వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద వరుసగా అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు.
”మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం జరగగా.. నేడు మరో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రైవేట్ అంబులెన్స్ దందా కారణంగా అమానవీయ ఘటన చోటుచేసుకుండాని తెలిపారు.
అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించిన లోకేష్, జగన్ ఒక చేతగాని పాలకుడని.. జగన్ చెత్త పాలన కారణంగా అనారోగ్యంతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని తండ్రి 90 కిలోమీటర్లు బైక్ పై తీసుకెళ్లి అంత్యక్రియలు చెయ్యాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బాలుడు జేసవా మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ కావాలని వేడుకున్నా అక్కడి సిబ్బంది కనికరం చూపలేదని లోకేష్ అన్నారు.ప్రైవేట్ అంబులెన్స్ ల ధరలు తట్టుకోలేక ఆ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని రాజంపేట జిల్లాలోని చిట్వేలుకు సుమారు 90 కిలోమీటర్ల మేర బైక్ పైనే తరలించారని చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం ప్రభుత్వం పార్థివ దేహాన్ని ఉచితంగా తరలించే మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేసిందన్న లోకేష్ , వైసీపీ ప్రభుత్వం మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చెయ్యడం కారణంగానే ప్రైవేట్ అంబులెన్స్ దందా పెరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం జగన్ మొద్దు నిద్ర వీడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులు మెరుగుపర్చాలని లోకేశ్ డిమాండ్ చేశారు.