రామతీర్థంలో రాములవారి విగ్రహాన్నికి తలను వేరు చేశారు. దాన్ని తీసుకెళ్లి కోనేట్లో పారేశారు. ఒక మతాన్ని ఆరాధించే వారి పట్ల.. ఇది కొందరు దుర్మార్గులు చేసిన మహాపరాధం.
.. ఇంతవరకు నిర్వివాదాంశం. అయితే దాని చుట్టూ పులుముకుంటున్న రాజకీయ దుమారం అసహ్యాకరంగా తయారవుతోంది.
విగ్రహాన్ని ఎవరు పగులగొట్టారనే సంగతి తేలలేదు. అయితే అధికారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది గనుక.. ఇప్పటివరకు దోషుల్ని పట్టుకోలేకపోవడంపై సహజంగానే వారిపై విమర్శలు వస్తాయి. చాలా చాలా పెద్ద పెద్ద నేరాలు జరిగినప్పుడు- చిటికెలో నేరస్తుల్ని పట్టుకుని.. తరచుగా ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉండే పోలీసు యంత్రాంగం.. ఒక మతాన్ని విశ్వసించే, ఒక దేవుడిని ఆరాధించే ప్రజల సెంటిమెంటు గాయపడినప్పుడు.. అంతే వేగంగా చర్య తీసుకోకపోవడం.. చురుగ్గా కదలకపోవడం ప్రజలకు బాధ కలిగిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసే అవకాశమే లేకుండా.. అంత వేగంగా ప్రభుత్వం స్పందించి ఉంటే బాగుండేది. కానీ చూడబోతే.. ఈ వివాదం ఎంత పెద్దదిగా మారబోతున్నదో.. ఆ సమయానికి పాలకులు గుర్తించినట్టు లేదు. దానికి తోడు.. రాముడి తల వేరు చేసిన ఘటన తర్వాత.. రాష్ట్రంలో (చిన్న చిన్న ఆలయాలే అయినప్పటికీ) వేర్వేరు చోట్ల జరిగిన ఇలాంటి దుర్ఘటనలు మరింత అగ్గి రాజేశాయి.
ప్రతిపక్షాలు ఈ విషయంలో గట్టిగానే పోరాడాలని నిర్ణయించుకున్నాయి. అధికార పార్టీ తరఫున విజయసాయిరెడ్డి వారికి కౌంటర్ గా నిలవాలని అనుకున్నారు. చంద్రబాబునాయుడు రామతీర్థం వెళ్లడానికి కొన్ని గంటల ముందే ఆయన అక్కడకు వెళ్లారు. గుడిని సందర్శించారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. అచ్చంగా నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కలిసి వారి అనుచరులతో ఈ విగ్రహాన్ని తల నరికించినట్లుగా ఆయన మాట్లాడారు. వీరిలో తొలి ఇద్దరి సంగతి పక్కన పెడితే.. అశోక్ గజపతి రాజు ఆ ఆలయానికి ధర్మకర్త. అనువంశికంగా ఆ బాధ్యతల్లో ఉన్న వ్యక్తి. తమ పూర్వీకులు నిర్మించిన అలాంటి అనేక వందల ఆలయాలకు అలాంటి బాధ్యతలను నెరపిన వ్యక్తి. ఆయన స్వయంగా తన మనుషులతో ఈ పనిచేయించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆ ఆలయ భద్రతలో విఫలమైనందున ఆయనను ఆలయ ఛైర్మన్ పదవినుంచి కూడా తొలగించేశారు. ఆ కారణాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా ప్రకటించారు.
అయితే ఈ సందర్భంగా నారా చంద్రబాబునాయుడుకు ముడిపెట్టడం అనేది ఎలా సాధ్యమైంది? ఇది చిత్రమైన సంగతి. విజయసాయి చెప్పిన వివరణ ఏంటంటే.. దుర్ఘటన జరిగిన తర్వాత.. అందరికంటె ముందు.. నారా చంద్రబాబునాయుడు తన సోషల్ మీడియా వేదికలపై పెట్టారట. కాబట్టి.. ఆయనే ఈ నేరం చేయించాడనేది విజయసాయి ఆరోపణ.
సుమారు మూడు దశాబ్దాల కిందట అంతిమతీర్పు అనే సినిమా వచ్చింది. కొందరు జైలనుంచి వచ్చిన నేరస్తులను వాడుకుంటూ.. ఒక పత్రికాధిపతి.. సమాజానికి చీడపురుగులుగా మారిన పెద్దలను వరుస హత్యలు చేయిస్తుంటాడు. ఆయనే ప్లాన్ చేస్తుంటాడు గనుక.. అర్ధరాత్రి వేళలో జరిగే ఆ హత్యల వివరాలు.. ఆయన నడిపే పత్రికలో మాత్రమే చాలా విపులంగా ప్రచురితం అవుతుంటాయి.
విజయసాయి చెబుతున్న మాటలు ఆ సినిమాను గుర్తుకు తెస్తున్నాయి. చంద్రబాబునాయుడు తన సోషల్ మీడియాలో బయటపెట్టారు గనుక.. ఆయనే ఆ నేరం చేయించారని విజయసాయి తీర్మానం చూస్తే.. ఇంత తలాతోకా లేకుండా మాట్లాడడం కూడా సాధ్యమేనా అనిపిస్తుంది.
లోకేశ్‌కు ముడిపెట్టినందుకు.. తనకు సంబంధం లేదని అప్పన్న సన్నిధిలో ప్రమాణాలకు రావాలని.. లోకేష్ – జగన్ కు సవాలు విసరడం.. దానికి స్పందనగా.. అదే అప్పన్న సన్నిధిలో తాను చర్చకు వస్తానని విజయసాయి కంగారులో సవాలును తగ్గించి చెప్పడమూ ఇదంతా వేరే గొడవ.
కానీ.. చంద్రబాబుకు, అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజుకు ముడిపెట్టడమే చిత్రమైన సంగతి. రాజకీయ ప్రయోజనాలకోసం.. ప్రత్యర్థులకు ముడిపెట్టదలచుకుంటే.. అందుకు మరింత బలమైన అబద్ధాల అల్లికతో సిద్ధం కావాలి. అంతే తప్ప.. సోషల్ మీడియాలో పెట్టారు గనుక.. చంద్రబాబు చేయించాడని, గుడికి ధర్మకర్త గనుక అశోక్ చేయించారని అనడం స్థాయికి తగని విధంగా ఉంది.
చంద్రబాబు ఆ క్షేత్రానికి రావడాన్ని కూడా విజయసాయి తప్పు పడుతున్నారు. తాను వెళ్లింది మాత్రం.. ఆలయ పునరుద్ధరణకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేయడానికే అని ఆయన చెబుతున్నారు. ఏ ఆలయానికి ఏ నష్టం జరిగినా, ఏ దాడి జరిగినా.. దాన్ని డబ్బు వెదజల్లి సర్దేయవచ్చుననే అహంకారపూరితమైన ధోరణికి ఇదొక నిదర్శనం. నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయకుండా, పాలకులు ఎన్ని బూటకపు ప్రకటనలు చేసినా, విపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా ప్రయోజనం ఉండదు.
Also Read: వెలగపూడి సవాల్‌ను విజయసాయిరెడ్డి స్వీకరిస్తారా..?