తెలుగు తెరపై ఐటమ్ సాంగ్స్ అనగానే జయమాలిని .. జ్యోతిలక్ష్మీ .. సిల్క్ స్మిత తరువాత అనురాధ పేరు వినిపిస్తుంది. ఎంతో గ్లామరస్ గా కనిపిస్తూ .. హుషారైన డాన్సులతో ఆమె మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసేది. అందువలన ఒకానొక దశలో అనురాధ కనిపించని సినిమా ఉండేది కాదు. ఆమె కోసం .. ఆమె ఐటమ్ సాంగ్ కోసం మళ్లీ మళ్లీ ఆ సినిమాను చూసిన ప్రేక్షకులు ఉన్నారు. అలాంటి అనురాధ .. తాజాగా షకీలా తో కలిసి ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన కెరియర్ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
“నా అసలు పేరు సులోచన .. మా అమ్మగారి ఊరు రాజమండ్రి దగ్గర కొవ్వూరు. మా నాన్నగారు మహారాష్ట్రకి చెందినవారు. ఇద్దరూ చెన్నైలో సెటిలైన తరువాత నేను పుట్టాను. మొదటి నుంచి కూడా నాకు నటనపట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. 5 భాషల్లో హీరోయిన్ గా 32 సినిమాల వరకూ చేశాను. ఓ మలయాళం సినిమా చేస్తూ ఉండగా, దర్శకుడు కేజే జార్జ్ గారు నా పేరును ‘అనూరాధ’గా మార్చారు. ఒకానొక సమయంలో వచ్చిన అవకాశాన్ని కాదనలేక నేను ఐటమ్ సాంగ్ చేయవలసి వచ్చింది. ఆ సాంగ్ సూపర్ హిట్ కావడంతో, అప్పటి నుంచి అదే తరహా పాటలు వచ్చాయి .. అవే చేసుకుంటూ వెళ్లవలసి వచ్చింది.
కెరియర్ తొలినాళ్లలో జయశంకర్ గారు దర్శకత్వం వహిస్తున్న ఒక తమిళ సినిమాలో ‘రండి .. కూర్చోండి’ అనే సింగిల్ డైలాగ్ ను నేను చెప్పలేకపోయాను. ఆ డైలాగ్ ను చెప్పడానికి 16 టేకులు తీసుకున్నాను .. జయశంకర్ గారు నాపై కోప్పడ్డారు. అలాంటి నేను ఆ తరువాత కాలంలో మూడు షిఫ్టులలో మూడు భాషలకి చెందిన సినిమాల షూటింగులో పాల్గొనేదాన్ని. అలా 1986లో 5 భాషల్లో కలుపుకుని నేను 87 సినిమాలు చేశాను. మొత్తంగా 700 సినిమాల వరకూ చేశాను. నా కెరియర్లోను ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయి. అయినా ఒక నటిగా నేను పెద్ద సక్సెస్ నే చూశాననే సంతోషం .. సంతృప్తి ఉన్నాయి” అని చెప్పుకొచ్చారు.
Must Read ;- తెలుగులో వస్తున్న షకీలా ప్రేక్షకులను మెప్పిస్తుందా..?