(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఆసుపత్రిలో చేరేందుకు బెడ్ల వేట మొదలు… దురదృష్టవశాత్తు కన్నుమూస్తే అంత్యక్రియల వరకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రి వద్ద అంబులెన్సుల్లో ఎదురు చూస్తున్నారు.ఆక్సిజన్ సదుపాయం,వెంటిలేటర్ సదుపాయం ఉన్న ఆసుపత్రిలో రోగులు ఫుల్‌గా ఉండడంతో సకాలంలో వైద్యం అందక చనిపోయే వారి సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది.విశాఖ నగరంలో విశాఖ విమ్స్ ఆస్పత్రి,కేజీహెచ్,ఈఎన్‌టి,మానసిక చికిత్సాలయం,చెస్ట్ హాస్పిటల్ ఇలా ఎక్కడ చూసినా ఆక్సిజన్ అవసరమైన రోగులకు సరైన చికిత్స అందించే పరిస్థితి కనిపించడం లేదు.
ఆసుపత్రిలో చేరేందుకు కూడా..
ఆసుపత్రిలో చేరాలంటే అందుకు తగిన రవాణా వసతి అవసరం.108 ఆంబులెన్స్ కోసం ప్రయత్నిస్తే,అది ఎన్ని గంటల్లో వస్తుందో చెప్పలేం.దీంతో ప్రజలు ప్రైవేట్ అంబులెన్సులను ఆశ్రయిస్తున్నారు.ఇక్కడా రోగుల దోపిడి జరుగుతోంది.5 కిలోమీటర్ల దూరానికి రూ.10 వేలు డిమాండ్ చేసిన ఉదంతాలు విశాఖలో ఉన్నాయి.వీరి దోపిడీ శృతిమించడంతో రవాణా శాఖ అధికారులు అంబులెన్సుల డ్రైవర్లతో సమావేశం నిర్వహించి అధిక చార్జీలు వసూలు చేస్తే వాహనం నెలరోజుల పాటు సీజ్ చేస్తామని హెచ్చరించారు.కానీ అప్పటికే కొన్ని వందల మంది నుంచి వీరు అధిక మొత్తంలో వసూలు చేశారు.ఈ దోపిడీ ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ..ఇప్పటికీ అధిక చార్జీల వసూలు కొనసాగుతోంది.
ప్రైవేట్ ఆస్పత్రుల లూటీ ..
ఇక్కడ చికిత్స పొందే వారికి ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.చేరిన తరువాత చికిత్స కోసం ఎన్ని లక్షలు చెల్లించాలో అంచనా కూడా వేయలేం.ప్రభుత్వం ఈ పరీక్షకు ఇంత మాత్రమే వసూలు చేయాలని ధరలు నిర్ణయించినా ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు.అప్పుడప్పుడు అధికారులు చేస్తున్న దాడులతో అప్రమత్తం అవుతున్నఆసుపత్రి యాజమాన్యాలు రెండు రకాల రికార్డులు కూడా నిర్వహిస్తున్నారు. రోగులకు ఇచ్చే బిల్లు ఒక రికార్డు.. తనిఖీలకు వస్తే చూపించేందుకు మరో రికార్డు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
చనిపోయినా ఇక్కట్లు తప్పవు..
