పసిబిడ్డలాంటి కథను లాలించి .. బుజ్జగించి .. వ్రేలు పట్టుకుని నడిపించి .. తీరైన మాటలతో తీర్చిదిద్ది .. ప్రేక్షకుల మనసులను గెలిపించేలా తయారుచేయడంలో పరుచూరి బ్రదర్స్ సిద్ధహస్తులు. ఎన్నో కథలను వాళ్లు ప్రేక్షకుల హృదయ తీరాలకు చేర్చారు .. మరెన్నో కథలను మనోఫలకాలపై శాసనాలుగా చెక్కించారు. అలాంటి పరుచూరి బ్రదర్స్ అందించిన కథల్లో ‘పల్నాటి సింహం’ ఒకటి. ఎమ్మెస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, ఎ.కోదండరామిరెడ్డి దర్శకుడిగా వ్యవహరించాడు. కృష్ణ .. జయసుధ .. రాధ .. శారద ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, వాళ్లందరి కెరియర్లోను చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. అలాంటి ఈ సినిమాను గురించి ‘పరుచూరి పాఠాలు’ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ తన అనుభవాలను ఆవిష్కరించారు.
ఓ సారి ఓ సినిమా ఓపెనింగ్ కోసమని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లాను. ఆ రోజున కృష్ణగారి పుట్టినరోజు కావడంతో, అక్కడ కృష్ణగారి గెటప్ ఒకటి గీయించి .. ఆ పక్కనే ఆయన గురించి ఎమ్మెస్ రెడ్డిగారు వ్రాసిన నాలుగు మాటలు చదివాను. నాకెందుకో ఆయన గీయించిన కృష్ణగారి గెటప్ బాగా నచ్చింది. ఆ గెటప్ ప్రధానంగా ఒక కథ రాస్తే బాగుంటుందే అనిపించింది. అదే మాటను ఎమ్మెస్ రెడ్డి గారితో అన్నాను. ”రాయవయ్యా బాబూ” అన్నారాయన. ఆ తరువాత నెలలు గడిచిపోతున్నాయి. ఎమ్మెస్ రెడ్డి గారు మాత్రం నా మాటను మరిచిపోలేదు. “ఏవయ్యా నీ నోటితో నువ్వే చెప్పావు .. కృష్ణగారి కోసం ఒక కథ రాస్తావని .. రాయవేంటి” అని అడిగేవారు.
Must Read ;- ప్రభాస్.. సలార్ లో ముస్లిం లీడరా..?
ఆ తరువాత నేను .. ఎమ్మెస్ రెడ్డి గారి కోసం ఓ కథ రాశాము .. వినిపిస్తాను రమ్మంటే దర్శకుడు కోదండరామిరెడ్డి మా ఇంటికి వచ్చాడు. ఓ పదిహేను నిమిషాలు కథ చెప్పగానే “చాలా బాగుంది .. నేను చేస్తాను” అన్నారు. ఆ విషయం ఆయన ఎమ్మెస్ రెడ్డిగారికి చెప్పగానే, మరుసటి రోజు ఎమ్మెస్ రెడ్డిగారు మా ఇంటికి వచ్చారు. “ఏంది నువ్వు నాకు చెప్పకుండా .. కోదండరామిరెడ్డికి కథ చెప్పినవంటా .. నాకు చెప్పకపోతే ఎట్లా?” అన్నారు. “క్షమించండి సార్ .. మీరు పెద్దవారు నేను మీకు కథ చెప్పను” అన్నాను. “అదేంది .. నిర్మాతకు కథ చెప్పకుండా సినిమా తీయిస్తావా నువ్వు” అన్నారు. “సార్ .. ఏవనుకోకుండా ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి .. మీరింతవరకూ ఎన్ని సినిమాలు తీశారు?” అని అడిగాను. “పదిహేడో .. పద్ధెనిమిదో తీసిన” అన్నారు. “ఎన్ని ఆడాయి” అని అడిగితే “ఒక్కటీ ఆడలేదు” అని చెప్పారు.
అప్పుడు నేను .. “ప్రతి కథలో మీరు కల్పించుకుంటున్నారు. మీ ఆలోచనలకి అనుగుణంగా కథలను మారుస్తూ వెళుతున్నారు. ఈ విధంగా చేయడం వలన సినిమా టిక్ అడ్వాంటేజస్ మిస్ అవుతున్నాయి. మీరు మంచి సాహితీ వేత్త .. సాహితీ విలువలతో ఆలోచిస్తున్నారు. సినిమా వేరు .. సాహిత్యం వేరు .. సాహిత్య విలువలతో కూడిన కథను చదువుకున్నవారే చదువుతారు .. సినిమా కథను చదువురాని వాళ్లు కూడా చూస్తారు. ఈ భేదం తెలియకపోతే కష్టమవుతుందని అన్నాను. అంతే .. ఆయనకి కోపం వచ్చేసింది .. దిగ్గునలేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గుమ్మం దగ్గరున్న ఆయన చెప్పులకు బదులుగా నా చెప్పులు వేసుకుపోయారు .. అంత కోపంతో ఉన్నారాయన.
కోపం తగ్గిన తరువాత .. కథ వినిపించకపోయినా ఫరవాలేదు .. షూటింగు సమయంలో మాత్రం నువ్వు దగ్గరే ఉండాలని ఆయన కోరడం, అందుకు నేను అంగీకరించడంతో ఆ సినిమా పట్టాలెక్కింది. అప్పట్లో మేము బిజీగా ఉండటం వలన, ఏ రోజు సీన్స్ ఆ రోజే రాస్తూ వెళ్లాము. కోదండరామిరెడ్డిగారు ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కథను నేను ఎమ్మెస్ రెడ్డిగారికి ముందుగా చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. ఈ కథలో ప్రధాన పాత్రలన్నీ చనిపోతాయి. ఈ కథను ఆయనకి ముందుగా చెప్పివుంటే, “ఏందయ్యా ఇది .. హీరో .. హీరోయిన్ .. అందరూ చనిపోతే ఎవడయ్యా ఈ సినిమా చూస్తాడు” అనేసి వెళ్లిపోయేవారు .. ఈ సినిమాను తీసేవారు కాదు. జరిగిన కథ .. అని దీనిని నమ్మిస్తే జనం చూస్తారనే విషయాన్ని ఆయన అర్థం చేసుకోకపోతే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే ఆయనకి కథ చెప్పలేదు” అని ఆనాటి విషయాలను చెప్పుకొచ్చారు.
Also Read ;- సీనియర్ నటీమణి గురించి ఆవేదన వ్యక్తం చేసిన పరుచూరి