“ప్రతీ ఏడాది పుట్టిన రోజును ఏంతో జోష్ గా జరుపుకోవడం నాకు అలవాటు. గత ఏడాది నా 60వ జన్మదినోత్సవాన్ని చిరంజీవి, బాలకృష్ణ లాంటి ప్రముఖ హీరోల మధ్య ఎనలేని ఆనందంతో జరుపుకున్నా. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ అతలాకుతలమైంది. పనులు లేక ఎంతో మంది కార్మికులు నేటికీ ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ ఏడాది నా 61వ పుట్టినరోజు జరుపుకోవడం లేదు. కరోనాకు ఈ పుట్టినరోజు అంకితమిస్తున్నా” అని తెలుగు సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ నెల 9న తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో కొద్దిసేపు ముచ్చటించారు.
“కోవిడ్ ముందు, తర్వాత అన్నట్లుగా చిత్ర పరిశ్రమ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. థియేటర్లు కూడా అంచలంచెలుగా తెరుచుకుంటాయి. కొన్ని షూటింగులు మొదలైనా కరోనా కారణంగా నెలల తరబడి పనులు లేక నష్టపోయిన కార్మికులు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. సంఖ్యా పరంగా ఇంకా ఎక్కువ సినిమాలు మొదలు కావాలి. మెగాస్టార్ చిరంజీవి పుణ్యమా అని, సి.సి.సి. ద్వారా వేలాది మంది సినీ కార్మికులకు సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కొంత మేరకు వాళ్లకు అది ఆసరా అయ్యింది” అని అన్నారు
Also Read ;- మెగా డాటర్ నిహారిక వివాహానికి 120 మంది అతిధులు
చిత్రపురి సమస్యలు పరిష్కరించేంతవరకు నిద్రపోను
నాకు ఇంత జీవితాన్ని ఇచ్చింది సినీ పరిశ్రమే. వాస్తవానికి సినిమాలు తీసి పోగొట్టుకునేది ఎక్కువ అయినా సినిమాల మీద ఉన్న ఫ్యాషన్ తో తీస్తూనే ఉంటాను. నిర్మాతగా ఈ పేరు, ఈ ఇమేజ్ వేరే వ్యాపారాలకు పనికి వస్తుంది. ఆలా సంపాదించిన డబ్బు తెచ్చి సినిమాలు తీస్తుంటాం, పోగొట్టుకుంటుంటాం. నా కెరీర్ లో సినీరంగం తరపున ఎన్నో అత్యున్నత పదవులను అలంకరించాను. ప్రస్తుతం తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా నిర్మాతల సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నా. ఇటీవల చిత్రపురి కాలనీ వాసులు, ఎంతోమంది కార్మికులు నా దగ్గరకు వచ్చి, సొసైటీ ఎన్నికలలో పోటీ చేయాల్సిందిగా, తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరారు. నాకున్న అనేక పనుల వత్తిడులలో వారిని వద్దని వారించే ప్రయత్నం చేశాను. పెద్దాయన దాసరి ఉంటే…చూస్తూ వూరుకునేవారా! అని వారంతా ప్రశ్నించారు. ఆ మాట నాపై ఎంతో ప్రభావం చూపి నిజమే కదా ! అని అనుకున్నాను. వెంటనే చిత్రపురి కాలనీ ఎన్నికలలో మా ప్యానల్ తరపున పోటీ కి నిలబడ్డాను నిజానికి నాకు ఇది మరింత బరువు, బాధ్యత. ఈ ఎన్నికలలో గెలిస్తే, అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. తప్పకుండా నిద్రపోకుండా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. చిత్రపురి స్థలం అంత బ్యాంకు తనఖాలో ఉంది. బ్యాంకు వారు డబ్బులు చెల్లించమని ఈ నెలలోనే గడువు ఇచ్చారు.. కొన్ని ఇల్లు కొన్ని రాళ్లు కట్టి ఆగిపోయాయి. ఇలాంటి అనేక సమస్యలను అక్కడ ఓ కొలిక్కి తేవాల్సి ఉంది” అని అన్నారు.
కొత్త సినిమాలు
మా బ్యానర్ లో కొత్తగా మరో నాలుగు చిత్రాలకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే రానా, రెజీనా ప్రధాన పాత్రధారులుగా మేము తీసిన “1945” చిత్రం విడుదలకు సిద్ధమైంది. బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం తీస్తాం. ఆయన మా సి.కే. బ్యానర్ ను తన సొంత సంస్థగా భావిస్తారు. ఇంకా సత్యదేవ్ హీరోగా ఓ చిత్రం చేయబోతున్నాం., ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్స్ పైకి వస్తుంది. అలాగే కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తీయాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతానికి ఈ నాలుగు సినిమాలపై దృష్టి పెట్టా” అని అన్నారు.
హీరోలు కూడా సొంతగా చిత్రాలను నిర్మిస్తున్నారు కదా! దానిపై మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు సి.కల్యాణ్ బదులిస్తూ, హీరోలు సొంతగా తీసిన సినిమాలేవీ ఆడలేదు. నిర్మాతలుగా మారి.. ఆలా డబ్బులు పోగుట్టునుకున్నారు కూడా. గత 50 ఏళ్లుగా 7 శాతం లేదా 8 శాతం మాత్రమే సినిమాల సక్సెస్ ఉంది అది పెరగడం లేదు. ఆ దిశగా సక్సెస్ పెంచుకునే ప్రయత్నం జరగాలి. ఓటీటీ లో కంటే థియేటర్లోనే సినిమా చూసేందుకు ప్రేక్షకుడు ఎక్కువగా ఇష్టపడతాడు. కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూనే జనాలు ముందుకెళ్తున్నారు.. థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్యా నిదానంగానైనా పెరుగుతుంది తప్పకుండా పాత రోజులు వస్తాయి” అని అన్నారు.
Must Read ;- ఓటీటీ నామ సంవత్సరంలో టాప్ 10 ఇవే