మావోయిస్టులకు ఇటీవల కాలంలో వరుస దెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టుల వారోత్సవాలు సమయంలో సుమారు రెండు వారాల పాటు హడావుడి చేసిన మావోయిస్టులకు పలు గ్రామాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
తాము అభివృద్ధిని కోరుకుంటున్నామని, అమాయక గిరిజనుల ప్రాణాలు బలి తీసుకుంటే సహించేది లేదని పలు గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు ఇటీవల కాలంలో జరిగాయి.
అదేవిధంగా జిల్లాలోని గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు జీ. కామేష్ ను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం తూర్పు గోదావరి, ఒడిశాలో సుమారు 100 పైగా కేసులు ఇతని పై ఉన్నాయి. అతని వద్ద నుంచి తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

మా బతుకులు మారాలి..
సిరిలిమెట్ట, కేందుగుడా, పిట్టగడ్డ, కీముడుపుట్టు ప్రజలు ‘మా బతుకులు మారాలి’ అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఇది కాస్త పోలీసులకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతోంది. గిరిజనుల్లో చైతన్యం వస్తోందంటూ పోలీసు ఉన్నతాధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘మారుమూల గిరిజన ప్రాంతాలు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండిపోవాలి, మా బిడ్డలకు పురిటి నొప్పులు వస్తే మాకు చావే గతి అవుతుంది, ఇంకా ఎన్నాళ్ళు మాకు ఈ కష్టాలు, మాకు వెంటనే రోడ్లు నిర్మించాలి, మాకు అభివృద్ధి కావాలి’ అంటూ ర్యాలీ చేశారు.
ప్రభుత్వపరంగా..
అదేవిధంగా ప్రభుత్వం ఉపాధి హామీ పని దినాలు పెంచాలి అని, సెల్ టవర్స్, రోడ్స్ వస్తేనే కష్టాలు తీరుతాయని ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం ముందు జరిగిన ఈ పరిణామం వారికి మింగుడు పడడం లేదు. పది సంవత్సరాలు క్రితం ఇదే గ్రామస్థులు మావోయిస్టులు పై భారీగా కత్తులు, బల్లెలతో తిరుగుబాటు చేసి ‘మీరు మా గ్రామాల్లోకి రావొద్దు’ అంటూ హెచ్చరించారు.











