ప్రముఖ పారిశ్రామికవేత్త కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి కాకినాడ సీ పోర్టుతో పాటు కాకినాడ సెజ్ లను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన అనుచర గణం ఏ రీతిన తమ అధీనంలోకి తీసుకున్నారన్న విషయం ఇదివరకే వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో గతంలో ఎన్నడూ చూడని వింతలు కూడా కనిపిస్తున్నాయి. తమ కన్ను పడిన సంస్థలను కొట్టేసేందుకు జగన్ అండ్ కో… పక్కా ప్లాన్ వేసి దానిని పకడ్బందీగా అమలు చేసింది. కాకినాడ సీ పోర్టును చేజిక్కించుకునేందుకు ఈ ముఠా ఓ మెగా మాయను రక్తి కట్టించింది. ముందుగా ఓ ఆడిటింగ్ సంస్థను రంగంలోెకి దించి…బకాయిలను వేల కోట్లలో చూపి… ఆ నివేదికనే బూచిగా చూపి… పోర్టులో వాటాలను రాయించుకుంది. ఆ తర్వాత తాము చూపిన నివేదికను పక్కన పడేసి… కేవీ రావు మాట నిజమేనని…బకాయి నామమాత్రమేనని ఒప్పేసుకుంది.
కాకినాడ సీ పోర్టులో 41 శాతం వాటాలను అరబిందో కంపెనీ ద్వారా జగన్ ఖాతాలో వేసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిలు పక్కా ప్లాన్ ను రచించారు. రాష్ట్రంలోని అన్ని పోర్టులకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలను మదింపు చేసే పనిని చెన్నైకి చెందిన శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్ పీకి అప్పగించినట్లుగా 2019లో జగన్ సర్కారు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంస్థ సాయిరెడ్డికి బాగా తెలిసిన వ్యక్తులకు చెందిన కంపెనీనే. జగన్ సర్కారు ఆదేశంతో రంగంలోకి దిగిన శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్ పీ… తొలుత కాకినాడ సీ పోర్టు వ్యవహారాలను మదింపు చేసింది. ఈ క్రమంలో సదరు కంపెనీ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.965 కోట్ల మేర బకాయిలు పడిందని ఓ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత సదరు సంస్థ ఇంకే పోర్టు జోలికి కూడా వెళ్లకుండానే… చెన్నైకి తిరిగి వెళ్లిపోయింది.
శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్ పీ ఇచ్చిన నివేదికను కేవీ రావు ముందు పెట్టిన విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు… ఇంతమేర బకాయిలు ఎగ్గోట్టడం ఏమిటంటూ గయ్యిమన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ బకాయిలు కట్టినా… కేసులు కూడా తప్పవని బుకాయించారు. అయితే తామేమీ ప్రభుత్వానికి అంత బాకీ లేమని కేవీ రావు వాదించారు. అంతేకాకుండా తమ కంపెనీ కేవలం రూ.9 కోట్లు మాత్రమే బకాయి ఉందని కూడా ఆయన తన ఆడిటర్ల నివేదికను చూపారు. కేవీ రావు నివేదిక వైపు కన్నెత్తి కూడా చూడని విక్రాంత్ రెడ్డి తాము చెప్పినట్టు వినకుంటే… మీతో పాటు మీ కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదు అవుతాయని, ఆపై అరెస్ట్ లు కూడా తప్పవని బెదిరించారు. ఫలితంగా కేవీ రావుకు పరిస్థితి అంతా అర్థం అయిపోయి… అధికారంలో ఉన్న వారిని ఎదుర్కోలేనని గ్రహించి వారు ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేశారు. వారు ఇచ్చిందే తీసుకుని వెళ్లిపోయారు.
ఇక తాము అనుకున్నట్లుగా కాకినాడ సీ పోర్టు తమ చేతికి వచ్చింది కదా. అయితే ఇదివరకు తాము రూపొందించిన నివేదిక ప్రకారం… సర్కారుకు రూ.965 కట్టాలి కదా. ఇంత మేర పన్ను కట్టేందుకా తాము కాకినాడ పోర్టును చేజిక్కించుకుంది? ఇదే ప్రశ్న వేసుకున్న జగన్ అండ్ కో… తమ నివేదిక తప్పు అని కేవీ రావు ఇచ్చిన నివేదికను తెర మీదకు తెచ్చింది. ప్రభుత్వానికి కాకినాడ పోర్టు కట్టాల్సిన బకాయి రూ.9 కోట్లేనని, ఆ మేరకు మాత్రమే బకాయి చెల్లిస్తే సరిపోతుందని అరబిందో రియాల్టీకి చెప్పింది. అంటే… కాకినాడ పోర్టును కొట్టేసేందుకు ఆ కంపెనీ ప్రభుత్వానికి రూ.965 కోట్లు బకాయి ఉందని బుకాయించిన జగన్ అండ్ కో… కంపెనీ తమ చేతికి రాగానే… ఆ బకాయి కాస్తా… రూ.9 కోట్లకు తగ్గించేశారన్న మాట. అది కూడా ఈ వ్యవహారంలో బాధితుడైన కేవీ రావు చెప్పిన మాటే కరెక్ట్ అని జగన్ అండ్ కో ఒప్పుకుందన్న మాట. మరి ఈ మేర మాయ చేయకపోతే… ఊరకనే వేల కోట్ల విలువ చేసే కంపెనీలు దక్కవు కదా.