ఒక రాజకీయ పార్టీ, రాజకీయ ఎజెండాతో పిలుపు ఇచ్చిన ఉద్యమం కాకుండా.. మన దేశానికి వెన్నెముక వంటి రైతులు మాత్రమే పిలుపు ఇచ్చిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా దిగ్విజయంగా జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ, వారి జేబులో ఉన్న మరికొన్ని కూటమి పార్టీలు మినహా తతిమ్మా అన్ని పార్టీలూ ఈ భారత్ బంద్ కు మద్దతిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ బంద్ కు సహకరిస్తోంది. వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగానే బంద్ పాటిస్తున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. రైతుల పిలుపును అందుకుని.. దేశంలో బంద్ విజయవంతం కావడానికి సహకరిస్తున్న రాజకీయ పార్టీల్లో- నిజంగా రైతులంటే ఉన్న గౌరవం ఎంత? నిజంగా రైతుల మీద ప్రేమతోనే వారు ఇదంతా చేస్తున్నారా? అంటే మాత్రం అనుమానమే.
ఎందుకంటే..
అన్నదాతలు తాము తలపెట్టిన భారత్ బంద్ కు సహకరించాల్సిందిగా ఒక బహిరంగ విజ్ఞప్తి చేసినప్పుడు ఒక కీలకమైన మాట అన్నారు. మీమీ రాజకీయ పార్టీల జెండాలను పక్కన పెట్టండి.. రైతుకు, వ్యవసాయానికి గుర్తుగా భావించే పచ్చ జెండాలతో మాత్రమే భారత్ బంద్ లో పాల్గొనండి అని వారు కోరారు. ఇది చాలా కీలకమైన సంగతి.
ప్రధానంగా పంజాబ్, హర్యానాలకు చెందిన రైతులు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. హస్తినాపురాన్ని ముట్టడించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అయినాసరే.. వారితో ఇప్పటికి అయిదు విడతల్లో జరిగిన చర్చల సందర్భంగా, బీజేపీకి చెందిన కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన ఒక వ్యాఖ్యను మనం కీలకంగా గమనించాలి. రాజకీయ ప్రేరేపితం కాకుండా, రాజకీయ లక్ష్యాలతో కాకుండా రైతులు ఉద్యమం చేస్తున్నారని స్వయంగా ఆయన వ్యాఖ్యానించారు. అందుకు అభినందించారు.
ఆ రకంగా తమకు దక్కిన గౌరవాన్ని రైతులు నిలబెట్టుకోవాలనే అనుకుంటారు. రాజకీయ పార్టీల ప్రమేయంతో, వారి ప్రేరేపణతో జరిగే ఉద్యమం అయితే ఖచ్చితంగా దానిని పాలకపక్షాలు పట్టించుకోవు. అందుకే రైతులు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే- మీ రాజకీయ పార్టీల జెండాలను పక్కన పెట్టి బంద్ కు సహకరించండి అని పిలుపు ఇచ్చారు.
Must Read ;- తాడోపేడో : చట్టాలు రద్దు చేసే వరకు అంగుళమైనా కదలం
అలా జరిగిందా..
మంగళవారం నాడు దేశవ్యాప్తంగా బంద్ విజయవంతంగా జరిగింది. కానీ.. అందులో రైతుల విన్నపాన్ని పట్టించుకున్న వారు ఎవరైనా ఉన్నారా? తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్, వామపక్షాలు, కాంగ్రెస్ బంద్‌కు మద్దతిచ్చాయి. పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడే బిల్లులను వ్యతిరేకించిన పార్టీ టీఆర్ఎస్. అయితే.. దాదాపు రెండు వారాలుగా ఢిల్లీని రైతులు ముట్టడించి దీక్షలు చేస్తోంటే.. టీఆర్ఎస్ నుంచి వారికి మద్దతుగా ఒక్క ప్రకటన కూడా లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ చేతిలో పరాభవం ఎదురైన తర్వాత మాత్రమే వారికి చురుకు పుట్టింది. బీజేపీని తూర్పార పట్టడినికి ఏ అవకాశం దొరికినాసరే వదులుకోకూడదని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే.. బంద్ కు మద్దతిచ్చారు. కాంగ్రెస్, వామపక్షాలు సరేసరి.
వీరందరూ మంగళవారం నాటి బంద్ లో చురుగ్గా పాల్గొన్నారు. తమ పోరాటం మీద ప్రతిపక్షం పార్టీల ముద్ర పడకూడదన్న రైతుల కోరిక మంటగలిసిపోయింది. టీఆర్ఎస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు, ప్రత్యేకించి లెఫ్ట్ పార్టీల వారు చాలా విచ్చలవిడిగా తమ జెండాలు పట్టుకుని రోడ్ల మీదికి వచ్చారు. ఈ పార్టీల వాళ్లంతా జెండాల ప్రదర్శనలు నిర్వహించారా.. రైతు సమస్యలను నినదించారా అని సందేహం కలిగే రేంజిలో ఇవి జరిగాయి. గులాబీ, ఎరుపు, త్రివర్ణ పతాకాలు రోడ్ల మీద స్వైరవిహారం చేశాయి.
కాంగ్రెస్ పార్టీ వారికి మరీ బ్యాలెన్స్ తప్పింది. నరేంద్రమోడీ దిష్టిబొమ్మలు దహనం చేసిన సంఘటనలు కూడా జరిగాయి. ఇలాంటి కుయత్నాలన్నీ వారి వారి రాజకీయ స్వార్థంతో కూడిన ప్రయత్నాలు. ఇన్నాళ్లుగా వ్యక్తులను ద్వేషించే పద్ధతిలో కాకుండా, కేవలం చట్టాలను మాత్రమే నిరసిస్తూ రైతులు సాగించిన పోరాటానికి.. మద్దతు రూపంలో పార్టీలు రంగప్రవేశం చేసిన బంద్.. ఖచ్చితంగా దాడి తప్పింది.
అదృష్టం ఏంటంటే.. ఇలాంటి వారి పసలేని పనులు రైతుల పోరాటం మీద చూపగల ప్రభావం తక్కువ. చట్టాల పట్ల నిరసన దేశవ్యాప్తంగా ఒకే తీరుగా వ్యక్తమవుతోందనే సంగతి- కేంద్రానికి తెలిస్తే చాలు. వారి కళ్లు తెరుచుకుంటే చాలు. రైతులకు మంచి జరుగుతుంది.
Also Read ;- కమలదళంలోకి కాంగ్రెస్ నేతలు ఎవరెవరు?