షకీల – ఓ జనరేషన్ లో ఈ పేరే ఓ జెనరేటర్.. ఇరవైకీ అరవైకీ సరిహద్దులు చెరిపేసిన నటి ఎవరంటే ఆమె షకీలానే. ఎద ఎదలో ఎన్నెన్ని గుండె రొదలో.. అందుకే ఆమె ఓ మెరుపు కీల.. ఆ మత్తెక్కించే కళ్లలోని కైపు.. శూలంలా గుండెల్లో దిగే ఆ చూపు.. లయ తప్పకుండా ఇంకెలా ఉంటుంది చెప్పండి.
దర్శకుడు తేజ ‘జయం’ సినిమాలో లెక్చరర్ గా క్లాస్ లోకి అడుగుపెడుతూనే కట్టిపడేస్తుంది. ‘మీ కాలేజీలో అన్ని డిపార్ట్ మెంట్స్ నాకిందే ఉంటాయి.. నా పేరు జ్ఞాన సరస్వతి’ అంటూ ఎంట్రీ ఇచ్చే సన్నివేశం ఇంకా గుర్తుండే ఉంటుంది. ఈ క్లాస్ మూవీలోనే ఇలా ఉంటే మాస్ మూవీలో షకీల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంటుంది. అడల్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ షకీల అనే చెప్పాలి. ఒక తరంలో ఆమెకు అభిమాన సంఘాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. సాధారణంగా బయోపిక్ లు చనిపోయిన వారి విషయంలో ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి ది ఓ బతికున్న నటికి.. ఇంకా చెప్పాలంటే వాంప్ పాత్రలు వేసే నటికి బయోపిక్ రావటం అంటే విశేషమే కదూ.

‘షకీల’ బయోపిక్ అలాంటి సంచలనాలకు తెరతీసింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో సిల్క్ స్మిత ఆత్మహత్య తర్వాత సినీ పరిశ్రమలో ఏర్పడిన ఖాళీని ఎవరైనా భర్తీ చేస్తారా? అంటూ ఆసక్తి రేకెత్తించేలా వదిలారు. ఒకవిధంగా చెప్పాలంటే షకీల పోర్న్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. సిల్క్ స్మితను డ్యాన్సర్ గానే చెప్పాల్సి ఉంటుంది. ఈ ఇద్దరినీ పోల్చడం కూడా సరికాదు. సినిమా పరిశ్రమలో షకీలకు ఎదురైన చేదు అనుభవాలే ఈ సినిమాలో ఉంటాయట. ఈ తరహా నటనను ఆమె ఎంచుకోడానికి దారితీసిన పరిస్థితులేమిటి? ఈ రంగంలో ఎదురైన చేదు అనుభవాలేమిటి? అనే అంశాలనే ఈ సినిమాలో ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారట కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్.

Must Read ;- హనీమూన్ లో మునిగితేలుతోన్న చందమామ
ఎవరీ షకీల? ఏమా కథ?
చెప్పాలంటే షకీల తెలుగమ్మాయే. ఆమె స్వస్థలం నెల్లూరు.. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆరుగురు సంతానం ఉన్న ఆ కుటుంబంలో షకీలా బేగమ్ ఒకరు. అంతమందిని పోషించాలంటే ఆమె కూడా సంపాదించక తప్పదని చిన్నప్పుడే షకీలను చదువు మాన్పించి సంపాదన మీద దృష్టిపెట్టించాడు తండ్రి. అందచందాలు మెండుగా ఉండటంతో మోడలింగ్ అవకాశాలు తలుపుతట్టాయి. అలా బీగ్రేడ్ సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. తన దగ్గరకు వచ్చిన దాన్ని దేన్నీ కాదనలేదు షకీల. 1980వ దశకంలో సిల్క్ స్మిత హవా నడుస్తోంది. అదే సమయంలో ఆమెకు చెల్లిగా నటించే అవకాశం వచ్చింది షకీలకు. అలా అందరి దృష్టిలోనూ పడింది షకీల. స్మిత చనిపోయాక అవకాశాలు వెల్లువెత్తాయి. 1990 వ దశకంలో ఆమె హవా సాగింది.
మలయాళ సూపర్ స్టార్లను సైతం..
షకీల సినిమా విడుదలవుతుందంటే మలయాళ సూపర్ స్టార్ల గుండెల్లో రైళ్లు పరుగెట్టేవి అనడంలో అతిశయోక్తి లేదు. ఈమె సినిమాలు నిషేధించాలని ఈ హీరోలు ధర్నాలు చేసే దాకా పరిస్థితి వెళ్లింది. మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపీ లాంటి పెద్ద హీరోలు షకీల సినిమాలకు వ్యతిరేకంగా ధర్నాలు కూడా చేశారు. ఆమెపై రెండు సార్లు హత్యాయత్నాలు కూడా జరిగాయి. దీని వెనుక కొందరు హీరోల పాత్ర ఉందన్న ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు ‘షకీల’ సినిమాలో చాలామంది హీరోల చీకటి బాగోతాన్ని కూడా చూపించారని అంటున్నారు. ఈ సినిమాలో షకీల పాత్రను రిచా చద్దా పోషించింది.
25న దిమ్మ తిరిగే బొమ్మ ‘షకీల’
‘షకీల’ సినిమాలో మసాలా మామూలుగా లేదట. ఈ సినిమాని ఈ నెల 25న విడుదల చేయనున్నారు. ఇందులో షకీలగా రిచా చద్దా, పంకజ్ త్రిపాఠి, రాజీవ్ పిళ్లే తదితరులు నటించారు. పోర్న్ స్టార్ అన్న ముద్ర తనపై పడినందుకు తనకు ఎలాంటి విచారమూ లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనకు ఇంతటి హోదా లభించిందంటే ఆ ముద్రే కారణమని ఆమె అన్నారు. తన ప్రియుడు, తన బంధువులు తనను ఎలా మోసం చేశారో కూడా ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనపై రూపొందిన బయోపిక్ లోని అంశాలన్నీ వాస్తవాలకు దగ్గరగానే ఉంటాయంది. ఇది మంచి మసాలా దినుసులతో చేసిన మటన్ బిర్యానీ లాంటి సినిమాగా ఆమె అభివర్ణించింది. మలయాళం, తెలుగు, తమిళం దాదాపు 250 చిత్రాల్లో నటించిన షకీల కెరీర్ లో ఈ బయోపిక్ కూడా ఓ మైలురాయిలా నిలిచిపోతుందేమో చూడాలి.
– హేమసుందర్ పామర్తి
Also Read ;- పోలవరంలో బ్యూటీ స్వీటీ ప్రత్యేక పూజలు











