కొందరు కోటీశ్వరుల పిల్లలు అన్ని సదుపాయాలూ ఉన్నప్పటికీ.. చదవడానికి బాధపడిపోతుంటారు. బాగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగం సాధించాలనుకొనే పిల్లల తల్లిదండ్రులకు చదివించే స్తోమత ఉండదు. అదే ఐఎయస్ లాంటి అత్యుత్తమ శిక్షణకు హాజరవ్వాలనుకుంటే? వారి కల కలానే మిగిలిపోవాలా? అలాంటివారికి తాను అండగా ఉన్నానంటున్నాడు అపర కర్ణుడు సోనూ సూద్. వారికి ఐఏయస్ స్కాలర్ షిప్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. తన తల్లి జ్ఞాపకార్ధం ఈ బృహత్కార్యాన్ని తలపెట్టనున్నట్టు ప్రకటించాడు.
ఐఏయస్ కు ప్రిపేర్ అయ్యేవారి కోసమే కాకుండా.. గ్రూప్ పరీక్షలకు , సిఏ కోర్స్ చేయాలనుకొనే వారికి కూడా ఆర్ధిక సహాయం చేస్తానని మాటిచ్చాడు సోనూసూద్. కాకపోతే వారి వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలకు దాటకూడదు. అంతేకాదు.. చదువులో విశేషమైన ప్రతిభ సాధించేవారికే తాను స్కాలర్ షిప్స్ ఇస్తానని చెప్పాడు సోనూ భాయ్. ఎంతమందికైనా ఇచ్చేందుకు తాను సిద్ధమే అంటున్నాడు. తన వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకొన్న ప్రతీ ఒక్క అర్హుడికీ తాను ఆర్దిక సాయం చేస్తానంటున్నాడు.
లాక్ డౌన్ లో వలసకూలీలను తమ స్వస్థలాలకు పంపించి.. వారికి ఆర్ధిక సహాయం కూడా చేసిన సోనూ సూద్.. అది కేవలం పబ్లిసిటీ కోసం కాదని .. ఇది స్వచ్ఛమైన తన మనసు చేస్తోన్న స్వచ్ఛంద సేవ అని మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా చాటిచెప్పాడు. కొన్ని వేలమందికి రియల్ హీరో అయ్యాడు. ఇప్పుడు ఈ ఐఏయస్ సేవా సత్కార్యం కానీ సక్సెస్ అయితే.. సోనూ మన దేశ అత్యున్నత వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం.