కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ అక్కర్లేదు అనే డైలాగ్ ఆ మధ్య వచ్చిన ఓ సినిమాలో ఉంది. ఆ డైలాగ్ రవితేజ విషయంలో అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. ఎందుకంటే ఎనర్జీతో కూడిన రవితేజ యాక్టింగులో కావాల్సినంత కంటెంట్ ఉంది. తెరపై ఆయన ఏ పాత్ర పోషించినా ఎదురులేని ఎనర్జీకి కాళ్లు చేతులు తగిలించినట్టుగా కనిపిస్తుంది. ఆయన సినిమా చూసిన ప్రేక్షకులకు ఎనర్జీ డ్రింక్ తాగినట్టుగా అనిపిస్తుంది. టాలీవుడ్లో మాస్ హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటి మాస్ హీరోల్లో ప్రత్యేకమైన కేటగిరిలో రవితేజ నిలుస్తాడు. మాస్ ఇజం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకి రవితేజ కటౌట్ చూపించేయవచ్చు. అలాంటి రవితేజ పుట్టినరోజు .. ఈ రోజు.
సినిమాల్లోకి రావాలన్నా .. హీరోగా నిలదొక్కుకోవాలన్నా బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉండాలనే అభిప్రాయాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఎలాంటి నేపథ్యం లేకపోతే ఇక్కడ చిన్నచిన్న పాత్రలే చేస్తూపోవాలి. ఎంత ఇస్తే అంతపుచ్చుకుని వెళ్లే అలాంటి పాత్రలు ఎంతకాలమైనా చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి రవితేజ ఊరుకోలేదు .. ఆకాశం చాలా పెద్దది కదా అని భయపడి పిట్టపిల్ల ఎగరడం మానేస్తుందా? అనుకుని ధైర్యంగా ముందడుగు వేశాడు. సముద్రమంతా తనదేనని చేపపిల్ల అనుకుని ఉత్సాహంగా ఈదినట్టు దూసుకుపోయాడు.

తెరపై ఏదో ఓ మూల కనిపించే పాత్రలతో నటుడిగా ఆయన ప్రయాణం మొదలైంది. అలా ఓ ఏడేళ్లు తిప్పలు పడిన తరువాత ‘సిందూరం’ సినిమాలో రెండవ హీరోగా అవకాశం దక్కింది. ఆ సినిమాలో ఆయన నటనకి మంచి మార్కులు పడ్డాయి. చంటిగాడు అనే ఆకతాయి పాత్రలో ఆయన చేసిన అల్లరి పనులు ప్రేక్షకులకు నచ్చాయి. ఆ తరువాత వచ్చిన ‘నీ కోసం’ సినిమాతో యూత్ నుంచి మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ తరువాత రవితేజ వెనుదిరిగి చూసుకోలేదు.
ఇక ఆ తరువాత రవితేజ ఏడాదికి తక్కువలో తక్కువగా మూడు నాలుగు సినిమాలు చేస్తూ వెళ్లాడు. ప్రతి ఏడాది ఒక భారీ హిట్ కొడుతూ తన జోరును కొనసాగించాడు. ఒకవైపున సీనియర్ స్టార్ హీరోల నుంచి .. మరో వైపున యువ హీరోల నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ తట్టుకుని నిలబడ్డాడు. తనకంటూ ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ను .. డైలాగ్ డెలివరీని సెట్ చేసుకుని, తన సినిమాల్లో మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకుని ముందుకు వెళ్లాడు .. మాస్ మహారాజ్ అనిపించుకున్నాడు.
Also Read ;- కళ్యాణ్ రామ్ స్టోరీని రవితేజ తీసేసుకున్నారా?
తెరపై రవితేజ ఎక్కడ కూడా కావాలని బిల్డప్ ఇస్తున్నట్టుగా కనిపించడు. పాత్ర పరిధిని ఎంతమాత్రం దాటకుండా .. అందులో సహజత్వం ఉండేలా చూసుకుంటాడు. అందువల్లనే ఆయనను తెరపై కాకుండా మన మధ్యలో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. రవితేజకి ‘సిందూరం’తో లైఫ్ ఇచ్చిన కృష్ణవంశీ ఆ తరువాత ‘ఖడ్గం’ సినిమాతో ఆయనను మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఇక ‘నీ కోసం’ సినిమాతో రవితేజలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన శ్రీను వైట్ల, ‘వెంకీ’ సినిమాతో ఆయన కెరియర్లో మరో మైలురాయిని నిలబెట్టాడు.
‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’తో రవితేజకి బ్రేక్ ఇచ్చిన పూరి, ఆ తరువాత ‘ఇడియట్‘ .. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలతో రవితేజను తిరుగులేని స్టార్ హీరోను చేసేశాడు. రవితేజ కెరియర్ ను ప్రభావితం చేసిన దర్శకులుగా ఈ ముగ్గురి పేర్లను చెప్పుకోవచ్చు. తెరపైనే కాదు బయట కూడా రవితేజ అంతే యాక్టివ్ గా ఉంటాడు. తన టైమ్ ను సద్వినియోగం చేసుకోవడం .. ఎదుటివారి టైమ్ ను వేస్టు చేయకపోవడం ఆయనకున్న మంచి అలవాటు. ఏ విషయమైనా సరే నాన్చడం ఎంతమాత్రం ఇష్టం లేని తత్వం ఆయనది. అందుకే చాలా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేశాడు.
హిట్లు పడినప్పుడు పొంగిపోవడం .. వరుస ఫ్లాపులు పడుతున్నాయని కుంగిపోవడం ఆయన తెలియదు. హిట్ టాక్ వచ్చినా .. ఫ్లాప్ టాక్ వచ్చినా ఆ రోజున ఎంజాయ్ చేసి, మరుసటి రోజునే ఆ విషయాన్ని వదిలేసి కొత్త ప్రాజెక్టును గురించి ఆలోచించడం ఆయన నైజం. ఇంతటి సుదీర్ఘమైన కెరియర్ ను ఆయన నిలకడగా సాగించడానికి ఇదో కారణమని చెప్పుకోవచ్చు. ‘రాజా ది గ్రేట్‘ తరువాత రీసెంట్ గా ఆయన ‘క్రాక్’ సినిమాతో హిట్ కొట్టాడు. ఈ సినిమా ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం విశేషం.
ఈ సినిమా సక్సెస్ ను గురించి అంతా మాట్లాడుకుంటూ ఉండగానే ఆయన ‘ఖిలాడి’ సినిమాను లైన్లో పెట్టాడు. ఇండస్ట్రీలో ఎలాంటి అండదండలు లేకుండా రవితేజ ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా గొప్ప విషయమే. మారుమూల ప్రాంతాల్లోని మాస్ ఆడియన్స్ మనసు గెలుచుకోవడం విశేషమే. ఆయన సినిమాలు లాభాలను మాత్రమే కాదు, విజిల్స్ ను వసూలు చేస్తాయి .. క్లాప్స్ ను కలెక్ట్ చేస్తాయి. మాస్ కేంద్రాల్లో జెండా ఎగరేస్తాయి .. జోరుగా జాతర చేస్తాయి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ మాస్ మహారాజుకి ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read ;- రవితేజ లేకపోతే నేను లేను క్రాక్ డైరెక్టర్











