ఇది తెలంగాణకు పండుగ రోజు. ఇది తెలంగాణాకు విముక్తి రోజు. ఇది తెలంగాణాకు సంబురాల రోజు. ఇది తెలంగాణాకు వేడుక రోజు. ఇది తెలంగాణాకు దసరాకు ముందే వచ్చిన బతుకమ్మల రోజు.
భారతదేశాన్ని నాలుగు వందల ఏళ్లు తమ గుప్పిట్లో పెట్టుకుని పాలించిన బ్రిటిష్ పాలకులు తోక ముడిచారు. మూట ముల్లే సర్దుకుని వారి దేశానికి వెళ్లిపోయారు. ఆ రోజు 1947 ఆగస్టు 15. దేశమంతటా సంబరాలు జరిగాయి. దేశమంతటా ఆనందం వెల్లివిరిసింది. కాని ఒక్క తెలంగాణలో మాత్రం చీకటి ఇంకా రాజ్యమేలుతోంది. ఆ చీకటి అలా ఒక సంవత్సరం ఒక నెల వరకూ తెలంగాణను వెలుగులు చూడనివ్వలేదు.
ఆ చీకటి పేరు నిజాం నవాబు. ఆ చీకటి పేరు కసాయి పాలన. ఈ చీకటి పేరు నిజాం నియంతృత్వం. తెలంగాణాను నిజాం ఏలికల నుంచి విముక్తం చేసేందుకు జరిపిన సాయుధ పోరాటం మంచి ఫలితాలే ఇస్తోంది కాని పూర్తి స్ధాయి విజయం మాత్రం సాధించలేదు. అదిగో అలాంటి సమయంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పటి వరకూ బ్రిటిష్ పాలకులకు తాబేదార్లుగా వ్యవహరించిన సంస్థానాలు అటు భారత్ లోనూ, దేశం నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా మనగలుగుతాం అని ప్రకటించుకున్న పాకిస్తాన్ లోనూ చేరిపోయాయి.
దేశవ్యాప్తంగా తమకు తామే స్వంతంత్ర దేశంగా.. స్వతంత్ర సామంతుడిగా నిజాం నవాబు హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను దేశంలో విలీనమయ్యేది లేదంటూ భీష్మించుకున్నారు. అదిగో ఆ సమయంలో జరిగిందే ఆపరేషన్ పోలో. భారత సైన్యం 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్ధానాన్ని ముట్టడించింది. దీనికే కాలక్రమంలో పోలీస్ యాక్షన్ అనే పేరూ వచ్చింది.
నాలుగు రోజుల తర్వాత విమోచన
భారత సైన్యం దాడిని ఊహించిన హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ చర్యకు నిశ్చేష్టుడయ్యాడు. ఈ ఊహించని పరిణామానికి భయకంపితుడయ్యాడు. తాను సామంతుడిగా ఉంటానని ప్రకటించిన తర్వాత చర్చలు ముగిసిన తర్వాత భారత సైన్యం చేసిన ఈ పోలీస్ యాక్షన్ నిజాం ప్రభువును నిద్రకు దూరం చేసింది. తెలంగాణ ప్రజలు భారతదేశంలో విలీనం కావాలని కోరుకుంటే నిజాం చివరి ఏలిక మాత్రం స్వతంత్రుడిగానే ప్రకటించుకున్న సందర్భం అది.
ఆ సమయంలో తెలంగాణా అంతటా దేశ్‌ముఖ్ లు, దొరలు, జాగీర్దార్‌ల రాక్షస అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు రజాకార్లు తెలంగాణా పల్లెల్లో చెలరేగిపోతున్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదు. హత్యలు, మానభంగాలు ఎక్కువయ్యాయి. రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటం పెద్ద ఎత్తున జరిగింది. తెలంగాణ అంతటా రక్తం ఏరులై పారింది.
కమ్యూనిస్టులతో పాటు ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్ లు కూడా నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేశాయి. అదిగో అలాంటి సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే పోలీస్ యాక్షన్. ఈ చర్యతో నిజాం ప్రభువు లొంగిపోయారు.
వల్లభాయ్ ముందు మోకరిల్లిన చివరి నిజాం
తెలంగాణ అంతటా ఓ భయానక వాతావరణం రాజ్యమేలుతున్న సమయంలో భారత మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న కఠిన నిర్ణయం తెలంగాణ చీకటిని చీల్చింది. పోలీస్ యాక్షన్ అంటూ వల్లభాయ్ పటేల్ తీసుకున్న నిర్ణయంతో భారత సైన్యం హైదరాబాద్ నిజాం సంస్థానాన్ని ముట్టడించింది. ఈ చర్యతో హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సెప్టెంబర్ 17న తన లొంగుబాటును ప్రకటించారు.
ఆ రోజు హైదరాబాద్ వచ్చిన హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు మోకరిల్లారు. రెండు చేతులతో వంగి నమస్కరిస్తూ తన సంస్ధానాన్ని భారత్ లో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారు. అప్పటి నుంచి తెలంగాణలో ప్రతీ ఏటా తెలంగాణా విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 న జరుపుకుంటున్నారు. గడచిన కొన్ని సంవత్సరాలుగా ఈ దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్ ను పట్టించుకోవడం లేదు.










