తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలుగు సినిమా రంగం తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలన్న విషయంపై చాలాకాలమే సందిగ్ధంలో పడిపోయింది. అయితే ఆ తర్వాత తేరుకుని తమ సమస్యలను పరిష్కారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు సినిమా రంగం అంతా హైదరాబాద్ లో కేంద్రీకృతం కాగా.. ఇప్పుడు దానిని ఏపీలోనూ విస్తరించే దిశగా జగన్ పావులు కదుపుతున్నారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి సినిమా రంగాన్ని తీవ్రంగానే దెబ్బ కొట్టింది. దీని నుంచి తేరుకునేందుకు సినిమా రంగం ఆపసోపాలు పడుతోంది. ఇదే అదనుగా మీ సమస్యలేమిటి? వాటిపై చర్చిద్దాం రమ్మంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరుకు కబురు పెట్టారు. ఈ కబురుతో ఉబ్బితబ్బిబ్బైన చిరు.. జగన్ తో భేటీకి ముందు చేస్తున్న సన్నాహాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
చిరు ఇంటికి సినీ ప్రముఖులు
సినిమా రంగ సమస్యలపై చర్చిద్దాం రమ్మంటూ జగన్ ఇచ్చిన సమాచారం అందగానే చిరులో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చినట్టుంది. జగన్ పిలుపును మంత్రి పేర్ని నాని నుంచి అందుకున్న చిరు.. జగన్ వద్దకు వెళ్లేసరికి సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటన్న విషయంపై సమగ్ర అవగాహన తెచ్చుకునే దిశగా చర్యలు మొదలెట్టేశారు. ఈ క్రమంలో సోమవారం సినిమా రంగానికి చెందిన ప్రముఖులను ఆయన తన నివాసానికి ఆహ్వానించారు. చిరు ఆహ్వానం మేరకు సోమవారం మధ్యాహ్నం టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు అల్లు అరవింద్, కొరటాల శివ, ఫిలిం చాంబర్స్ అధ్యక్షుడు నారాయణ దాస్, నాగార్జున, సురేశ్ బాబు, ఆర్. నారాయణ మూర్తి, దిల్ రాజు, కేఎస్ రామారావు, దామోదర ప్రసాద్,ఏసియన్ సునీల్, స్రవంతి రవికిశోర్, సి. కల్యాణ్, ఎన్వీ ప్రసాద్ తదితరులు చిరు నివాసానికి క్యూ కట్టారు.
భేటీలో ఏం చర్చించాంటే..?
కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లు మూతపడిపోయాయి. ఇప్పుడిప్పుడే అవి తెరచుకుంటున్నా.. థర్డ్ వేవ్ మరో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరలను పెంచే దిశగా నిర్ణయం తీసుకోవాలని సినీ రంగం కోరుతోంది. అంతేకాకుండా సినిమా షూటింగ్ లకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని జగన్ ను కోరాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ భేటీకి హాజరైన వారంతా చాలా ఉత్సాహంగా కనిపించగా.. మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చిరు సంతోషంలో మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మరిన్ని వివరాలను సేకరించుకుని తాడేపల్లి వెళ్లి జగన్ ను కలవాలని తీర్మానించారు. అయితే జగన్ తో వీరి భేటీ ఎప్పుడు ఉంటుందనేది ఇంకా తెలియరాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ నెలాఖరులో వీరంతా జగన్ తో కలిసే అవకాశం ఉంది.
Must Read ;- ‘మా’తో పెట్టుకుంటే మడతడిపోద్దా?