జీహెచ్ఎంసీ ఎన్నికల మొదటి ఘట్టం పూర్తయింది. నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియడంతో ఇక ప్రచారంలో దూసుకుపోయేందుకు అధికార, విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. రోడ్‌షోలను ప్లాన్ చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నుంచే రోడ్‌షోలను ప్రారంభించనుంది. ఈ రోడ్ షోల కోసం మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగుతున్నారు. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కేటీఆర్ రోడ్ షోలలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకు ఇవి బాగా కలిసొచ్చాయి. గ్రేటర్ వ్యాప్తంగా కేటీఆర్ ఒక్కడే ఈ రోడ్ షోలలో పాల్గొని పార్టీ విజయ తీరానికి చేర్చడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు.
అదే స్ఫూర్తితో ఈ ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా ఈ రోజు నుంచి కేటీఆర్ రోడ్ షోలలో పాల్గొంటున్నారు. కూకట్‌పల్లి నుంచి కేటీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ఈ రోడ్ షోలో కేటీఆర్ పాల్గొంటారు. ఆ తరువాత కంటోన్మెంట్, ఉప్పల్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అలాగే కుత్బుల్లాపూర్‌లో కూడా ఆయన రోడ్ షో జరగనుంది. రెండవ సారి కూడా గ్రేటర్ మేయర్ పీఠం తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ దిశగా టీఆర్ఎస్ పార్టీ ముందుకుపోతోంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ల పేర్లను ప్రకటించింది. అందులో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఉన్నారు. ఇదిలా ఉంటే శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు ముగిసింది. మొత్తం 1932 మంది అభ్యర్థులు 2602 నామినేషన్లు దాఖలు చేశారు. నేడు ఈ నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు.
Must Read ;- గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బాలయ్య, లోకేష్!