ప్రయివేటు వర్శిటీ పేరుతో విశాఖలో విజయసాయి రెడ్డి కూతురు, అల్లుడు భారీ భూదందా..??
విశాఖ నగరంలో వైసీపీ భూ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి… అధికార పార్టీ నాయకులే నగరంలో వేల ఎకరాలు అక్రమంగా కబ్జా చేశారనే ఆరోపణలు ఉండగా, మరోవైపు విలువైన భూములను ప్రభుత్వమే కారుచౌకగా పార్టీ పెద్దలకు కట్టబెడుతున్న తీరు చూసి విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ శివారులోని తుర్లవాడ కొండపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురికి చెందిన ప్రైవేటు యూనివర్శిటీకీ 120 ఎకరాలు కట్టబెట్టడానికి అధికార యంత్రాంగం వేగంగా పావులు కదుపుతోంది. ఇక్కడ భూమి మార్కెట్ విలువ ఎకరానికి రెండు కోట్లపైనే ఉంటుంది. మూడు వందల కోట్ల విలువైన భూమిని ఎంపీ కుమార్తెకు చెందిన సంస్థకు కేవలం 20 కోట్లకే అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎప్పుడో నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను పేదలకు కేటాయించకుండా జగన్ సర్కారు వాయిదాలు వేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలకు వందల కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టేందుకు మాత్రం సిఎం ఆఫిసులో శరవేగంగా ఫైళ్లు కదులుతున్నాయి. తుర్లవాడ కొండపై ౩౦౦ వందల కోట్ల విలువైన భూమిని 20 కోట్లకే.. ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు కట్టబెట్టే ప్రయత్నం.. ప్రభుత్వ పెద్దల బరితెగింపునకు నిదర్శనమని విమర్శించారు… మాజీ మంత్రి, టిడిపి నేత అయ్యన్నపాత్రుడు.
తుర్లవాడ కొండను స్థానికులు పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. విష్ణుమూర్తి నరసింహ స్వామి అవతారంలో ఈ ప్రదేశంలో అడుగు పెట్టారని.. ఇప్పటికీ తుర్లవాడ కొండపై స్వామివారి పాదముద్రలు చెక్కు చెదరకుండా ఉన్నాయని స్థానికుల కథనం. ఇంతటి పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న ప్రదేశంలో వెంకటేశ్వరస్వామి వారి దేవాలయం నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇక్కడ స్వామివారి దేవాలయం నిర్మించాలని విజ్క్షప్తి చేస్తున్నారు స్థానికులు. ప్రభుత్వ పెద్దలు మాత్రం ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా, ప్రైవేట్ యూనివర్శిటీ పేరుతో, పవిత్రమైన భూమిని అడ్డగోలుగా అయినవారికి కట్టబెట్టడానికే మెగ్గు చూపిస్తున్నారు.
విశాఖ నగరంలో దశాబ్దాల చరిత్ర కలిగిన గీతం యూనివర్శిటీ స్థలాన్ని లాక్కోవడానికి వైసీపీ సర్కారు చేసిన హంగామా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న గీతం యూనివర్శిటీ స్థలాన్ని బలవంతంగా లాక్కుంటున్న జగన్ ప్రభుత్వం.. కేవలం విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులకు చెందినదనే ఒకే ఒక్క కారణంతో… ఊరూ పేరూ లేని విద్యా సంస్ధకు వందల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు టిడిపి నేత అయ్యన్న పాత్రుడు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్, విజయసాయిరెడ్డి చేస్తుతన్న అక్రమాలు, భూకబ్జాలను బట్టబయలు చేస్తామన్నారు.
సీఎం జగన్ ఆర్ధిక ఉగ్రవాది అని… అతని పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు టిడిపి నాయకులు. రాష్ట్రలో మేధావులు, విద్యావేత్తలు వైసీపీ ప్రభుత్వం అక్రమాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.