ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి. ఈ కేసులో ఇప్పటికే 60 రోజులకు పైగా నాన్ స్టాప్ గా దర్యాప్తు సాగిస్తున్న సీబీఐ అధికారులు కడపలోనే తిష్ట వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివేకా ఇంటి వాచ్ మన్ రంగయ్య వాంగ్మూలం, పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ అరెస్ట్, సీబీఐ కస్టడీతో ఈ కేసు దర్యాప్తులో స్పీడు అందుకుందనే చెప్పాలి. ఈ క్రమంలో సోమవారం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సొంత పెదనాన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డిని సిబీఐ అధికారులు విచారించారు. సీబీఐ అధికారుల ఆదేశాల మేరకు పారిశ్రామికవేత్తగా కొనసాగుతున్న ప్రకాశ్ రెడ్డి ఒంటరిగానే విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిగిలిన అనుమానితుల మాదిరిగానే ప్రకాశ్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు సుదీర్ఘంగానే విచారించినట్లుగా సమాచారం.
అవినాశ్ కేంద్రంగానే దర్యాప్తు
సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసిన తర్వాత అతడి నుంచి రాబట్టిన కీలక సమాచారం మేరకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కేంద్రంగానే దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే అవినాశ్ రెడ్డి వద్ద పీఏలుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను సీబీఐ అధికారులు విచారించారు. ఆ మరునాడే.. అవినాశ్ రెడ్డికి సన్నిహితుడిగా పేరుపడ్డ ఉదయ్ కుమార్ రెడ్డిని, జగన్ మామ ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్న అతడి తండ్రిని విచారణకు పిలిచారు. ఆ తర్వాత తాజాగా ఏకంగా అవినాశ్ రెడ్డి పెదనాన్న ప్రకాశ్ రెడ్డిని విచారణకు పిలవడం గమనార్హం. మొత్తంగా వైఎస్ అవినాశ్ రెడ్డి కేంద్రంగానే సీబీఐ అధికారులు దర్యాప్తు సాగిస్తున్న తీరు కలకలం రేపుతోంది.
కడప ఎంపీ టార్గెట్ ఎలా అయ్యారు?
కడప ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డి.. వైసీపీ ప్రస్థానం మొదలయ్యేదాకా ఎవరికీ తెలియదనే చెప్పాలి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి వరుసకు సోదరుడైన వైఎస్ భాస్కర రెడ్డి కుమారుడైన అవినాశ్ రెడ్డి.. తెర ముందుకు రాక ముందు నుంచే జగన్ తో సన్నిహితంగా మెలగడంతో పాటుగా.. పులవెందుల, కడప జిల్లా వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించేవారని చెబుతారు. ఈ క్రమంలో వైఎస్సార్ మరణం, జగన్ వేరు కుంపటి పెట్టుకున్న తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాశ్.. ఎలాగూ జగన్ పులివెందుల అసెంబ్లీకి మారిపోతారని, తాను కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని తలచారు. అయితే వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ ఫ్యామిలీకి దూరంగా జరిగిన వివేకానందరెడ్డి.. జగన్ అరెస్ట్ సమయంలో తిరిగి ఆ ఫ్యామిలీ దరి చేరారు. ఈ క్రమంలోనే ఎక్కడ తన ఎంపీ సీటుకు పోటీ వస్తుందోనన్న భయంతో అవినాశే.. వివేకాను అడ్డు తొలగించుకునే యత్నం చేసి ఉంటారన్నది జనంలోని అనుమానంగా చెప్పాలి. అంతేకాకుండా వివేకా మర్డర్ తర్వాత.. అక్కడికి చేరుకున్న తొలి వ్యక్తిగానే కాకుండా.. వివేకా మర్డర్ ను గుండెపోటు మరణంగా చిత్రీకరించే యత్నం చేసిన వ్యక్తిగానూ అవినాశ్ పై అనుమానాలు వెల్లువెత్తాయి.
Must Read ;- వివేకా కేసు కొలిక్కి!.. విచారణకు ఎంపీ పీఏలు!











