నిలదీయకుంటే.. నిలువునా మోసం తప్పదా?
గుంటూరు జిల్లా, పల్నాడు ప్రాంతానికి జగన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది! నరనరాల్లో జీర్ణించుకుపోయిన పల్నాటి పౌరుషం నేడు పారిపోయిందా!? మీసం మెలసి, తొడకొట్టే రోషం నేడు నశించిందా? శతాబ్ధాల వైభవం అని చెప్పుకుంటూ జబ్బలు చరుచుకునే పలనాటి వీరగాథ నేడు ఒట్టి బుర్ర కథేనా? బ్రిటిష్ వాడి దాస్య సుంకలాల నుంచి విముక్తి పొందినా.. నేటికి పల్నాడులో వారు కట్టిన కట్టడాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లే నేటికి దర్శనమిస్తున్నాయి! 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా పల్నాడు అన్ని రంగాల్లో వెనుకబడే ఉంది. దార్శనికత లేని నాయకులు, పల్నాడు గడ్డపై పుట్టి కూడా.. పుట్టిన గడ్డకు తనవంతు అభివృద్ధి కోసం పాటుపడలేని పాలకులు దొరకడం నిజంగా ఆ ప్రాంత వాసుల దౌర్భగ్యమే! కరువు కోరల్లో ఉపాధి లేక చిక్కిపోతున్న డొక్కలు చూసైనా పాలకులు మేలుకోవాలని పల్నాడు వాసులు కోరుతున్నారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పల్నాడు పాత్రను పక్కన పెట్టి.. జిల్లా కేంద్రాన్ని ఎక్కడో చివర ఏర్పాటు చేయడం సబబు కాదు, ఇప్పటికే అభివృద్ధి చెంది, మౌళిక వసతులు, ఉపాధి అవకాశాలు దండిగా ఉన్న నరసరావుపేటను ఈ జిల్లా కేంద్రంగా తరలించడం ఎంతవరకు న్యాయమని పశ్నిస్తున్నారు. అధికార వైసీపీ పల్నాడు ప్రాంతానికి చేస్తున్న అన్యాయాన్ని ముక్తకంఠంతో ఖండించాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి!
మూడు నియోజకవర్గాలకు తీవ్ర అన్యాయం!
పల్నాడు ప్రాంతంలో అత్యంత వెనుకబడి, తీవ్ర కరువును ఎదుర్కొటున్న ఆ మూడు నియోజకవర్గాలు పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది. జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జిల్లాల పునర్విభజన గెజిట్ తో మొత్తం 26 జిల్లాలుగా ఏపీ అవతరించబోతుంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మూడు జిల్లాలుగా విభజించబడింది. గుంటూరు, బాపట్లతో పాటు పల్నాడు జిల్లాగా నరసరావుపేటను ఎంపిక చేసింది ఏపీ కేబినెట్. ఈ నిర్ణయం పల్నాడు ప్రాంత వాసులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. పల్నాడు ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలైనా గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాలు ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోతున్నాయి. ఎప్పటి నుంచో మూడు ప్రాంతాల వాసులు పల్నాడు నడిబొడ్డునగా ఉన్న గురజాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్స్ పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లాను నరసరావుపేటలో ఏర్పాటు చేయడాన్ని ప్రజలు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నారు. గురజాలను పల్నాడు జిల్లా కేంద్రంగా నిర్ణయిస్తే.. గురజాల నియోజకవర్గంతో పాటు సరిహద్దు నియోజకవర్గాలైనా మాచర్ల, వినుకొండ నియోజకవర్గాలలోని 10 మండలాలు అన్ని రంగాల్లో వృద్థిని సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కారంపూడి, బొల్లపల్లి,శావల్యపురం మండలం, వినుకొండ మండలాల నడుమ పారిశ్రామికంగా ఎదిగేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నారు. పరిశ్రమల విస్తరణ పెరిగితే ఉపాధి, వ్యాపార అవకాశాలతోపాటు అన్ని రంగాలు ఆర్థిక వృద్ధిని సాధిస్తాయని సర్వేలు చెబుతున్నాయి.











