తెలుగు, తమిళ, హిందీ భాషలలో అనేక సినిమాలకు దర్శకత్వం మరియు నిర్మాతగా వ్యవహరించిన టీయల్వీ ప్రసాద్ మాతృమూర్తి తాతినేని అన్నపూర్ణ ఇక లేరు. ఆమె వయసు 91 సంవత్సరాలు. అలనాటి యన్టీఆర్ , ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి దిగ్గజ నటులతోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఎందరో నటీ నటుల చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించిన అలనాటి దర్శకుడు తాతినేని ప్రకాశరావుగారి భార్య అన్నపూర్ణ. వీరి కుమారుడు ప్రముఖ చలన చిత్ర దర్శకుడు టీయల్వీ ప్రసాద్ కాగా, కుమార్తె లీల అమెరికాలో స్థిరపడ్డారు.
నానీ నటించిన భీమిలీ కబడ్డీ జట్టు సినిమాతో దర్శకుడిగా పరిచయమై యస్సెమ్మెస్, శంకర, వీడెవడు లాంటి హిట్స్ అందించిన నేటి తరం దర్శకుడు తాతినేని సత్య.. అన్నపూర్ణ గారి మనవడు. తన ఇంటినుండే మూడు తరాల చలన చిత్ర దర్శకులను అందించిన అన్నపూర్ణ గారి మృతి బాధాకరం.