వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సా*క్షి దినపత్రికకు శుక్రవారం కొత్త ఎడిటర్ వచ్చేశారు. ఈనాడు పత్రికతో పాత్రికేయ జీవితం ప్రారంభించిన రక్కసి ధనుంజయ రెడ్డి తాజాగా సా*క్షికి నూతన సంపాదకుడిగా బాధ్యతలు స్వీకరించారు. సా*క్షి దిన పత్రిక స్థాపన తర్వాత ఈనాడు నుంచి సా*క్షిలోకి వచ్చేసిన ధనుంజయ్ రెడ్డి వివిధ విభాగాల్లో పనిచేశారు. కొంతకాలం పాటు సా*క్షికి దూరంగా ఉన్న ఈయన… వైసీపీ జమానాలో నాటి సీఎం జగన్ కు సలహాదారుడిగానూ పని చేశారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఓ రాజకీయ పార్టీలో కీలక పదవిలో ఉంటూనే… ధనుంజయ్ రెడ్డి సా*క్షి పత్రికకు ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించారు. అంతేనా… 45 ఏళ్లు నిండకుండానే ధనుంజయ్ ఎడిటర్ హోదాను దక్కించుకున్నారు.
జగన్ సతీమణి వైఎస్ భారతి రెడ్డి సమీప బంధువు అయిన ధనుంజయ్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వారే. ఈనాడు నుంచి సా*క్షిలోకి వచ్చీ రాగానే… ఆయనకు సా*క్షి దినపత్రికలో కీలక విభాగం అయిన సా*క్షి ఎడ్యుకేషన్ విభాగం అధిపతిగా పోస్టు దక్కింది. సుదీర్ఘ కాలం పాటు సదరు పోస్టులో కొనసాగిన ధునంజయ్… ఆ పోస్టులో కొనసాగుతూనే… సా*క్షి జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్ గానూ కొంతకాలం పాటు కొనసాగారు. ఇక పత్రిక రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా విభాగాలను ఏర్పాటు చేయగా… ఏపీ విభాగానికి సంబంధించిన రెసిడెంట్ ఎడిటర్ గా ధనుంజయ్ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన స్వైర విహారం చేశారని ఆరోపణలున్నాయి. ఫలితంగా ఆయనను సా*క్షి నుంచి తప్పించగా… భారతితో ఉన్న బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఏకంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవిని చేపట్టారు.
మొన్నటిదాకా సాక్షి పత్రికకు సంపాదకుడిగా కొనసాగిన వర్ధెల్లి మురళి రిటైర్ మెంట్ తీసుకోగా… ఆ పదవి ఖాళీ అయ్యింది. ప్రస్తుతం సాక్షి పత్రిక మాతృ సంస్థ జగతి పబ్లికేషన్స్ కు చైర్ పర్సన్ గా భారతి రెడ్డే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వేరే ఎవరో ఎందుకు తన బంధువు అయిన ధనుంజయ్ రెడ్డినే ఎడిటర్ గా నియమిస్తే పోలా అన్న దిశగా ఆలోచించిన భారతి… ఎలాగూ ప్రభుత్వ సలహాదారు పదవి కోల్పోయిన ధనుంజయ్ కి తన పత్రికలో కీలక బాధ్యతలను అప్పగించారు. అయితే వ్యవహార సరళిలో వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్న ధనుంజయ్ కారణంగా సా*క్షి మరింతగా భ్రష్టు పట్టడం ఖాయమన్న వాదన ఆ పత్రిక జర్నలిస్టులే చెవులు కొరుక్కుంటున్నారు.