అసలే హుజూరాబాద్ బైపోల్స్. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో గులాబీ దళం. అంతకంతకూ పట్టు సాధిస్తోన్న కమల దళం. డమ్మీ అభ్యర్థిని బరిలో నిలిపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హస్తం పార్టీ కూడా క్రమంగా బలోపేతమవుతోంది. ఇలాంటి కీలక తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ అడ్డంగా బుక్ చేసి పారేశారన్న విశ్లేషణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో ఘోర పరాజయం పాలై.. 2018 ఎన్నికల్లో ఓటమి తప్పదేమోనన్న భావనలోకి వెళ్లిపోయిన గులాబీ దళంలో హుజూరాబాద్ ఫలితంతో అయినా మళ్లీ పునరుత్తేజం నింపేలా చూడాలన్న దిశగా కేసీఆర్ సాగుతున్నారు. ఇందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ తనదైన శైలి సత్తా చాటాల్సి ఉంది. ఆ బాధ్యతలను ఎలాగూ మంత్రి హరీశ్ రావుకు అప్పగించేసిన కేటీఆర్.. తాను మాత్రం ఇప్పుడు పార్టీని జనంలో పలుచన చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటు రేవంత్, అటు ఈటల
హుజూరాబాద్ ఎన్నికల అంశాన్ని శనివారం ప్రస్తావించిన కేటీఆర్.. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలను చేసుకుని ముందుకు సాగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వాదనకు బలం చేకూర్చేలా రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రహస్యంగా భేటీ అయ్యారని, గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగిన ఈ భేటీకి సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలున్నాయని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు విన్నంతనే.. ఇటు రేవంత్ తో పాటు అటు ఈటల కూడా కేటీఆర్‌పైకి ఒకేసారి విరుచుకుపడ్డారు. మంత్రిగా తనను బర్తరఫ్ చేశాక, టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక తన భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసుకునే క్రమంలో తాను చాలా మంది రాజకీయ నేతలను కలిశానని, అందులో భాగంగా రేవంత్ రెడ్డితో కూడా తాను భేటీ అయ్యానని ఈటల ఎదురు దాడి చేశారు. రేవంత్‌తో తన భేటీ రహస్యమేమీ కాదని కూడా ఈటల చెప్పేశారు. ఈటల వ్యాఖ్యలు వచ్చినంతనే రేవంత్ కూడా కేటీఆర్‌పైకి దూకేశారు. గోల్కొండ రిసార్ట్స్‌లో తమ పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడి లగ్నం ఖరారు సందర్భంగా గోల్కొండ రిసార్ట్స్‌కు వెళ్లానని, దానికి ఈటల కూడా వచ్చారని, ఈటలతో తన భేటీ ఏమీ రహస్యమేమీ కాదని రేవంత్ రెడ్డి మరింతగా విరుచుకుపడ్డారు. అయినా బీజేపీతో, ప్రధాని మోదీతో బహిరంగంగానే మంతనాలు సాగిస్తున్న కేసీఆర్.. బీజేపీతో కలిసి సాగుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈటలతో భేటీ కోసం ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డి వచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది కేసీఆరేనని కూడా రేవంత్ రెడ్డి మరింత మేర సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎరక్కపోయి ఇరికించారా?
అటు ఈటల రాజేందర్ నుంచే కాకుండా ఇటు రేవంత్ రెడ్డి కూడా ఈ తరహా దాడిని కేటీఆర్ ఊహించి ఉండరన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈటల, రేవంత్ ల రహస్య భేటీ అనగానే.. ఇటు బీజేపీతో పాటు అటు కాంగ్రెస్ పార్టీలు కూడా డిఫెన్స్‌లో పడిపోతాయని, ఫలితంగా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు మరింత మేలు జరుగుతుందన్న కోణంలోనే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కేటీఆర్ వ్యూహాన్ని పసిగట్టిన ఈటల, రేవంత్‌లు ఊహించని రీతిలో ఎదురు దాడికి దిగడంతో.. ఆ రెండు పార్టీలను ఇరుకున పెట్టాలని భావించిన కేటీఆర్.. తన వ్యాఖ్యలతో తానే బుక్కైపోవడంతో పాటుగా పోలింగ్‌కు సమయం ఆసన్నమవుతున్న వేళ తన సొంత పార్టీనే డిఫెన్స్‌లో పడేశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.