(హైదరాబాదు నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో త్వరలో నగర పాలక సంస్థ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్ధానాలు గెలుచుకుని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులు పైఎత్తులకు తెర తీసాయి. ఏ స్ధానాల నుంచి ఎవరిని పోటీ చేయించాలి, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి. ఎవరితో వైరం ఉంటుంది అనే అంశాలపై సమావేశాలు పెట్టుకుంటున్నాయి. జంటనగరాలలో ఇప్పటి వరకూ మైత్రీవనంలా కలగలిసిన అధికార తెలంగాణా రాష్ట్ర సమతి, మజ్లీస్ పార్టీలు కూడా ఈసారి కలిసి పోటీ చేయడమో… లేదూ ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకుంటారని అందరూ భావించారు.
అయితే, తాజా పరిస్థితులు చూస్తే ఆ అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఈ రెండు పార్టీల మధ్య వైరం తారాజువ్వలా ఎగిసి పడుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణా నాయకులు పదే పదే చేస్తున్న విమర్శ మజ్లిస్ తో కుమ్మకయ్యారనే మాటలు నిజం కాదమో అనే అనుమానమూ వస్తోంది. అధికార తెలంగాణా రాష్ట్ర సమతిపైనా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపైన ఈగ కూడా వాలనివ్వని మజ్లిస్
పార్టీ ఇప్పుడు ఏకంగా శాసనసభ సాక్షిగా అధికార పక్షంపై విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని తమ ప్రభుత్వం అడ్డుకట్టవేసిందంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రకటించగానే మజ్లిస్ శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ మండిపడ్డారు.
ఈ హఠాత్తు దాడితో ముఖ్యమంత్రితో పాటు అదికార పక్షం సభ్యులందరూ అవాక్కయ్యారు. కాంగ్రెస్ పార్టీ కరోనా మీద కత్తులు దూస్తుందని, ఆ సమయంలో తమకు మజ్లిస్ అండగా ఉంటుందని భావించిన అధికార పార్టీకి అక్బరుద్దీన్ దాడి ఆశ్చర్యమే కాదు ఆంధోళన కలిగించింది.
ఒవైసీ వైఖరి దేనికి సంకేతం…
సభలో మజ్లిస్ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ వైఖరిపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు కూడా కంగుతిన్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్చొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏకంగా శాసనసభలోనే ఇలా విమర్శలు చేయడం సీఎంకు ఆగ్రహం తెప్పించిందంటున్నారు. ఒక దశలో మజ్లిస్ మనకు మిత్రపక్షమా… లేక ప్రతిపక్షమా అని సభలో ఉన్న మంత్రి కే. తారక రామారావు వద్ద అసహనం వ్యక్తం చేపినట్లు చెబుతున్నారు.
పాతబస్తీలో మజ్లిస్ కు తప్ప మరే పార్టీకి సీట్లు దక్కవని, అలాంటి సమయంలో వారితో చెలిమి చేసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలనేకుంటే వీళ్లు ఇలా తిరగబడితే ఎలా అని శాసనసభ సీఎం ఛాంబర్ లో తనను కలిసిన వారితో కేసీఆర్ అన్నట్లు చెబుతున్నారు.
మజ్లిస్ ది వేరుకుంపటేనా…
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ వేరుకుంపటి పెట్టుకునేలా ఉందని, ఆ వైఖరి కారణంగానే అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో అలా వ్యవహరించారని అంటున్నారు. పాతబస్తీలో అన్ని స్ధానాలు గెలిచేది తామే కాబట్టి జంట నగరాలలో ముస్లీములు ఎక్కువగా ఉన్న చోట కూడా వీలున్నన్ని ఎక్కువ స్ధానాలు గెలుచుకుని మేయర్ పదవిని తామే పొందాలని మజ్లిస్ భావిస్తోందని అంటున్నారు. ఇదే జరిగితే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు మంచి రంజుగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.