తెలంగాణలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాకపోవడం టీడీపీకి ఊరటనిచ్చిన విషయం. చంద్రబాబుతో కేసీఆర్ 2014 తర్వాతి నుంచి వైరం పెట్టుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేసి వారిని తన పార్టీలో చేర్పించుకునేలా చేశారు. అంతేకాక, ఓటుకునోటు కేసులో చంద్రబాబుతోనూ కేసీఆర్ పెట్టుకున్నారు. పైగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు కేసీఆర్ బహిరంగ మద్దతు పలకడం.. రిటర్న్ గిఫ్ట్ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా కేసీఆర్, చంద్రబాబు మధ్య దూరం మరింత పెరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాజా తెలంగాణ ఎన్నికల ఫలితం అనేది టీడీపీకి ఊరట కలిగించేలాగే కనిపిస్తోంది.
తెలంగాణలో ఎన్నికల ఫలితాలు అంతకుముందు జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయని అనుకోవచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ కి పెద్ద బూస్ట్ ఇచ్చినట్లయింది. అయితే, తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇలా నేరుగా ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపించకపోవచ్చు కానీ.. పరోక్షంగా మాత్రం ప్రభావం ఉంటుంది. గత ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా బీఆర్ఎస్ పని చేసింది. వైసీపీకి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. ఇప్పుడు అలాంటి జోక్యాలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
పైగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు పరస్పర ఆధారితంగా లేవు. అంటే ఏపీలో ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలకు తెలంగాణలో బలమే లేదు. అదే తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఏపీలో అట్టడుగున ఉన్నాయి. కనీసం ఆ జాతీయ పార్టీల గురించి ఏపీ ప్రజలు ఆలోచించడమే మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల ఫలితం ఏపీపై నేరుగా ఉండనప్పటికీ, పరోక్షంగా మాత్రం వైసీపీకి నష్టం చేకూర్చేదిగా ఉండడం ఖాయం. అంతగా డెవలప్ చేసిన కేసీఆర్‌నే ప్రజలు ఓడించినప్పుడు, అసలు ఏమీ చేయని జగన్ ను ప్రజలు సహిస్తారా అనే అభిప్రాయం ఇప్పుడు బాగా వ్యక్తం అవుతోంది. అయినంత వరకూ చంద్రబాబు హాయాంలో జరిగినది ప్రజలకు బాగా కనిపిస్తోంది. జగన్ వచ్చాక ఉన్నవాటిని నాశనం చేశారనే అభిప్రాయం ఉంది. కాబట్టి, పరోక్షంగా తెలంగాణ ఫలితం.. వచ్చే ఏపీ రాజకీయాలపై పడే అవకాశం ఉంది.