ప్రజాప్రతినిధులు బాధిత గ్రామాల్లో పర్యటిస్తున్నారంటే.. నష్టపోయిన ప్రజలు తమ కష్టాలు తీరుతాయని ఆశిస్తారు. నిజానికి జరగాల్సింది కూడా అదే. కానీ.. వాస్తవంలో పరిస్థితి అలా లేదు. కష్టాలు చెప్పుకోడానికి తమ వాహనం చెంతకు వస్తే చాలు.. నాయకులు వారిని కసురుకుంటున్నారు. కోప్పడుతున్నారు. పక్కకు తొలగమని చెప్పి.. ముందుకు వెళ్లిపోతున్నారు. ఏమిటిది? ఎక్కడిలా జరుగుతోంది? అనుకుంటున్నారా? గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల పర్యటన సందర్భంగా పరిస్థితి ఇది.
స్థానిక ఎమ్మెల్యే మేరుగ నాగార్జున కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో పర్యటించారు. మంత్రులు కూడా గ్రామాల్లో పర్యటించారు. ప్రజలు వారికి కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. సమస్యలు పెద్దగా వినిపించుకోకుండానే.. ఏదో టూరుకు వచ్చినట్టుగా మంత్రులు వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా బుదరమయంగా, నీటిమడుగుల్లా మారిన రోడ్లమీద ఒక ట్రాక్టరు ఎక్కి ప్రయాణించిన మేరుగ నాగార్జున కు ప్రజలు బాధలు చెప్పుకోడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఆగ్రహించారు. ‘ఏం కావాల్రా మీకు..’ అంటూ కోప్పడ్డారు. వాళ్లు చెప్పేది పూర్తిగా వినకుండానే.. వాళ్ల మీద యాక్షన్ తీసుకుంటాంలే నువ్వు పోనీ.. అంటూ ట్రాక్టరుపై వెళ్లిపోయారు.
ఈలోగా ఎమ్మెల్యే అనుచరులు వచ్చి.. బ్రదరూ నువ్వు తీయలేదుగా.. అంటూ ముందు వాహనం మీద ఉన్న మీడియా వాళ్లను ప్రశ్నించడం కొసమెరుపు.
ఎందుకీ పర్యటనలు..
ఏదో కంటితుడుపుగా బాధితగ్రామాల్లో తిరగడం తప్ప.. ప్రజలతో మాట్లాడకుండా.. వాహనం దిగకుండా, కనీసం వాహనం చెంత నిలబడి వారు చెప్పదలచుకున్న కష్టాలు కూడా వినకుండా.. సాగించే ఈ యాత్రలు ఎందుకని ప్రజలు ఈసడించుకుంటున్నారు.