తెలంగాణ పీసీసీ నియామకానికి మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాత పీసీసీ నియామకం చేపట్టాలంటూ ఓ సీనియర్ నేత రాసిన లేఖ ఆదారంగా కాంగ్రెస్ అదిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు పీసీసీ నియమిస్తే మిగిలిన నేతలు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో సహకరించక పోయే ప్రమాదం ఉందని ఆ నేత ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అత్యవసరంగా సమావేశం అయిన అధిష్టానం ఆ ప్రక్రియను వాయిదా వేసినట్టు చెబుతున్నారు. అయితే కారణం ఇదేనా వేరే ఏమైనా ఉందా అన్న కోణంలో పార్టీనేతలు విశ్లేషిస్తున్నారు. అయితే కర్ణుడి చావుకు ఆరు కారణాలు అన్నట్టు పీసీసీ వాయిదాకు కూడా అనేక కారణాలున్నాయంటున్నారు పార్టీ కేడర్..
పాత నేతల కుట్ర అంటున్న కాంగ్రెస్ వర్గాలు..
పీసీసీ అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి నియామకం ఇక లాంఛనమే అన్న ప్రచారం సాగింది. రెండురోజులుగా ఇందుకు సంబంధించిన లీకులు ఇచ్చింది ఢిల్లీ కాంగ్రెస్. దీంతో నిన్న సాయంత్రం నుండి జీవన్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. ఉదయం కూడా ఆయన జన్మదినం కావటంతో ఆయన ఇంటికి వెళ్ళి నేతలంతా కేకులు కట్ చేయించడం.. సన్మానాలు చేయడం సాగిపోయాయి.
అయితే లీకులు ఇచ్చిన సరిగ్గా 24 గంటలకు ఇప్పట్లో పీసీసీ లేదని తేల్చి చెప్పారు ఢిల్లీ పెద్దలు. పదవులపై అన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తూ సర్దుకు పోయేందుకు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఇలా పిడుగులాంటి వార్త వారిని కలవర పాటుకు గురిచేసింది. అయితే ఇందుకు కారణం పార్టీ పెద్దలే అన్న సందేహం వినిపిస్తోంది. ముందుగా ఇచ్చిన లీకుల మేరకు పీసీసీ అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి, ప్రచార కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించాలని తుది నిర్ణయానికి వచ్చార. అయితే ఇక్కడే కాంగ్ పెద్దలు చక్రం తిప్పారని తెలుస్తోంది. అన్ని పదవులు ఒకే సామాజిక వర్గానికి కేటాయిస్తే తాము ఏం చేయాలన్న అభ్యంతరం వ్యక్తం చేసారని చెబుతున్నారు. అన్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఇక మా దారి మేము చూసుకుంటాని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ అదిష్టానం సైతం కలవర పాటుకు గురై పీసీసీని వాయిదా వేయాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఇప్పట్లో లేనట్టే.
అంతా సర్దుకున్నట్టే అనుకుంటున్న సమయంలో రాష్ట్ర నేతల నుండి వచ్చిన అనూహ్య అభ్యంతరం తో ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానానికి మరో తలనొప్పి ఎదురైంది అంటున్నారు. చచ్చీ చెడి రేవంత్ ను ప్రచారకమిటీకి ఒప్పించి అందరూ అన్నట్టుగానే పాత నేతకు పీసీసీ ఇస్తామని చెప్పడంతో అందరూ సమ్మతిస్తారని భావించారు. అయితే ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లో ఇలాంటి ట్విస్ట్ లకు కొదవేం ఉండదంటున్నారు విశ్లేషకులు. అందరికీ అమోద యోగ్యమైన నేత కాంగ్రెస్ లో దొరికేదెప్పుడో.. అప్పుడు కూడా ఎవరు ఏ కారణంతో అడ్డుపుల్ల వేస్తారో అన్న అనుమానం కాంగ్రెస్ పెద్దలను వెంటాడుతోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పూర్తిగా అభాసు పాలైన కాంగ్రెస్ ను సొంత పార్టీ నేతల మరింత చంపేస్తున్నారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నిపుణులు. అయితే ఈ వ్యవహారం ఇప్పట్లో తేలే పరిస్థితి లేదని అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో .. ఎప్పటికి పీసీసీ నియామకం జరుగుతుందో .. పార్టీ ఎప్పటికి గాడిలో పడుతుందో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కేడర్. అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం సాధ్యమేనా అంటే నోరుమెదపడం లేదు .