వెర్రి వెయ్యి విధాలు.. పిచ్చి పలురకాలు. తాము ఏంచేసినా చెల్లుతుందని భావించేవారికి ఈ లోకంతో పనే ఉండదు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ లో ఆ ధోరణి బాగా ఉంది. అది క్రేజ్ కోసమైనా.. ఆనందం కోసమైనా.. దేనికోసమైనా కావచ్చు. పబ్లిక్ లో అది న్యూసెన్స్ కానంత వరకూ ఓకె. కానీ అది శ్రుతి మించి రాగాన పడితేనే ప్రమాదం. అలాంటి ప్రమాదాన్ని బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ కావాలని కొని తెచ్చుకున్నట్టైంది.
అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల మిలింద్ సోమన్ తన 55 వ పుట్టినరోజు సెలబ్రేషన్ ను భార్యా సమేతంగా జరుపుకున్నాడు. అది రొటీన్ గా ఉంటే ఏ బాగుంటుందని అనుకున్నాడో ఏమోగానీ… బట్టల్లేకుండా.. గోవా బీచ్ ఒడ్డున పరుగుపెట్టాడు. ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు అతడి భార్య దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొందరు పాజిటివ్ గా రియాక్ట్ అయితే.. మరికొందరు అతడి చర్యను దుయ్యబట్టారు. అయితే గోవా పోలీసులు మాత్రం ఊరుకుంటారా? అతడి మీద కేసులు పెట్టారు.
ఐపిసీ సెక్షన్ 294, 67లతో గోవాలోని కొల్వా పోలీస్ స్టేషన్ లో మిలింద్ సోమన్ మీద కేసులు నమోదయ్యాయి. గతంలో ఇలాగే మిలింద్ ఒక పోలీసు కేసులో చిక్కుకున్నాడు. అప్పుడు బట్టల్లేకుండా కొండచిలువతో ఫోటో దిగిన కారణంగా అప్పట్లో ముంబై పోలీసులు అతడ్ని బుక్ చేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి చర్యకే పాల్పడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల పూనమ్ పాండే మీద కూడా అశ్లీల వీడియోలో పాల్గొందని కేసు పెట్టిన సంగతి తెలిసిందే.