GHMC ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకూ కొన్ని అనుభవాలు మిగిల్చాయి. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు భారీగానే సీట్లు సాధించాయి. అయితే కాంగ్రెస్, టీడీపీలు పెద్దగా ప్రభావం చూపలేదు. టీడీపీ తమ ఓటు బ్యాంకును మరి కొంత కోల్పోయింది. టీడీపీ తెలంగాణలో కొన్నాళ్లుగా అస్తిత్వం కోసం పోరాడుతోంది. 2002లో 45 స్థానాలు గెలిచిన తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో గ్రేటర్‌లో తన పట్టు కోల్పోతూ వస్తోంది. 2016 ఒక్క స్థానాన్ని గెలుచుకున్న టీడీపీ 13శాతం ఓట్లు సాధించింది. తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 55వేల ఓట్లు సాధించింది. ఇది మొత్తం పోలైన ఓట్లలో 1.66శాతం. ఓటు బ్యాంకు ఉన్నా ఈసారి టీడీపీకి ఆ మేరకు ఓట్లు రాలేదని చెప్పవచ్చు. తెలంగాణ టీడీపీ నాయకులే ప్రచారం చేశారు. బయటి నుంచి నాయకులు రాలేదు. ఇందుకు కారణాలు అనేకం. ఇక ప్రస్తుత పరిస్థితిలో గెలిచే అవకాశం లేదన్న అంశం కూడా ఓట్ల శాతం తగ్గేందుకు కారణమైంది. వాస్తవానికి టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని కూడా మిగతా పార్టీలు ఊహించలేదు. అయినా 106 స్థానాల్లో పోటీ చేసింది. ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.
ఓటు బ్యాంకు ఎటుమళ్లిందంటే..
ఇక ఈ పార్టీ ఓటు బ్యాంకు ఎటు వెళ్లిందనే అంశానికి వస్తే.. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు మళ్లినట్లు అంచనా వేయవచ్చు. వరద ప్రాంతాల్లో, ఎల్బీనగర్, హయత్‌నగర్ లాంటి చోట్ల బీజేపీకి వెళ్లిందని అంచనా. అంటే టీడీపీ ఓటు బ్యాంకు స్థిరంగా ఒకే పార్టీకి మళ్లిందని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ టీడీపీ ఓటు బ్యాంకును, ఏపీకి చెందిన ఓటు బ్యాంకును వేరుగా చూడాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంకు పూర్తిగా టీఆర్ఎస్‌కు పడిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. బీజేపీ నేత ఒకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు, జనసేన, బీజేపీకి మద్దతు ఇవ్వడం ఇందుకు కారణంగా చెబుతున్నారు.
బరిలో ఉంటే ఓట్ల విభజన
ఇక్కడే మరో అంశం కూడా ఉంది. ఏ లక్ష్యంతో అయితే కేసీఆర్ తెలంగాణలో టీడీపీని, తరువాత కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేశారో.. అదే ఇప్పుడు టీఆర్ఎస్‌కు నష్టం కలిగించిందని కూడా అంచనాలున్నాయి. ఆ పార్టీలు కూడా బరిలో ఉంటే ఓట్ల విభజన జరిగేది. ఏ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు ఆ పార్టీకి ఉండేది కాబట్టి..సీట్లు కూడా వచ్చేవి. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ విషయం మినహాయిస్తే.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే పరిస్థితి వచ్చింది. అది బీజేపీకి కలిసి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పట్ల కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడం సహజం. ఇతర పార్టీలు ఉంటే ఆ వ్యతిరేక ఓటును పంచుకునేవి. కాని పోటీలో మరో బలమైన పార్టీ లేకపోవడంతో.. ఇప్పుడు ఆ వ్యతిరేక ఓటు బీజేపీకి వెళ్లిందని చెప్పవచ్చు. అంటే టీఆర్ఎస్, ఎంఐఎం వ్యతిరేక ఓటును సంఘటితం చేసే వ్యూహం బీజేపీ అమలు చేసింది. టీడీపీ ఓటు బ్యాంకు కొన్ని చోట్ల టీఆర్ఎస్‌కు మళ్లినా.. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటులో సింహభాగం బీజేపీకి వెళ్లింది. అందుకే బీజేపీకి, టీఆర్ఎస్‌కు ఓట్ల శాతంలో పెద్ద తేడా లేదు. ఇక మోడీ ఛరిష్మా, బీజేపీ దూకుడు కూడా కలసి వచ్చింది.
రెండు పార్టీల మధ్య తేడా కేవలం 0.25శాతం
2016లో 10.34 శాతం ఉన్న బీజేపీ ఓట్ల శాతం..ఈ ఎన్నికల్లో అమాంతం 35.56 శాతానికి పెరగడం గమనించవచ్చు. ఇక టీఆర్ఎస్‌కు, బీజేపీకి ఓట్ల వ్యత్యాసం పరిశీలిస్తే.. ఆ రెండు పార్టీల మధ్య కేవలం 0.25శాతం మాత్రమే తేడా ఉంది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 35.81 శాతం, బీజేపీకి 35.56 శాతం వచ్చాయి. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస 43.85 శాతం ఓట్లు రాగా అది ఇప్పుడు 35.81 శాతానికి పడిపోయింది. అంటే 8శాతం తగ్గింది. ఆ 8శాతం కూడా బీజేపీకి ప్లస్ అయింది. ఒకవేళ తెలంగాణలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ పోటీలో ఉంటే.. ఆ పార్టీకి ఉండే సంప్రదాయ ఓటు బ్యాంకు తోపాటు టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కూడా కలిసేది. అది ఒక్క టీడీపీ పార్టీనా లేక ప్రజారాజ్యమా లేక..మరో ప్రాంతీయ పార్టీనా అనేది వేరే విషయం. ఈ లెక్కన చూస్తే..టీడీపీని నిర్వీర్యం చేయడం టీడీపీకి నష్టమే. కాని రానున్న కాలంలో తెలంగాణలో టీఆర్ఎస్‌కు కూడా నష్టం కలిగించే అవకాశాలున్నాయి.
Also Read: పంటల బీమాపై దిగొచ్చిన ప్రభుత్వం.. టీడీపీ వ్యూహంతో వైసీపీ కలవరం