ఆంధ్రప్రదేశ్ లో మొన్నటిదాకా ప్రజల ధనమాన ప్రాణాలకే రక్షణ లేదనుకున్నాం..ఇప్పుడక్కడి పౌరుల డేటాకు (వ్యక్తిగత వివరాల సమాచారం) కూడా భద్రత లేదని తేలిపోయింది..
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి చెందిన అత్యంత గోప్యమైన సమాచారం యావత్తూ ఇప్పుడు రాష్ట్రం దాటించేశారు, పొరుగు రాష్ట్రాలకే కాదు విదేశాలకూ చేర్చేశారనే వార్తలతో అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ‘‘మా భవిష్యత్తు, మా నమ్మకం, గడపగడపకూ’’ ప్రోగ్రామ్ ల పేరుతో ఇంటింటి సర్వేలో వ్యక్తిగత వివరాలన్నీ సేకరించడం వివాదాస్పదమైంది.. ప్రభుత్వం అంటిస్తోన్న స్టిక్కర్ల మతలబు ఇదా అని నివ్వెరపోతున్నారు.
‘దిశయాప్’ తో సహా రకరకాల యాప్ లు, సర్వేలతోపాటు, ‘‘వైఎస్సార్ నవశకం’’ కింద 10రకాల స్కీమ్ ల పై సమాచార సేకరణ, ‘‘జగనన్న సురక్ష’’ లో ప్రతి పౌరుడి అత్యంత గోప్యమైన వ్యక్తిగత వివరాలన్నీ బైటకు పొక్కడం ఆందోళనకరం.. ఇంటి అడ్రస్ లు, కరెంటు మీటర్ నంబరు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్టు, పాన్ కార్డు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతా జెరాక్స్ లు, వేలిముద్రలు అన్నీ రాష్ట్రం దాటి ఎవరెవరికో పోతున్నాయని, అక్కడనుండి అరాచక శక్తులకు చేరుతోందనే విమర్శ ఉంది..
గ్రామ, వార్డు సచివాలయాల్లోని కంప్యూటర్లలో ఈ డేటా అంతా, స్టేట్ డేటా సెంటర్ లో నిక్షిప్తం చేయాల్సింది కాస్తా, నానక్ రామ్ గూడలోని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ (ఎఫ్ ఏవో)కి చేరవేయడం గమనార్హం..ఇందులో రామ్ ఇన్ఫో, ఉపాధి టెక్నో సర్వీసెస్, మ్యాక్స్ డిటెక్టివ్ అండ్ గార్డియన్ సర్వీసెస్, 3కంపెనీల కన్సార్షియందే కీలకం కాగా, ఈ ప్రక్రియలో ఒకవైపు వ్యక్తుల డేటా దుర్వినియోగం మరోవైపు రూ 700కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో మహిళల అదృశ్యం, హ్యూమన్ ట్రాఫికింగ్ పెరగడానికి కూడా ఇదొక కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక అడుగు ముందుకేసి విమర్శించడం, దీనిపై సెంట్రల్ ఇంటలిజెన్స్ సమాచారం కూడా తనకుందని చెప్పడం మరింత భయాందోళనలను పెంచేవే..
గత ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా జగన్మోహన రెడ్డి ఏ డేటా చౌర్యం గురించి అప్పటి టిడిపి ప్రభుత్వంపై తన ప్రసంగాల్లో నిప్పులు కక్కారో, ఇప్పుడదే డేటా మొత్తం నేడు ఆయన ప్రభుత్వంలోనే చోరీకి గురి కావడం గమనార్హం..అప్పట్లో ఆయనన్న మాటలు, ‘‘ప్రజలంతా భద్రంగా దాచుకునే డిటైల్స్…బ్యాంక్ అకౌంట్ డిటైల్స్, ఆధార్ డిటైల్స్, ఆడవాళ్ల ఫోన్ నెంబర్ల డిటైల్స్..ఇంటి లొకేషన్లు, ఓటర్ కార్డు నెంబర్లు అన్నీ దొంగిలించి, మన ఇళ్లలో ఆడవాళ్ల ఫోన్ నెంబర్లు వాళ్ల వద్ద ఉన్నాయంటే మనకింక భద్రత ఉందా అని అడుగుతున్నానన్న’’ జగన్ వ్యాఖ్యలే బూమ్ రాంగ్ అయ్యాయి..