కోవిద్ బారిన పడి ఎవరైనా చనిపోతే కలిగే దుఃఖం కన్నా దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఎదురవుతున్న ఇబ్బందులు కంట నీరు రప్పిస్తున్నాయి.చనిపోయిన వ్యక్తి భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీ నుంచి బంధువులకు అప్పగించేందుకు సిబ్బంది డబ్బుల డిమాండ్‌తో ఇబ్బంది మొదలవుతుంది.ఒక్కో బాడీకి కనీసం ఐదు వేలు ఇస్తే గాని, మృతదేహాన్ని సక్రమంగా ప్యాక్ చేసే పరిస్థితి ఉండటం లేదు.బేరసారాలు ఆడితే అరకొరగా క్లోరినేషన్ చేసి అప్పగిస్తున్నారు.ఎంతో కొంత సమర్పించుకున్నతర్వాత మళ్లీ రవాణా కోసం ఇక్కట్లు తప్పడం లేదు.కోవిద్ మృతదేహం అనగానే కనీసం ఇరవై వేలు ఇస్తే గాని తరలించేందుకు మోటార్ వాహన కార్మికులు ముందుకు రావడం లేదు. వాహనాన్ని శానిటైజ్ చేయాలని,సేఫ్టీ కిట్లు వేసుకోవాలని..రక రకాల బిల్లులు చెబుతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, వైరస్… మృత దేహాల నుంచి సోకుతుందని భయం ఉన్నవాళ్లు ఆత్మీయుల మృత దేహాలను సైతం తీసుకెళ్లడం లేదు.
అంతిమ సంస్కారాలకు అవే తిప్పలు
కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించడం కూడా సవాలుగా మారుతోంది. విశాఖ నగరంలో ఈ మృత దేహాల అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు జ్ఞానాపురంలోని స్మశాన వాటికను ఆశ్రయిస్తుంటారు.ఆత్మీయుల మృతదేహంతో స్మశాన వాటికకు చేరుకుంటున్న బంధువులకు తమ వంతు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి.రెండు వారాల వెనక్కు వెళితే..12 గంటల నుంచి 24 గంటల సమయం పట్టేది.ఇప్పుడూ నాలుగైదు గంటలు పడుతోంది.దహన సంస్కారాలు నిర్వహించే సిబ్బంది కరోనా వైరస్ బారిన పడటం,స్మశాన వాటికలో సిబ్బంది కొరత వెంటాడడం కారణంగా టోకెన్లు జారీ చేసే విధానం కూడా ఇక్కడ అమలైంది.శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆరాటపడే కుటుంబ సభ్యులకు నిరాశ తప్పడంలేదు.రాత్రి దహన సంస్కారం నిర్వహించే వ్యక్తికి మధ్యాహ్నం లోపు పంతులు ద్వారా కర్మకాండలు పూర్తి చేయాల్సిన దౌర్భాగ్యం పరిస్థితులు ఎదురయ్యాయి.
ఇక్కడా దోపిడీనే..
జీవీఎంసీ అధికారికంగా దహన సంస్కారాలకు మూడు వేల రూపాయల ఫీజును ఖరారు చేసింది. కానీ కొన్ని వారాల పాటు ఇది ఆచరణకు నోచుకోలేదు.15 వేల రూపాయల వరకు దహన సంస్కారాలకు డిమాండ్ చేసి మరి దోచుకునేవారు. క్రమంగా ఆ ధర ఇప్పుడు 5 వేలకు చేరింది.
జోన్ల వారీగా సౌకర్యాలు..
దహన సంస్కారాలకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కృష్ణాపురంలోని మరో స్మశాన వాటికను అభివృద్ధి చేస్తోంది.దహన సంస్కారాలకు అనువైన అన్ని ఏర్పాట్లు విస్తరిస్తోంది. వాటికి తోడు ఇతర జోన్లలో ఉన్న స్మశానవాటికల్లో దహన సంస్కారాలకు అనుమతి ఇచ్చింది.స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు అందాయి.విశాఖలోని 8 జోన్లలో 17 స్మశానవాటికల్లో అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేసింది.నిర్వహణ బాధ్యతలను ఇన్‌ఛార్జిలకు అప్పగించింది.రెండు షిఫ్టుల్లో వర్క్ ఇన్స్‌పెక్టర్‌లను ఆయా జోన్లలో కేటాయించింది. వీటికి తోడు దహన సంస్కారాలకు ఎలక్ట్రిక్ యంత్రాల సాయాన్ని కూడా తీసుకుంటున్నారు.రానున్న రోజుల్లో అంతిమ సంస్కారాలు అయినా ప్రశాంతంగా చేసుకునే సమయం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.