The Comptroller And Auditor General of India Wrote A Letter To The AP Government Asking It To Provide Comprehensive Details On The States Financial Situation :
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఏ ఒక్కరికీ తెలియడం లేదు. కేంద్ర మార్గదర్శకాల మేరకు అప్పులు చేస్తున్న జగన్ సర్కారు.. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా కార్పొరేషన్ల పేరిట మరిన్ని మేర అప్పులు చేస్తోందన్న విషయంపై ఇప్పటికే ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అయితే తాము తీసుకువస్తున్న అప్పులెంత? వాటిని ఎందుకు ఖర్చు చేస్తున్నామన్న విషయాలపై తమదైన శైలి వివరణలు ఇస్తున్న జగన్ సర్కారు.. అసలు నిజాన్ని మాత్రం వెల్లడించలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎవరు ఏం మాట్లాడినా.. సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నట్లుగా చెబుతున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అందుకోసి నానా తంటాలు పడుతున్న వైనం కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. అయితే ఈ దఫా మాత్రం ఏపీ ఆర్థిక పరిస్థితితో పాటు తమ సర్కారు చేసిన అప్పుల గుట్టును బుగ్గన విప్పక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కాగ్ లేఖకు ఆన్సరివ్వాల్సిందేగా
ఇప్పటికే ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)ను రంగంలోకి దింపింది. ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని కేంద్రం నుంచి ఆదేశాలు అందుకున్న కాగ్.. తాజాగా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటిదాకా మీరు చేసిన అప్పులెంత? ఆ అప్పులకు ష్యూరిటీలు ఏమిచ్చారు? అప్పులు సరే గానీ.. వాటిని తీర్చేందుకు మీ వద్ద ఉన్న ఆదాయ మార్గాలేమిటి? అసలు అప్పులను ఏ ప్రాతిపదిక మీద తీసుకున్నారు? ఇప్పటిదాకా చేసిన అప్పులకు వడ్డీలు ఎంత మేర కడుతున్నారు? వడ్డీలు కట్టేందుకే అప్పులు చేస్తున్నారా? ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి?.. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏమిటి?.. ఇలా మొత్తం వివరాలను తెలపాలని ఆ లేఖలో కాగ్ కోరిందట. నేరుగా కాగ్ నుంచి అందిన లేఖకు ఏపీ ప్రభుత్వం సమాధానం ఇచ్చి తీరాల్సిందే కదా. కాగ్ అడిగిన అన్ని వివరాలను వెల్లడిస్తే.. ఏపీ అప్పుల గుట్టు కూడా వీడినట్టే కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బుగ్గన మల్లగుల్లాలు
విపక్షాలు అడిగిన సమాచారం ఇచ్చేందుకే చాలా సమయం తీసుకుంటున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఇప్పుడు కాగ్ సమగ్ర నివేదిక అడగడంతో అయోమయంలో కూరుకుపోయారట. ఏదోమ మాయామంత్రం చేసి విపక్షాలకు బదులు ఇస్తున్న బుగ్గన.. అందులోనూ అడ్డంగా బుక్కైపోతున్న వైనం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. అయితే ఇలాంటి మాయామంత్రాలు కాగ్ కు ఇచ్చే సమాధానంలో కుదరవు కదా. ఈ కారణంగా కాగ్ అడిగిన అంశాలేమిటి? వాటిపై ఎలాంటి సమాధానాలు ఇవ్వాలన్న దిశగా ఆర్థిక శాఖ కీలక అధికారులతో బుగ్గన సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తున్నారట. అన్ని విషయాలను బయటపెట్టినా.. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరీ 20 ఏళ్ల మద్యం రాబడిని ష్యూరిటీగా పెట్టి తీసుకున్న అప్పును ఏ రీతిన వెల్లడించాలన్న దిశగా బుగ్గన తల బద్దలు కొట్టుకుంటున్నారట. ఎందుకంటే.. ఈ అప్పును వెల్లడిస్తే.. భవిష్యత్తులో ఏపీకి అప్పు పుట్టే దారులు మూసుకుపోతాయి. ఈ అప్పును కూడా ఎఫ్ఆర్‌బీఎం పరిధిలో కలిపేస్తే.. ఇక ఏపీకి కొత్తగా అప్పు పుట్టే మార్గం మూసుకుపోయినట్టే కదా. మరి కాగ్ లేఖకు ఇచ్చే వివరణలో బుగ్గన ఏ మంత్రాన్ని జపిస్తారో చూడాలి.
Must Read ;- బుగ్గన వచ్చారు.. బుర్ర కథలు తెచ్చారు