టిడిపి ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలపై జగన్మోహన రెడ్డి చేసిన రచ్చ తెలిసిందే..జన్మభూమి కమిటీ సభ్యులకేమీ అప్పట్లో జీతభత్యాలు లేవు, సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో వాళ్ల పాత్రా అంతంతే, అయినా నిందమోశారు. విపక్షాల విమర్శల నేపథ్యంలో జన్మభూమి కమిటీలను రద్దు చేస్తున్నట్లు 2017లోనే పార్టీ సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు కూడా..
2019లో జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి కాగానే టిడిపి హయాంలో డేటా బ్రీచ్ పై విచారణకు ఆదేశించారు. వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో సభా సంఘాన్ని నియమించారు…వాళ్లిచ్చిన 85పేజీల మధ్యంతర నివేదికలో సేవామిత్ర యాప్ ను దుర్వినియోగం చేశారని, దాని ద్వారా 30లక్షల ఓటర్ల తొలగింపు ప్రయత్నం జరిగిందన్నారే తప్ప వాటికేమీ ఆధారాలను చూపలేక పోయారు..సదరు నివేదిక ఇచ్చికూడా రేపు సెప్టెంబర్ కు ఏడాది, ఇంతవరకు పూర్తిస్థాయి నివేదిక అతీగతీలేదు.. మధ్యంతర నివేదికలో కూడా 2పేజీలే సభా సంఘం వివరణ, మిగిలిన పేజీలన్నీ కంప్యూటర్ ఐపి అడ్రస్ లే..డేటా బైటకెళ్లిందని అన్నారే తప్ప ఏ సర్వర్ల ఐపి అడ్రస్ లకు వెళ్లిందో చెప్పలేక చేతులెత్తేశారు..వలంటీర్లను ఇంటింటికి పంపించి ఆధార్ కార్డులు సేకరించి, వైసిపి ప్రభుత్వమే డేటా చౌర్యం చేస్తోందని గత ఏడాది సెప్టెంబర్ లోనే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, దమ్ముంటే ఈ కేసు విచారణ సుప్రీంకోర్టుకు అప్పజెప్పాలని అప్పట్లోనే డిమాండ్ చేశారు. టిడిపి హయాంలో కాపుల రిజర్వేషన్ల కోసం నియమించిన జస్టిస్ మంజునాథ్ కమిషన్ కు సమర్పించడానికే అప్పట్లో స్మార్ట్ పల్స్ సర్వే చేశారే తప్ప వ్యక్తుల డేటా చోరీ జరగలేదని స్పష్టం చేయడం విదితమే..
అప్పట్లో జన్మభూమి కమిటీలపై అన్ని విమర్శలు గుప్పించిన జగన్మోహన రెడ్డి ఇప్పుడీ వలంటీర్ల అకృత్యాలపై నోరు తెరవరేంటని విపక్షాలు నిగ్గదీస్తున్నాయి..వలంటీర్ల అకృత్యాలనే కాకుండా, వాళ్లు సేకరించిన వ్యక్తిగత డేటా పక్కదారి పట్టడాన్నే నిలదీస్తున్నారు.. ఎన్నికల ఏడాదిలో డేటా చౌర్యంలో చిక్కుకుని వైసిపి ప్రభుత్వం విలవిల్లాడుతోంది..టిడిపి, జనసేన, వామపక్షాల విమర్శలకు జవాబివ్వలేని పరిస్థితిలో బిక్కిచచ్చిపోతోంది..కోడలికి బుద్ది చెప్పి అత్త తెడ్డు నాకిందన్న చందంగా వైసిపి ప్రభుత్వ తీరును గర్హిస్తున్నారు. జగన్మోహన రెడ్డి చెప్పేది చెయ్యడని, చేసేది చెప్పడని గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల అత్యంత గోప్యమైన వ్యక్తిగత వివరాల ‘‘డేటా చౌర్యం’’ కారణంగా, రేపటి ఎన్నికల్లో వైసిపి తగిన మూల్యం చెల్లించక తప్పదనే భావన సర్వత్రా ఉంది.
వలంటీర్లు చేస్తున్న ఇంటింటి సర్వేలో కూడా 1)వైసిపి అభిమానులెవరు, వ్యతిరేకులెవరు, 2) సీఎం సొంత పత్రిక అభిమానులేనా మీరు.. అనే డేటా కూడా సేకరించడం విశేషం..
ఎవరి కోసం, కేవలం వ్యతిరేకుల ఓట్లు తొలగించేందుకా, వాళ్లకు ప్రభుత్వ పథకాల లబ్ది ఆపేందుకా..? వీటితోపాటు మరింకెందుకైనా వాటిని దుర్వినియోగం చేస్తున్నారా అనే ఆందోళనే నేడు ఎక్కడ చూసినా.











