వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి సెలవు దినమైన ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాయిరెడ్డి నోట నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు విన్నవారంతా… అవునా?, నిజమా?, నిద్రలో ఏమైనా కల గన్నారా?, లేదంటే పగటి పూటే కూనికిపాట్లు పడుతూ పగటి కల కంటున్నారా? అన్న సెటైర్లు పడిపోతున్నాయి. అయినా పార్టీలో సాయిరెడ్డికి ఎప్పుడు ఏ పదవి ఉంటుందో, ఎప్పుడు ఏ పదవి ఊడుతుందో కూడా తెలియని పరిస్థితిని గుర్తు చేసుకుంటున్న జనం… సాయిరెడ్డి మతి భ్రమించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఒకింత గట్టిగానే తగులుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం దక్కిన సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి ఆ పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకా పూర్తిగా తేరుకోనేలేదు. ఎలాగోలా కాస్తంత మేల్కొని పార్టీలో నూతన నియామకాలను ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నియమితులయ్యారు.
ఆదివారం తిరుపతిలో భూమన పదీ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సాయిరెడ్దితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులంతా కట్ట కట్టుకుని వాలిపోయారు. సజ్జల, వైవీ, సాయిరెడ్డిల రాకతో చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అసలు సభా వేదికపై ప్రాధాన్యమే దక్కలేదు. ఈ సందర్భంగా మైకు అందుకున్న సాయిరెడ్డి ఓ రేంజిలో ప్రసంగించారు. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేలా సాగిన ఆయన ప్రసంగం సుదీర్ఘంగానే సాగింది. నున్నటి గుండులో సభా వేదికపై ప్రత్యక్షమైన సాయిరెడ్డి… మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఎందుకు ఓడిపోయిందన్న విషయాన్ని ప్రస్తావించారు. తమ పాలనలో కొన్ని వర్గాలకు న్యాయం చేయలేకపోయామన్న సాయిరెడ్డి.. ఆ వర్గాలు తమ వైరి వర్గాలకు ఓట్లు వేయడంతో తమకు ఓటమి తప్పలేదన్నారు. అయితే ఈ దఫా అన్ని వర్గాలను కలుపుకుని పోతామని, కూటమి సర్కారు పాలనకు చరమగీతం పాడతామని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ సాయిరెడ్డి నోటి వెంట… జమిలి ఎన్నికల మాట వినిపించింది. 2027 చివరలో జమిలి ఎన్నికలు జరగనున్నాయని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తిరిగి విజయం సాధిస్తుందని, జగన్ తిరిగి సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు అబద్ధపు హామీలిచ్చిన కూటమి సర్కారుపై కేవలం 4 నెలల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు. ఈ వ్యతిరేకత మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదన్నారు. కూటమి సాగిస్తున్న పాలనపై పోరాటం చేస్తామని, జమిలి ఎన్నికల్లో కూటమిపార్టీలకు తగిన రితిలో బుద్ధి చెబుతామని ఆయన అన్నారు. జమిలి ఎన్నికలపై ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు జమిలి ఎన్నికలపై ప్రధాన మంత్రినరేంద్ర మోదీ కూడా ఇప్పటిదాకా ఓ నిర్ణయం తీసుకోలేదు. అయితే అదేదో… ప్రధాని తన చెవిలో జమిలి రహస్యాన్ని ఊదినట్లుగా ఫోజు కొడుతున్న సాయిరెడ్డి 2027లోనే జమిలి ఎన్నికలంటూ వ్యాఖ్యానించడంపై ఇప్పుడు సోసల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి