తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనడానికి నిన్నటి గ్రేటర్ ఫలితాలే నిదర్శనం. అయితే బీజేపీ స్పీడ్‌ను అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అడ్డుకట్ల వేయాలంటే ఢిల్లీ స్థాయిలో బీజేపీపై పోరాటం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు చేపడుతున్న భారత్ బంద్ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ దానిని ఒక వేదికగా మలుచుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ బంద్‌లో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్వయంగా పాల్గొని కేంద్రంపై తమ పోరాటాన్ని స్టార్ట్ చేశామనే సంకేతాలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. స్వయంగా మంత్రి కేటీఆర్ సైతం బంద్‌లో పాల్గొని రోడ్డుపై బైఠాయించి రైతులకు తన మద్దతును తెలపడం ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
గతంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలుగానీ చట్టాలు గానీ ఏమైనా తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాలపట్ల ఇన్‌డైరెక్ట్‌గా మంత్రి కేటీఆర్ కామెంట్ చేసేవారు. కానీ రైతులు చేపడుతున్న బంద్ కార్యక్రమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు చూస్తే బీజేపీపై నేరుగా పోరాటానికి ఇక సిద్ధమైనట్లుగానే అనుకోవాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. భారత్ బంద్ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ షాపులను మూయించేశారు. ఈ బంద్‌లో టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని దానిని విజయవంతం చేసి తమ బలమేంటో ఢిల్లీ పెద్దలకు తెలిసేలా ఇలా ప్లాన్ చేసినట్లు వినికిడి. బీజేపీపై తమ పోరాటం రాష్ట్రం నుంచే ప్రారంభమైందనే సంకేతాలను ఈ విధంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత జాతీయ స్థాయిలో పోరాటం చేసేలా టీఆర్ఎస్ పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది.
అవసరమైతే బీజేపీకి రాజకీయంగా బద్ద శత్రువులుగా ఉన్న కమ్యూనిస్టులతోనూ కలిసి వెళ్లేందుకు టీఆర్ఎస్ అధినాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో కూడా వివిధ రాష్ట్రాల ప్రాంతీయ రాజకీయ పార్టీల నేతులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సంప్రదింపులు చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్న ఈతరుణంలో కమ్యూనిస్టులకు రాష్ట్రంలో పట్టు తక్కువగా ఉన్నప్పటికీ సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలతో ఫ్రెండ్‌షిప్ పెట్టుకుంటే అది జాతీయస్థాయిలో కొంత ఉపయోగకరంగా ఉంటుందని టీఆర్ఎస్ నేతలు కొందరు భావిస్తున్నారు. అయితే సీపీఐ, సీపీఎంతో లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉమ్మడి వామపక్షాల అభ్యర్థిని పోటీలో నిలబెట్టి టీఆర్ఎస్‌కు అనుకూలంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా టీఆర్ఎస్‌కు లాభం చేకూరేలా పోటీలో నిలబెట్టడమనేది టీఆర్ఎస్ ప్లాన్‌లో భాగమే అనే చర్చ జరుగుతోంది. ముందు రైతు వ్యతిరేక చట్టాలు, రాష్ట్రాల హక్కులు, జీఎస్టీ నిధులు ఇలా అనేక అంశాలపై రాజకీయ పార్టీలతో భవిష్యత్తులో కలిసి పోరాటం చేసేందుకు భారత్ బంద్‌ను ఒక ప్లాట్‌ఫామ్‌గా చేసకున్నదనే అభిప్రాయం వినబడుతోంది.
Must Read ;- టీడీపీ నిర్వీర్యం.. టీఆర్ఎస్‌కు నష్టమేనా..?
రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు…
ఈ రోజు భారత్ బంద్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతు కన్నీరు దేశానికి మంచిది కాదన్నారు. ఆయా ప్రభుత్వాలు చేసే చట్టాలు నచ్చనప్పుడు నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని ఆయన తెలిపారు. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్లో మద్దతు ధర అనే అంశంలేదని విమర్శించారు. కార్పొరేట్ శక్తులతో కొట్లాడే శక్తి రైతులకు లేదని ఆయన పేర్కొన్నారు. ఎక్కడికి పడితే అక్కడికి రైతు వెళ్లి తన పంటను అమ్ముకునే శక్తి రైతులకు లేదన్నారు. కార్పొరేట్ శక్తులు మాయమాటలు చెప్పి రైతుదగ్గర పంటను కొనుగోలుచేసే ప్రమాదముందని విమర్శించారు. ఇదే జరిగితే నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడతారని ఆయన తెలిపారు. రైతులకు ద్రోహం చేసే ఈ విధానాన్ని తాను ఊరూరు తిరిగి చెప్తానని, రాష్ట్రాల హక్కులు కాలరాసే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు.
Also Read ;- చర్చల్లోకి అమిత్‌షా : కేంద్రం ఇంకాస్త దిగినట్టే..











