకటన చేశారు. ఒక వేళ అదే జరిగితే.. న్యూస్ పేపర్ సైజు బ్యాలెట్ పేపర్లు, నీళ్ల డ్రమ్ముల సైజు బ్యాలెట్ బాక్సులు, గుర్తును పోలిన గుర్తులు, పేర్లను పోలిన పేర్లతో నానా తంటాలు పడాల్సి వస్తుంది. మరి కృష్ణయ్య డిమాండ్ ను తీర్చేసి కేసీఆర్ సర్కారు.. హుజూరాబాద్ బరిని సాధారణ బరిగా జరిగేలా చేస్తుందా? లేదంటే థౌజండ్ వాలాకు భయపడకుండానే ముందుకు సాగుతుందా? అన్న దిశగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Must Read ;- కేసీఆర్ కు ఎంత భయమంటే?.. ఈటల ‘స్టిక్’కు కీలక పోస్ట్!











