ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు హైకోర్టులో మరో మొట్టికాయ పడింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి జగన్ సర్కారు జారీ చేసిన జీవో నెంబరు 28ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. పది తరగతి లోపు విద్యార్థులకు అమ్మ ఒడి పేరిట జగన్ సర్కారు ఏడాదికి రూ.15 వేలను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇదే మాదిరిగా ఇంటర్ ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పేరిట విద్యార్థులు చెల్లించాల్సిన కాలేజీ ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిధుల జమకు సంబంధించి గతంలో జగన్ సర్కారు జీవో నెంబరు 28ని జారీ చేసింది. అయితే జగన్ అధికారంలోకి రావడానికి ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పేరిట ఈ నిధులను విద్యార్థులు చదువుతున్న ఆయా కాలేజీ యాజమాన్యాల అకౌంట్ లోనే జమ చేసే వారు. అయితే జగన్ వచ్చాక.. ఈ నిధులకు పేరు మార్చి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడం మొదలెట్టారు. ఇలా తల్లుల ఖాతాల్లో విద్యార్థులకిచ్చే నిధులను జమ చేయడం కుదరదని హైకోర్టు తాజాగా తీర్పు చెప్పింది.
తండ్రి పథకానికే తన పేరు
జగనన్న విద్యా దీవెన కొత్త పథకమేమీ కాదు. గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలోనే ఫీజు రీయింబర్స్ మెంట్ పేరిట ఓ కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఇంటర్ ఆపై చదివే విద్యార్థుల పూర్తి స్థాయి ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. మూడు విడతలుగా విడుదలయ్యే ఈ ఫీజులు విద్యార్థులు చదివే ఆయా విద్యా సంస్థల ఖాతాలకే నేరుగా జమ అయ్యేవి. దీంతో ఫీజుల కోసం విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు వేధించే పరిస్థితి ఉండేది కాదు. పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎంతగానో భరోసా ఇచ్చే ఈ పథకాన్ని తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇటు ఏపీలో చంద్రబాబు సర్కారు, అటు తెలంగాణలో కేసీఆర్ సర్కారు అమలు చేశాయి. ఇప్పుడు ఏపీలో జగన్ సీఎం కాగానే.. తన తండ్రి హయాంలో ప్రారంభమైన పథకానికి తన పేరు పెట్టుకుని ఫీజులను కాలేజీలకు కాకుండా విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేయడం మొదలెట్టారు. ఇప్పటికే రెండు విడతలుగా ఈ నిధులు విడుదలయ్యాయి.
కాలేజీలకు చేరట్లేదు
జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ అవుతున్న నిధులు.. ఆయా కాలేజీలకు చేరాలి కదా. అయితే కొన్ని పేద కుటుంబాలు ఈ నిధులను ముందుగా తమ సొంత అవసరాలకు వినియోగించుకుని వీలు చూసుకుని చాలా కాలం తర్వాత కాలేజీలకు కడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని గ్రహించిన కాలేజీ యాజమాన్యాలు.. ఈ పద్దతి ద్వారా ఇటుయ తమకు ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో పాటుగా విద్యార్థులు కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఈ తరహా పద్దతిని మార్చాలంటూ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై ఇప్పటికే పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు.. కాలేజీ యాజమాన్యాల వాదన నిజమేనని తేల్చేసింది. ఈ నేపథ్యంలో ఇకపై జగనన్న విద్యా దీవెన నిధులను నేరుగా కాలేజీ యాజమాన్యాల ఖాతాలకే జమ చేయాలని, ఇకపై విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేయడం కుదరదని సంచలన తీర్పు చెప్పిన కోర్టు.. జగన్ సర్కారు జారీ చేసిన జీవో నెంబరు 28ను సస్పెండ్ చేసింది.
Must Read ;- బాబు పోయి జగన్ వచ్చే!.. టాప్ 4 పోయి 13 వచ్చే!