వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా ప్రకటించిన నవరత్నాల్లో అమ్మ ఒడి అత్యంత ప్రాముఖ్యమైనదే. తాను చెప్పినట్లుగానే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టిన జగన్.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేలను జమ చేస్తూ వచ్చారు. ఏటా సంక్రాంతిలోగానే అమ్మ ఒడి నిధులు తల్లుల ఖాతాల్లో పడిపోయేవి. అయితే రెండేళ్లు తిరిగాయో, లేదో ఈ పథకం ఆరు నెలల ఆలస్యానికి పడిపోయింది. వచ్చే ఏడాది జనవరిలో తల్లుల ఖాతాల్లో జమ కానున్న అమ్మ ఒడి నిధులను జనవరిలో కాకుండా జూన్ లో జమ చేస్తామని జగన్ సర్కారు తాజాగా ప్రకటించింది. అసలే అప్పులతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ సర్కారు.. ఐదేళ్ల పాటు ఈ పథకాలను కొనసాగించగలుతుందా? అన్న అనుమానలు వ్యక్తమవుతున్న వేళ.. ఆ అనుమానాలు నిజమేనన్నట్లుగా అమ్మ ఒడి నిధుల విడుదలను ఆరు నెలలకు పోస్ట్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
కారణాలివేనా?
విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా సంక్షేమ పథకాల అమలు కోసం జగన్ సర్కారు అప్పులనే ఆశ్రయిస్తోంది. ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన లెక్కల ప్రకారం.. రెండేళ్లలో జగన్ సర్కారు రూ.1.40 లక్షల కోట్ల అప్పు చేస్తే.. అందులో రూ.1.20 లక్షల కోట్లను కేవలం సంక్షేమ పథకాల అమలు కోసమే వెచ్చించింది. అంటే.. జగన్ సర్కారు చేస్తున్న అప్పులన్నీ సంక్షేమ పథకాల కోసమేనని తేలిపోయినట్టే కదా. ఈ క్రమంలో ఇప్పటికే కేంద్రం నిర్దేశించిన ఎఫ్ఆర్బీఎం పరిధిని ఏపీ ఎప్పుడో దాటి పోయింది. ఆ తర్వాత కేంద్రానికి సమాచారం ఇవ్వకుండానే ఏపీ ప్రభుత్వం అప్పులు చేసింది. ఇందుకోసం అభివృద్ధి కార్పొరేషన్లను ప్రారంభించిన జగన్ సర్కారు.. తనకు వచ్చే ఆదాయాన్ని తనఖా పెట్టేసి మరీ అప్పులు చేసింది. ఇకపై ఇప్పటిదాకా దొరికినట్లుగా ఉదారంగా అప్పులు దొరికే పరిస్థితే కనిపించడం లేదు. అంతేకాకుండా కొత్తగా పుడుతున్న కొద్దిపాటి మొత్తం అప్పులు ఓవర్ డ్రాఫ్ట్లకే జమ అయిపోతున్నాయి. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల కోసం కూడా జగన్ సర్కారు ప్రతి నెలా నిధుల కోసం వెతుక్కుంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ ఒడి సహా దాదాపుగా అన్ని సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకంగానే మారింది. అయితే ఒకేసారి పథకాలన్నీ నిలిపేస్తే వైసీపీ సర్కారుకు ఒక్కసారిగా ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుంది కదా. అందుకనే.. దశలవారీగా సంక్షేమ పథకాలను ఎత్తివేయడమో, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించమో.. ఇలా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో జనవరిలో నిధుల లభ్యత ఉండదన్న అంచనాకు వచ్చిన జగన్ సర్కారు.. అమ్మ ఒడి నిధుల విడుదలను జూన్‌కు మార్చినట్టుగా తెలుస్తోంది.
వాయిదా తర్వాత ఎత్తివేతేగా
నిధుల లేమితో అమ్మ ఒడి నిధుల విడుదలను వాయిదా వేసిన జగన్ సర్కారు.. జూన్‌లో అయినా ఆ నిధులను విడుదల చేయక తప్పదు కదా. మరి జూన్‌లోగా జగన్ సర్కారుకు కొత్తగా ఆదాయం పెరిగే మార్గాలేమీ కనిపించడం లేదు. మరి జూన్‌లో అమ్మ ఒడి నిధులను విడుదల చేయాలన్నా.. మరోమారు అప్పుల బాట పట్టక తప్పదు. ఎలాగోలా అప్పులు సాధించి వచ్చే ఏడాది అమ్మ ఒడిని అమలు చేసినా.. ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్న దానిపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అమ్మ ఒడితో పాటుగా జగన్ సర్కారు ప్రారంభించిన ఇతరత్రా సంక్షేమ పథకాలకు కూడా నిధుల కొరత వేధిస్తోంది. ఈ దెబ్బతో పింఛన్ల సంఖ్యను అమాంతంగా తగ్గించే పనిని జగన్ సర్కారు ఇప్పటికే చేపట్టేసిందనే చెప్పాలి. పింఛన్ల సంఖ్యనే కుదిస్తున్న జగన్ సర్కారు అమ్మ ఒడి లాంటి పథకాల లబ్ధిదారుల సంఖ్యను కూడా కుదించే దిశగానే ఆలోచన చేయక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే.. 2024 ఎన్నికల వరకు అమ్మ ఒడిని ఎలాగోలా నెట్టుకువచ్చినా.. ఆ తర్వాత పథకాన్ని ఎత్తివేయక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అమ్మ ఒడి కంటే కాస్తంత ప్రాధాన్యం తక్కువ కలిగిన పథకాలకు ఎన్నికల్లోపే జగన్ సర్కారు ఫుల్ స్టాప్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- కొత్త రుణం పాత బాకీకి జమ











